దైవనామాన్ని ఉచ్చరించడానికి భయమెందుకు? వీధివీధిలోనూ, వాడవాడలోనూ దైవనామాన్ని చాటండి. రామనామంగాని, కృష్ణనామం గాని, శివనామంగాని... మీకు ఏ నామం ఇష్టమైతే ఆ నామాన్ని స్మరించండి. ఈనాడు భగవన్నామస్మరణ సన్నగిల్లడంచేతనే ఇంటింటి యందు చిక్కులు బయలుదేరుతున్నాయి. అన్న దమ్ముల మధ్య కూడా కలహాలు ప్రారంభమౌతున్నాయి. కారణమేమిటి? హృదయంలో పవిత్రత లోపించడంచేత బయటినుండి అపవిత్రత ప్రవేశిస్తున్నది. అందరూ ధనంకోసం, పదవుల కోసం ప్రాకులాడుతున్నారు. ఏమిటీ ధనం? ఏమిటీ పదవులు? ఇవి మనలను రక్షించగలవా? ఎంతమంది ధనవంతులు లేరీ! ప్రపంచంలో ఎంతమంది అధికారులు లేదా ప్రపంచంలో! వారేమైనా సుఖశాంతులను పొందగల్గుతున్నారా? లేదు. లేదు. మానవునికి సుఖశాంతులను ఆనందాన్ని అందించేది భగవన్నాము స్మరణ ఒక్కటే. భగవన్నామాన్ని అలక్ష్యం చేసేవారికి అధోగతి తప్పదు.
"ఓం నమశ్శివాయ" అనే పంచాక్షరీ మంత్రానికి మ కారము ప్రాణసమానం. దానిని తొలగిస్తే అది నశ్శివాయ అవుతుంది; అనగా, అమంగళకరమై పోతుంది. అట్లే, "ఓం నమో నారాయణాయ" అనే అష్టాక్షరీ మంత్రానికి ర కారము ప్రాణ సమానం. ర’కారము లేకపోతే అది కూడా అమంగళకరమైపోతుంది. పంచాక్షరీ మంత్రానికి ప్రాణ సమానమైన మ కారము, అష్టాక్షరీ మంత్రానికి ప్రాణ సమానమైన ర’కారము... ఈ రెండింటి చేరికచేత ఏర్పడినదే రామనామము.
విద్యార్థులారా ప్రజలారా! భక్తులారా! భగవన్నామస్మరణ తప్ప మిమ్మల్ని రక్షించేది మరొకటి లేదు. ధనము, పదవులు ఈనాడు వస్తాయి. రేపు పోతాయి. వాటికోసంమీరు ప్రాకులాడకూడదు. ఎవరికైనా అధికారబలము రావచ్చును. దీనివల్ల రాజకీయాలవల్ల. అలాంటి అధికారం ఎంతకాలముంటుంది? ఊపితే పోతుంది. కనుక, రాజకీయాలవల్ల లభించే అధికారం కోసం ప్రాకులాడవద్దు. ఎవరి హృదయంలో భగవన్నామం నిండియుంటుందో వారే నిజంగా ధన్యులు, పుణ్యులు. ఇష్టం లేనివారు వద్దని చెప్పవచ్చును. రాముడే లేడని మీతో వాదించవచ్చును. "రాముడు నీకు లేకపోవచ్చును. కాని, నాకున్నాడు. నా రాముడు లేడనటానికి నీవెవరు?" అని వారికి మీరు బుద్ధి చెప్పాలి. ఎలాంటి పరిస్థితిలోనూ భగవన్నామ స్మరణను మాత్రం వదలకండి. ‘సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచంతనం చేయండి.
రామ రామ రామ సీతా
రామ రామ రామ సీతా
1. శ్రీమద్రవికులమందు జనించి
సీతాదేవిని ప్రీతి వరించి
ప్రేమ నహల్యా శాపము దీర్చి
ప్రియ భక్తుల రక్షించిన శ్రీ రఘు !రామ!
2. గురునాజ్ఞను వనమందొనరించి
గుహుని భక్తి కానందము చెంది
పరమాదరమున భరతుని గాంచి
పాదుక లొసగిన పావనచరితుడు !రాము!
3. ఖరదూషణాది దనుజుల ద్రుంచి
కరుణ జటాయువు గతి సవరించి
శరభంగాది మునీంద్రుల బ్రోచి
శబరిఫలమ్ములు ప్రేమ భుజించిన !రామ!
4. ముందుగ హనుమంతుని దీవించి
ముదమలరగ రవిసుతు పాలించి
చెంగిన కినుకతో వాలిని ద్రుంచి
చేరిన వానర వీరుల బ్రోచిన !రామ!
