మానవుడు మూడు విధములైన ఋణములతో జన్మిస్తున్నాడు. ఈ మూడు ఋణములను నివృత్తి చేసుకోవడం మానవుని కర్తవ్యం. మొదటి ఋణము దేవ ఋణము, రెండవది ఋషి ఋణము, మూడవది పితృఋణము.
వీటిని ఋణములని చెప్పడంలోని అంతరార్థమేమిటి? మనకేదైనా ఒకరు ఆర్జించి, అందించినప్పుడు అది ఋణమవుతుంది. తమ దివ్యత్వము, తమ పవిత్రత మొదలైన దివ్య సంపదలను మనకందించినప్పుడు అది ఋణముగా రూపొందుతుంది.
మానవ దేహమును సర్వత్రా అనేక విధములైన దైవ శక్తులు ఆవరించి యున్నవి. ఎట్టి ప్రమాదములు సంభవించకుండా ఏ విధమైన అవాంతరములు వాటిల్లకుండా అవి ఈ దేహమును పోషిస్తుంటాయి. ఈ దైవశక్తి రస స్వరూపమై సర్వాంగములందు సంచరిస్తుంది. అందుచేతనే దైవత్వమునకు "రసోవైసః " రస స్వరూపుడని పేరు. ఈ దైవత్వము దేహము నందు సర్వత్రా వ్యాపించియున్నది. సర్వత్రా వ్యాపించడమే కాకుండా సర్వాంగములను కూడా చలింప చేస్తున్నది. దేహమే మానవునకు ప్రధాన సాధనము. జంతూనాం నరజన్మ దుర్లభం పవిత్రమైన, ఆదర్శమైన, అమూల్యమైన మానవాకారమును అందించి, దానిని అనేక విధముల పోషిస్తున్న దైవానికి కృతజ్ఞత చెప్పవలసిన బాధ్యత మనకెంతైనా ఉన్నది. ఈ విధమైన కృతజ్ఞతా మార్గమును అనుసరించినప్పుడే దైవము అనుగ్రహించిన ప్రాప్తిని మనము కొంతవరకైనా అనుభవించగలము. మనలను సంరక్షిస్తున్న దైవము ఋణమును తీర్చుకున్నప్పుడే మన జన్మ సార్థక మవుతుంది.
అయితే ఈ ఋణమును తీర్చుకొనే విధానమేమిటి? దేహము చేత పరోపకారములు, పవిత్ర కార్యములు. దివ్య భావముతో సమాజములో సలిపినప్పుడు మనము దైవ ఋణమును తీర్చుకొన్నవారమవుతాము. కేవలం తిండి, నిద్రలను అనుభవించడానికి ఈ దేహము రాలేదు. తిండి, నిద్ర, భయ, మైధునాదులు దీని లక్ష్యములు కావు. వీని నాధారము చేసుకొని దేహమును పోషించుకొని, దేహము ద్వారా ఆదర్శవంతమైన కర్మ లాచరించాలి. పవిత్రమైన పరోపకార కార్యముల నాచరించినప్పుడు, దేహమును సంరక్షించిన దైవము ఋణమును తీర్చినవారమవుతాము. దైవ సంరక్షణ లేకుండిన ఈ కాయము క్షణమైనా జగత్తులో నిలువ వీలుకాదు. సత్కర్మల నాచరించిన కాల కర్మకారణ కర్తవ్యాల చేతనే ఈ జన్మను సార్థకం చేసికోవాలి. సత్కర్మల చేత ఈ ఋణమును తీర్చుకొనని ఎడల అనేక జన్మలు ఎత్తవలసి వస్తుంది. ఎంత త్వరగా ఈ ఋణమును తీర్చుకొంటామో అంత త్వరగా పవిత్రమైన దివ్యత్వమును అనుభవించగలుగుతాము.
