కౌసల్య కుమారుడు పసిష్టుల వారివైపు చూచుచు యేదో పాత పరిచయమున్నట్లు చూపరులకు ఆశ్చర్యము కల్గించునటుల వశిష్టులవారిని చెంతకు రమ్మని పిలచినట్లు ఆ బాలుడు గంతులు వేయదొడగెను. అంత గురువు ఆబాలుని చర్యలను చూచి ఆనందమును పట్టలేక, ఆనంద బాష్పములు తుడుచుకొంటూ, అక్షతలు చేతపట్టి "రాజా! కౌసల్యానందవర్ధనుడు అందరికి ఆహ్లాదము కలిగించును. అతని గుణరూపములు అందరినీ క్రీడింపజేయును. యోగులే ఇతనిని రమింతురు. కనుక నేటి నుండి ఈ బాలుడు "రాముడ"ను పేర బరగుచున్నాడు",అని కౌసల్యా నందనునకు రాముడని నామకరణము గావించెను.
అంత ఋషులు భళీ భళీ సరియైన నామమని ఆనందించిరి. తదుపరి సుమిత్రా నందవర్ధములైన ఇరువురు బాలురను తిలకించి, పెద్ద బాలుని చూచి శౌర్య వీర్యములను ప్రదర్శించు లక్ష్మీసంపన్నుడు కాగలడనియు, లక్ష్మినారాయణుల సేవనే తన శ్వాసగా భావించి, ఆచరించును కనుక ఈతనికి లక్ష్మణుడనియు, అతని తమ్ముడు శత్రువులను నాశనము చేసి అన్నల జాడల ననుసరించి, శాంత చిత్తుడైప్రవర్తించును కనుక ఆ బాలుడు శత్రుఘ్నుడనియు పిలువబడును అని ఆశీర్వదించెను.
తదుపరి కైకేయీ నందవర్ధనుడగు బాలుని చూచి, ఈతడు అందరి అంతః కరణములను ప్రేమానందములతోనింపుటే కాక, ఆశ్చర్యకరమైన ధర్మప్రవృత్తి గలవాడగు ననియు, ప్రజలకు భరణ పోషణములను గావించును కనుక, అతనికి భరతుడనియు నామకరణము గావించితినని వసిష్ఠులవారు తెలుపగనే ప్రజలు పిల్లల భవిష్యత్తు కూడా ఇట్టివి కాగలవని విశ్వసించి, ఆనాటినుండి కౌసల్యానందనుని రాముడనియు, సుమిత్రానందనులను లక్ష్మణ శత్రుఘ్నులనియు, కైకేయినందనుని భరతుడనియు పిలువదొడగిరి.
(రా.వా.మొ.పు. 32/33)
(చూ|| రామాయణము)