5. రావణాది సురవైరుల ద్రుంచి
రమణితోడ సాధుల పాలించి
దేవతలెల్ల నుతింపగవేసి
దేవి గూడి పురి జేరిన శ్రీరఘు !రామ!
6. నిజసహోదరులు నిను సేవింపగ
నిన్ను కూడి ప్రజలెల్ల సుఖింపగ
అజహరాది సురులెల్ల నుతింపగ
ఆనందముతో నయోధ్యనేలిన !రామ!
రామనామమను ప్రసాదమిదిగో! రండి భక్తురాలా!
భూమిలొ దొరకెడి ప్రసాదములు దిని
పామరులై చెడిపోవకురండీ !రామ!
వేదసారమను గోధుమపిండిలొ
వేదవాక్యమను క్షీరమె బోసీ
ఆధారమైన పెద్ద భాండము దీసి
ఆదిమునులు దీని పాకము బట్టిరి
నిబద్ధియను కండచక్కర దెచ్చి
సుబుద్ధియను యావు నెయ్యే వేసి
అబద్దమనియెటి మలినము దీసి
ఆదిమునులు దీని పాకము బట్టిరి !రామ!
(స. సా..మే. 2002 పు 146/147)
"చక్కర కంటె తీపి; ఘనపారముకంటెను రుచ్యమౌను; పెం
పెక్కిన తేనె కన్న అతిరుచ్యము; నోటను పల్కపల్కగా
మిక్కిలికమ్మనౌ అమృతమే యనిపించును; కాన నిత్యమున్
చక్కగ దాని మీరు మనసా స్మరియింపుడు రామనామమున్"
(ఆ.రా.పు.1)
అకార ఉకార మకారముల చేరికయే ఓంకారము. అకారము లక్ష్మణుడు, ఉకారము భరతుడు, మకారము శతృఘ్నుడు. ఈ మూడిటి ఏకత్వమైన ఓంకారమే రాముడు. ఈ రామనామము యొక్క విశిష్టత ఏమిటి? సంఖ్యాశాస్త్ర పరంగా రా+మ2+5=7 అవుతుంది. అనగా సప్త సముద్రములు, సప్త వర్ణములు, సప్తస్వరములు, సప్త ఋషుల తత్వాన్ని ప్రబోధించునదే రామనామము. ప్రజ లీనాడు రామనామ సప్తాహములను జరుపుకోవడంలో గల అంతరార్థమిదే.
(స.సా.ఫి.97 పు.55)
“రామ నామము ఎటువంటి దంటే –చక్కెర కంటె తీపి
దధి సారము కంటెను రుచ్యమౌను; పెంపెక్కిన తేనె కన్న
అతి రుచ్యము; నోటను పలుకగా అమృతమే యనిపించును.
కావున, నిత్యమూ ఈ రామనామాన్ని చక్కగా స్మరింపుడు."
(స.సా. జూ 94 పు.150)
జపతపములు లేక పోయినను. నీవు రాముని వలె పితృభక్తియు, మాతృభక్తియు కలిగి యుందువేని రామ నామము నిన్ను కాపాడును. లేనిచో రామనామజపము వట్టి పెదవుల కదలిక మాత్రమే యగును. రామధ్యానశ్లోకములు పఠించునప్పుడును, రామకోటి వ్రాయు నపుడును, మనసును రాముని స్వరూపమునందును రాముని స్వభావమునందును నిల్పుము. అది నీ మనసునకు ధైర్యమును, తుష్టిని, పుష్టిని కలిగించును.ఆత్మ - విచారజ్ఞానము నలవరుచును. ఈ శ్రీరామనవమి దినమున ఈ ధర్మస్వరూపమును మీ యాత్మారామునిగా చేసుకొనుడు.
(స.వ.పు.5)
రామ్ అనే పదములోపల రా అనగా మనో ద్వారము తెరుస్తూ ఉంటుంది. ఈ రా అనే ద్వారమునుండి మనము చేసేటువంటి పాపములన్నీ బయటపడిపోతున్నాయి. అంతేకాదు, బయటకుపోయిన యీ పాపములు తిరిగి లోపలికి ప్రవేశించకుండా మ్ ద్వారము మూసుకుపోతుంది. కొండల వంటి పాపములుకూడా ఒక్కతూరి రామనామముతో భస్మమైపోతాయి. రామనామమునకుండిన మాధుర్యము, రామనామమునకుండిన దివ్యత్వము అర్థము చేసుకొని వర్తించాలి. (దివ్యఙ్ఞాన దీపికలు ప్రథమ భాగము పు 4)