మొట్టమొదట మానవత్వంలోనున్న దివ్యత్వమును మీరు ఆర్థం చేసుకోవాలి. ఏది చేసినా, ఏది చూసినా ఏది చెప్పినా ఏది అనుభవించినా అంతా దైవ సంకల్పం చేతనే జరుగుతున్నది. గాని, మానవ సంకల్పంచేత కాదు. మానవుడు నిమిత్త మాత్రుడేగాని, సూత్రధారి కాదు. దైవ సంకల్పం చేతనే సర్వ కార్యములు జరుగుచున్నవి. మీరు దేహంలో కర్మలను ఆచరించి తత్పలితమును పొందుతున్నారు. మీ దేహంలో కూడా మీ ప్రయత్నం లేక భగవంతుని సంకల్పంతో పని చేయునట్టి అంగములు అనేక ముంటున్నవి. గుండె ఆడుటకు మీరు ఏ ప్రయత్నం చేస్తున్నారు? మీ దేహంలో రక్త ప్రసరణకు ఏ ప్రయత్నం చేస్తున్నారు? భుజించిన అన్నం జీర్ణం కావడానికి మీరు ఏ ప్రయత్నం చేస్తున్నారు? ఇవన్నీ దైవసంకల్పంలోనే జరుగుతున్నాయి. మంచి చెడ్డలు రెండింటికి దైవ సంకల్పమే మూలకారణం. ఏది జరిగినా ఇది నా మంచికోసమే అనుకోవాలి. కష్టంగాని, నష్టంగాని, దుఃఖంగాని, ఆనందంగాని ఏది జరిగినా మీ మంచి కోసమే. భగవత్సంకల్పం లేక ఏదీ జరగడానికి వీలు కాదు. కనుకనే ఆనాటి మునులు చెప్పారు.
“కదలదు నీదు సంకల్పము లేనిదె గడ్డిపోచయును
అదియు విదియు ననగ నేల?
పిపీలికాది బ్రహ్మపర్యంతము నీవె
అది ఎరుంగరు భువిని కొందరు
వివేకమున వర్తించెదమని కడు విఱ్ఱవీగెదరుకాని
చివరికేవేళ ఏమి సంభవించునో తెలియ జాలరెంతవారలైన”
ఒక అడుగు ముందుకు పెట్టిన తరువాత రెండవ అడుగు వేసే లోపల ఏమౌతుందో ఎవరికీ తెలియదు. భవిష్యత్తు మీ హస్తంలో లేదు. ఒక గృహమునకు పునాది వేశారు. అది పూర్తి అయిన తరువాత దానికి ఘనంగా ప్రారంభోత్సవం జరపాలని అనుకుంటారు. కానీ, ఆ గృహం పూర్తి అయ్యేంతవరకు మీరు ఉంటారనే గ్యారంటీ ఏమిటి? మరుక్షణంలో ఏమౌతుందో కూడా మీరు చెప్పలేరు. కనుక, భగవంతునిపై భారం వేసి మీ కర్తవ్యమును నిర్వర్తించడం అత్యవసరం, దైవత్వం ఉన్నదా అనే సందేహం ఈనాడు అనేకమందికి ఉన్నది. ఏది దైవత్వం? సమిష్టి తత్త్వమే దైవత్వం. మన యొక్క అంతరాత్మ (Conscience) యే దీనికి సరియైన సాక్ష్యం .
(స.సా.ఆ. 99 పు. 272)
ఒక చిన్న ఉదాహరణ: ప్రపంచ యుద్ధములో యూరపులో అనేకమంది పురుషులు మరణించారు. ఆ తర్వాత యూరపు లోపల అందరికి మగబిడ్డలేపుట్టారు. కారణమేమిటి? ఈ మగ బిడ్డలే పుట్టకుండిన ఈ యొక్క ధర్మమనేది చాలావరకు నశించిపోతుంది. వర్ణ సంక్రమము ఏర్పడుతుంది. కనుక భగవంతుడు ఈ యొక్క ఈ విధమౌన సమత్వాన్ని పోషించుకుంటు వస్తుంటాడు. ఈ సమత్వమునకే కొన్ని భిన్నములు కలిగినప్పుడు జగత్తే ఆశాంతి పొందుతుంది. ఇది అన్నియు కూడ దైవ సంకల్పము పైననే ఆధారపడి ఉంటుంది. అట్టి ఆధారమైన దైవత్వాన్ని ఈనాడు మనము విస్మరించి లౌకికమైన లోకాన్ని విశ్వాన్ని విశ్వసించి మన మానవత్వాన్ని నిర్మూలము గావించు కుంటున్నాము. మరొక ఉదాహరణము: మనము తిన్నటువంటి అన్న మంతయూ రక్తంగా మారుతుంది. ఈ ఆహారాన్ని రక్తంగా మార్చే దెవరు? ఈనాటి వైజ్ఞానికులంతా అది law of nature, అంటారు. ఆ nature కు law ఇచ్చినటువంటి వాడెవడు? దానికి no reply. ఇదే దివ్యత్వము యొక్క నిజ తత్త్వము.
(స.సా.జాలై 89 పు.174)
(చూ|| స్వయం నిర్ణయాధికారం)