రెండవది ఋషి ఋణము. ఋషులు మనకిచ్చిన సంపద ఏమిటి? వీరు స్వార్థ రహితులై తాము తరించి, తోటి మానవులను కూడా తరింప జాయాలని అనేక పరిశోధనలు సలిపి ఇహమునకు పరమునకు సాధనా మార్గములను కనిపెట్టారు. ఐహిక జీవితమునందు మానవుడు ఏవిధముగా దోషరహితమైన కార్యముల నాచరించుటకు సాధ్యమవుతుందో విచారించి, దివ్య సందేశముల నందించారు. జీవనోపాధి నిమిత్తమై చేయ తగినవేవో చేయరానివేవో విధి విధానములను వివరించి, వీటికి శాస్త్రములని పేరు పెట్టారు. మానవుడు ఏ విధమైన మార్గము ననుసరించాలో ఏ విధమైన మార్గమును అనుసరించ రాదో నిర్ణయించి తద్వారా శాసించారు. ఇహమునే గాక పరమును కూడా పొందడానికి మానవుడు ఏ మార్గమును అనుసరించాలో నియమముల నేర్పరచి బోధించారు. భగవత్ ప్రీతికరమైన కార్యముల నాచరించి, యజ్ఞ యాగాది క్రతువులు సలిపి తద్వారా పరమును పొందే అధికారము మానవున కున్నదని నిరూపించారు. మానవ లక్ష్యాన్ని మరువక, మానవత్వాన్ని విడువక, మానవుల యందు మానవుడుగా జీవించే దివ్య తత్వాన్ని వారు బోధించారు.
మానవత్వాన్ని ప్రకటించే నిమిత్తమై అనేక విధములైన మార్గములను బోధిస్తూ, శాసిస్తూ వస్తున్నవి శాస్త్రములు. ఇతర దేశములలో వీటిని శాస్త్రములని పిలువక పోయినప్పటికీ ఏవో కొన్ని నియమముల పేరుతో వాటిని పరిగణిస్తూనే ఉన్నారు. ఈ నియమములేలేకున్న మానవులు జగత్తులో క్షణమైనా జీవించ సాధ్యము కాదు. నియమము తప్పిన మానవుడు అనేక బాధలకు గురి అవుతాడు. ఈ బాధలు మనకు అప్పటికప్పుడు కనిపించక పోయినప్పటికినీ, వాటికి ఏనాడో ఒకనాడు గురికాక తప్పదు. మానవుడు పరిపూర్ణుడు కావలెనన్న ఈ శాస్త్రములను, నియమములను అనుసరించి ఋషి ఋణమును తీర్చుకొని దివ్యత్వమైన దైవత్వమును అనుభవించాలి. ఏతావాతా మానవత్వాన్ని నిలుపుకొనే నిమిత్తమై అనేకమైన ఆధారములను, ఆదర్శములను అందించి నటువంటివారు ఋషులు గనుక, వారి ఋణమును తీర్చుకొనడము రెండవ ప్రధాన కర్తవ్యము. అయితే ఈ ఋణమును తీర్చుకొనే మార్గమేమిటి? ఈ శాస్త్రములను ఉల్లంఘించక, వాటి ప్రకారము తూ.చ తప్పక నడచుకొంటూ విరుద్ధ మార్గముల ననుసరించకుండా ఉండడమే వారి ఋణమును తిర్చుకొనుటకు సరియైన రాజ మార్గము. దురదృష్టవశాత్తు మానవుడు ఈనాడు శాస్త్రములను ఉల్లంఘించడమే కాకుండా, వాటిని నిర్మూలించడానికి అనేక పాపములకు పూనుకొని, కష్టములకు నష్టములకు దుఃఖములకు గురి అవుతున్నాడు. కనుక శాస్త్ర నియమములను, పెద్దలు అనుభవించిన ఆదర్శములను, తూ.చ. తప్పక నడచుకొని తద్వారా మానవత్వమును ప్రకటింప చేయడానికి, వికసింప చేయడానికి, తగిన కృషి చేయాలి.
