మన చరిత్ర పవిత్రమైన రీతిగా విచారణ చేసి చూసినప్పుడు ఒక్కొక్క వ్యక్తి తన చూపులు, తన శ్రవణము, తన పలుకులు ఎంత కంట్రోలులో పెట్టుకొని ఉండేవారో చూచుకోవచ్చు. ఒక చిన్న ఉదాహరణము. శివధనుస్సు విరచిన తరువాత శ్రీరామచంద్రునికి సీతనిచ్చి వివాహము చేసేదానికి సిద్ధమయ్యాడు జనక మహారాజు. కానీ దీనికి పూర్వము ఒక్క క్షణమైనా సీతను రాముడు చూచి ఎరుగడు. వివాహము కాక పూర్వము ఆమె పరస్త్రీ, పరస్త్రీని కన్నెత్తి చూడకూడదు. శ్రీరామచంద్రుని శీలముయొక్క పవిత్రత. దీని బాధ్యత తల్లితండ్రులు చూచుకుంటారు. చూడకూడదని ఉన్నాడు. పెండ్లి పీటల పై కూర్చున్నారు. తిరిగి మంగళ సూత్రము కట్టే ముందు లేచి నిల్చున్నారు. సీత ఎడమభాగములో వున్నప్పుడు రాముడు కుడి వైపు చూస్తున్నాడు. ప్రక్కనే ఉన్న జనకమహారాజు చెబుతున్నాడు. ఇయం సీతా, రామా! సీత యిక్కడున్నది. నీవు ఎక్కడో చూస్తున్నావు" అన్నాడు. అనేక పర్యాయములు చెప్పాడు. ఏమాత్రము తాను లెక్క చేయలేదు. కారణం ఏమిటి? ఇంకా మంగళ సూత్రం కట్టలేదు. ఆ స్త్రీని మనం చూడకూడదు. ఇలాంటి ఆదర్శమును జగత్తునకందించిన వాడు చరిత్ర పురుషుడు రామచంద్రుడు.
ఆ సోదరులందరు ఆ విధంగానే ప్రవర్తించారు.శ్రీరామునితో లక్ష్మణుడు అరణ్యమునకు బయలుదేరి వెళ్లాడు. ఒక దినము రెండు దినములు కాదు. పదునాలుగు సంవత్సరములు. వీరి వెంట సీత కూడా ఉంటున్నది. సీత చాలా యువ్వనవతి. 18 సంవత్సరముల వయస్సు 20 సంవత్సరముల వయస్సు గలిగిన రామ లక్ష్మణులు వెంటనే ఉంటున్నప్పుడు ఈ పదునాలుగు సంవత్సరములు సీత ముఖము చూచి ఎరుగడు లక్ష్మణుడు. సీతను రావణుడు తీసుకుపోయిన తరువాత లక్ష్మణుడు, రాముడు సీతను వెతక్కుంటూ వెడుతున్నారు. ఒక పర్వతము పై సుగ్రీవుడు హనుమంతుడు ఉండేవారు. ఆ జన సమూహమును జూచి సీత తన నగలను మూటగట్టి ఆ పర్వతముపై వదలి పెట్టింది. సీతాన్వేషణ నిమిత్తమై పోతున్న సమయంలో సుగ్రీవుడు వారికి స్నేహమయ్యాడు. వీరి చరిత్ర సుగ్రీవునికి చెప్పారు. సీతను తీసుకుపోయారు ఎవరో. వారిని వెతకటానికి మీ సహాయము అత్యవసరమన్నాడు. ఆ మాట విన్న లక్షణమే సుగ్రీవుడు ఒక మూట తెచ్చి యిచ్చాడు. ఈ నగలు సీతమ్మవేనా చూడండి అన్నాడు. రామునికి కూడా భార్య నగలు ఏవో తెలియదు. అప్పుడు లక్ష్మణుని ముందు పెట్టాడు. లక్ష్మణా! ఈ నగలు మీ వదినవేమో చూడ మన్నాడు. అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు. ఈ కంఠ హారము ఎవరిదో తెలియదు. ఈ కంకణములు ఎవరివో నాకు తెలియదు. కానీ కాలి అందెలు మాత్రము సీతవే. అని నాకు చక్కగా తెలుసు" అన్నాడు. ఆ అం దెలు మాత్రం నీకు ఎట్లా తెలుసు" అని రాముడు అడిగాడు. ఆమెకు దినము పాదాభివందనము చేసేవాడిని. ఆమె యొక్క పాదములపై యీ నగలున్నవి. చూచాను అన్నాడు లక్ష్మణుడు. పదునాలుగు సంవత్సరములు ఆడవిలో నుండినప్పటికిని ఒక్కక్షణమైనా సీత ముఖము చూచి ఎరుగడు లక్ష్మణుడు. ఈ విధమైన శీలము పోషించుకుంటూ రావటం చేత వారు ఆనాడు ఆదర్శపురుషులుగా రూపొందుతూ వచ్చారు.
(శ్రీ..స.పు.52/53)