ఆసలు ప్రశాంతి అన్న పద అర్థము సహితము యేమో ఎరగని వారు కూడా వున్నారు. అది ప్రతి మానవునకు వెన్నెముక వంటిది. సాధకునకు శ్వాసమువంటిది. ప్రశాంతి అన్న ఒక్కొక్కరు ఒక్కొక్క అర్థము తీసుకొని లౌకిక సంబంధమైన కార్యములు, అభీష్టములు నెరవేరిన అదియే శాంతి అని తలంచుదురు. అది నిజశాంతికాదు; క్షణ శాంతి.ప్రశాంతి అన్న, ప్ర అనగా వికశింపజేయుట; శాంతి అనగా కామ క్రోధ రాహిత్యము. కామక్రోధరాహిత్యమును వికశింపచేయుటే ప్రశాంతి అని అర్థము. శమము మానవునకు ముఖ్యాంగముగా భావించవలెను. అట్టి శమమును అభివృద్ధి చేయుటే సాధకుని కర్మ. సాధకునకుసార్థకము ప్రధానముకదా?శాంతే సార్థకము. అది మానవునకు స్వభావసిద్ధముగా నుండునది. వివేక, వైరాగ్య విచక్షణలు మానవునికే ప్రత్యేక అంగము అనియూ, వాటిని పెంపొందించు బలమే శాంతి అనియూ, అది ఆత్మ యొక్క కళయనియు, సర్వకార్యములందు సర్వశక్తులందు, సర్వానుభవములందు, శాంతి ఆత్మను పోలినదనియు అందురు. శాంతికికూడ అది అంత్యములు లేవు. ఏ కళంకము రాదు. దానికి అదియే సాటి. మరొక దానితో పోల్చుటకు వీలులేదు. అది మనోవాక్కాయ కర్మలయందు సమానముగానే యుండవలెను. అదే నిజశాంతి, ప్రశాంతి, ఆ ప్రశాంతిలేక లౌకిక, ఆముష్మిక, కైవల్యములందుకూడ సౌఖ్యము చేకూరదు. సర్వ సౌఖ్యములకు శాంతియే పుట్టినిల్లు, కైవల్యములందుకూడ సౌఖ్యము చేకూరదు. త్యాగరాజ చెప్పినట్లు శాంతములేక సౌఖ్యములేదు. ఇది ఎట్టివారికైన కావలెను. దాంతునిమొదలు వేదాంతుని వరకు శాంతి అవసరము. అది లేక లోకము నిమిషము సహితము నిలువలేదు. క్రోధము లేనంత సేపు శాంతి అనకూడదు. మనోభీష్టము నెరవేరినంత మాత్రమున శాంతి వచ్చినదనకుడు. వచ్చినశాంతి ఇంకే కారణముల వల్లనైనా తిరిగి మారకూడదు. అది ప్రశాంతి, శాంతికి మార్పులు లేవు. నేడు ఒక విధము, రేపు మరొక విధము, సంతోషమున ఒక విధము, దుఃఖమున ఇంకొక విధము. ఈ రీతిగా మార్పు చెందుచుండదు. అట్టి మార్పును రానీక సుఖ దుఃఖములను, మంచి చెడ్డలను సమముగా ఆనందింప జేయునదే శాంతి. దానిని ఎట్లు పొందవలెవో, దాని ఉపయోగము లేవో, దాని గుణగణము లేవో తెలుపునట్టిదే ప్రశాంతి వాహిని. దీనిని ప్రతి సాధకుడు అనుభవించ హక్కు కలదు;పొందుటకు మార్గము కూడా కలదు.
(ప్ర.వా.పు.1/2)