ప్రేమస్వరూపులారా! మీలోని దుర్గుణములను, దురభ్యాసములను ప్రశాంతి నిలయంలో వదలి పెట్టండి:సద్భావములను, సచ్చింతవలన మీతో తీసుకొని పొండి. అప్పుడే మీరిక్కడకు వచ్చినందుకు సరియైన ఫలిత ముంటుంది. లేకపోతే ఇంత ఖర్చు పెట్టి ఇన్ని శ్రమలలకోర్చి ఇక్కడకు వచ్చి ప్రయోజన మేమిటి? నేను మీ మంచిని అడగటం లేదు. మీ చెడ్డను నాకిచ్చేయండి. నేను మీకు మంచి నిస్తాను. పాడైపోయిన నూరురూపాయల నోటును ఎవ్వరి కిచ్చినా తీసుకోరు కాని అదే రిజర్వ్ బ్యాంకులో ఇస్తే దానికి బదులు మీకు మంచి నోటునిస్తారు. అట్లే మీవద్ద నున్న పనికిమాలిన దుర్గుణాలను మీ కన్న తల్లిదండ్రులైనా అంగీకరించరు కాని, నేను అంగీకరిస్తాను. నాకివ్వండి. నా నుండి పవిత్రమైన గుణాలను తీసుకొని పొండి. మీరు బాగుపడండి, సమాజమును బాగుపర్చండి. మీరు ఆనందించండి. మీ ఆనందాన్ని పదిమందికి పంచండి. అదే నేను కోరేది. ఇంక దేనిని నేను కోరటం లేదు. మీ దురభ్యాసములను ఇక్కడ వదలిపెట్టి సదభ్యాసములను తీసుకుపోతే మీ ప్రాంతంలో ఉన్నవారు మీలో వచ్చిన మార్పును గమనించి మీపై గౌరవం పెంచుకుంటారు. లేకపోతే పుట్టపర్తికి పోయి పది నెలలున్నా ఇతనిలో ఏమీ మార్పు లేదే: అనుకుంటారు. ఇక్కడికి వచ్చినందుకు మీలో తగిన మార్పును సమాజానికి చూపించాలి. వర్క్ షాపుకు పోయినకారు క్రొత్తనట్లు, క్రొత్తబోల్టులతో మంచిగా తయారై బయటకి వస్తే వర్క్ షాపుకు పోయినందుకు సార్థకత ఉంటుంది కాని ఎలా వెళ్ళిందో ఆలాగే తిరిగి వస్తే ప్రయోజన మేమి? సాధకులందరికీ ప్రశాంతి నిలయం ఒక పెద్ద వండర్‌ఫుల్ వర్క్ షాప్. ఈ వర్క్ షాప్లో చేసిన పనికి ఏమాత్రము బిల్లు వేసేది లేదు. ఎడ్యుకేషన్ ఫ్రీ, మెడికల్ ట్రీట్మెంట్ ఫ్రీ. అంతా ఫ్రీ! వీటిని అందుకోవడానికి మీ అందరికీ అధికార మున్నది. "ఐ యామ్ రెడీ" నేనెప్పుడూ సంసిద్ధంగానే ఉన్నాను. అనుభవించండి, ఆనందించండి.
(స. సా..మా.97పు.69)
ఈ ప్రదేశం త్వరలోనే ఒక షిరిడీగా, ఒక తిరుపతిగా ఒక వారణాసిగా రూపొందుతుంది. వేలకొలది యోగులు, సాధువులు, జిజ్ఞాసువులు ఈ క్షేత్రానికి వచ్చి ఆత్మశాంతినిమోక్షాన్ని పొందుతారు. ఇచ్చట నుండే సనాతన ధర్మోద్ధరణ కార్యక్రమము ఆరంభమవుతుంది. ప్రపంచం నలు మూలలనుంచి లక్షలాది మంది నన్ను వెదుక్కొంటూ ఇక్కడకు వస్తారు. ఆ అనంతమైన జన సందోహం చివర నిలబడి ఉన్నవారు సుదూరం నుంచి చిన్న చుక్కలా కనిపించే ఈ కాషాయరంగును చూసి తాము ధన్యుల మయ్యా మని భావిస్తారు.
(త.పు. 26/27)
"ఇది మానవులందరూ అద్భుతమైన ప్రశాంతిని పొందే ఒక దేవాలయం, ఒక చర్చి, ఒక మసీదు, ఒక యూదుల ప్రార్థనా మందిరం. మానవ రూపంలో అవతరించిన భగవంతుని అపారమైన ప్రేమలో లీనమై అత్యున్నతమైన ప్రశాంతిని ఇక్కడ అందరూ పొందవచ్చు. ప్రతి మానవుని హృదయం ప్రశాంతి నిలయంగా మార్చటమే నా లక్ష్యం. ఈ లక్ష్యం నెరవేర్చటం కోసమే నా ఈ అవతారం వచ్చింది” అన్నారు భగవాన్ బాబా. (తపోవనము పు 31)