ఇంక మూడవది పితృఋణము. సామాన్యముగా ప్రతి మానవుడు తనకు కుమారులు కావాలని ఆశిస్తాడు. పుత్రులు లేని జీవితము పున్నామ నరకమునకు మార్గమని అంటారు. కాని ఇది సరియైనది కాదు. సరియైన ఆదర్శాన్ని, తండ్రి పేరును, సత్సంపత్తిని అభివృద్ధి పరచి ఋషి ఋణమును దైవ ఋణమును తీర్చుకొనేందుకు సహకారులుగా ఉండాలని ఆనాడు కుమారులను కోరేవారు. పుత్రుని భవిష్యత్తుకు తండ్రి అనేక విధములైన ఆదర్శములను అందిస్తూ, తన పుత్రుని అభివృద్ధి కోరుకుంటాడు. పుత్రుడు పెడమార్గము పట్టిన అది తండ్రి దోషమే. కనుకనే దశరథ మహారాజు ఈ మూడు ఋణములను తీర్చుకొనే నిమిత్తమై అనేక యజ్ఞయాగాది క్రతువులు సలిపి, ఆ యజ్ఞములు ఆచరించే సమయమునందు తన నలుగురు కుమారులను చెంత నుంచుకొని వారికి అనేక ఆదర్శములను బోధించేవాడు. కొమరునకు తండ్రి ఆస్తిపాస్తులయందు మాత్రమే కాదు. అతని ఆస్తిక్యమునందు కూడా అధికారమున్నదని పిల్లలకు బోధించాలి. అయితే ఉత్తమ ఆదర్శములను పాటించడం మాత్రమే పుత్రుని ప్రధాన కర్తవ్యం గాని, అతని దుర్గుణములను, దురభ్యాసములను అనుసరించడం పితృఋణం తీర్చుకోవడం కాదు. తండ్రి చెడ్డవాడైనప్పటికీ పుత్రుడు సుపుత్రుడుగా అభివృద్ధిచెంది సత్సంగంలో చేరి, సదాలోచనలు సలిపి, సత్కార్యాలలో పాల్గొని, సత్కీర్తిని ఆర్జించినప్పుడు తండ్రి పాపములను కూడా పరిహారము చేసిన వాడవుతాడు.
ఒకప్పుడు వశిష్టులవారు దశరథునికి ఈ విధముగా బోధించారు. : మహారాజా! నీ జీవితములో అనేక విధములైన పాపములను తెలిసో, తెలియకనో జరిగినవి. అజ్ఞానం చేతనో, అహంకారం చేతనో, భ్రాంతి చేతనో శ్రవణ కుమారుని హతమార్చావు. వృద్ధులైన అతని తల్లిదండ్రులు ఎంతో పరితపించి ప్రాణములు వదలినారు. ఇంకా దేవాసురుల యుద్ధములందు అనేక పాపములు చెయ్యడానికి నీవు వెనుదీయలేదు. ఇట్టి పాపములన్నీ శ్రీరామచంద్రుడు శివధనుస్సును విరచి, రాక్షస సంహారం చేసి, ఋషులకు బలమును, రక్షణను కల్పించడం వల్ల పరిహారమైనాయి. ప్రజలను సరియైన మార్గములో నడిపి, ఋషులకు భద్రత చేకూర్చి వారి ఆజ్ఞలను శిరసావహించిన రామచంద్రుని సద్గుణమే నీ సర్వపాపములకు సరియైన ఔషధ మైనదన్నాడు. కనకనే తరతరములనుండి పితృఋణమును తీర్చుకొనే నిమిత్తమై భారత దేశమందు పిత్రు తర్పణములని ఏ కొద్దిమందో ఆచరిస్తున్నారు. మన దేహము, దేహమునందున్న రక్తము. మన తల్లిదండ్రుల రస స్వరూపమే. అలాంటి వారి రక్తమును మనమనుభవించి తిరిగి వారికి కృతజ్ఞత నందించకపోవడం ఒక పాపముగా పరిగణించారు మన పూర్వీకులు. మన కృతజ్ఞత నందించే నిమిత్తమై ఏర్పడినవే ఈ దైవ ఋణము, ఋషి ఋణము పితృఋణములు. అయితే ఈ మూడు ఋణములను యజ్ఞయాగాదుల ద్వారా తీర్చుకొన వచ్చునని ఋషులు బోధించారు.
ఋణము కంటెను నరునకు రోగమేది?
ధరణి నపకీర్తి కంటెను మరణమేది?
సర్వదా కీర్తి కంటెను సంపదేది?
స్మరణ కంటెను మించు నాభరణమేది?
(1995 నవంబర్ - బాబా. శ్రీవాణి09- 2021పు27)