నీ అంతరాత్మయే నిన్ను ప్రేరిపిస్తుంది. మంచి పనులు చేయునపుడు, చెడ్డపనులు చేయునప్పుడు చెప్పుతుంది. నీఅంతరాత్మ చెప్పినదానివి వింటే ఎప్పుడూ చెడిపోవు. (సా. పు. 585)
అంతరాత్మ కన్న అధ్యాపకుడు లేడు
అరయ కాలమొకటే పరమ గురువు
గ్రంథరాజం బేది ప్రత్యక్ష లోకమే
ఎవడు స్నేహితుండు. ఈశ్వరుండె!
(స.సా.ఫి. 2000 పు. 50)
ప్రేమస్వరూపులారా! మీ హృదయాన్ని కడిగి పరిశుద్ధ పరచుకొని, పవిత్ర భావములతో నింపుకొని సత్కర్మల నాచరించండి. హృదయంలో భగవన్నామాన్ని నింపుకోండి, చేతులతో సేవ చేయండి. "దిల్ మే రామ్, హాల్ మే కామ్", ఇదే సరియైన మార్గము. అప్పుడు మీకు దైవమే సహాయం చేస్తాడు. పూలు, సూది, దారముంది. పుష్పమాల తానగునా? కూర్చేవాడొకడుండాలి కదా! ప్రమిద, నూనె, పత్తి కలవు. దీపపు వెలుగు కలుగునా? వెలిగించేవాడొక డుండాలి కదా! అదేరీతిగా, దేహమును, మనస్సుమ, బుద్ధిని చిత్తమును పనిలో ప్రవేశ పెట్టడానికి ఒక యజమాని ఉండాలి కదా! ఆ యజమానియే ఆత్మ. అదియే మీ Conscience (అంతరాత్మ). దేహ మొక నీటి బుడగ మన స్సొక పిచ్చికోతి. కాబట్టి, దేహాన్ని, మనస్సును అనుసరించకండి. అంతరాత్మను అనుసరించండి. అంతరాత్మ సలహాను పాటించండి, ఇతరుల సలహాలు మీకక్కర్లేదు. (స.సా,మే2000 పు.154/155)