ప్రేమస్వరూపులారా! మనం ప్రతి సంవత్సరం ఇక్కడ క్రిస్మస్ పండుగ చేసుకొంటున్నాము. మీరు ఎన్ని దేశాల నుండియో వస్తున్నారు. అయితే నిజమైన క్రిస్మస్ పండుగ ఒక్క ప్రశాంతి నిలయంలో తప్ప మరెక్కడా జరగదు. ఎందుకంటే, బయట క్రిస్మస్ పండుగను క్రిష్టియన్లు మాత్రమే చేసుకొంటారు. హిందూ పండుగలను హిందువులు మాత్రమే చేసుకొంటారు. ముస్లిం పండుగలను ముస్లింలు మాత్రమే చేసుకొంటారు. కానీ ఇక్కడ అట్లా కాదు, అన్ని మతములవారు ప్రవేశిస్తున్నారు. సర్వమత సమన్వయమైనది మన ప్రశాంతి నిలయం. అనేకమంది అనేకచోట్ల మద్యపానంతో, మాంస భక్షణలో క్రిస్మస్ పండుగను జరుపుకొంటున్నారు. కాని మన క్రిస్మస్ అలాంటిది కాదు: తెల్లవారు ఝామున మూడు గంటలకు ప్రారంభమై రాత్రి పన్నెండు గంటల వరకు దైవచింతనచేత నిండిపోతున్నది. క్రిస్మస్ పండుగ ప్రశాంతి నిలయంలో ఒక హో లిడే యేగాని హాలీడే కాదు. ఇలాంటి పవిత్రమైన భావాలను హృదయంలో నింపుకొని, మీమీ స్వస్థానములకు వెళ్ళిన తరువాత వాటిని ఆచరణలో పెట్టండి. మేము భగవంతుని దూతలం" అనే భావాన్ని దృఢపర్చుకోండి. ఎక్కడికి వెళ్ళినా భగవత్సందేశాన్ని చాటుకొంటూ పొండి: భగవంతుని సువాక్యములను అందరికీ పంచండి. అదే మీ ప్రధానమైన కర్తవ్యం. అంతకు మించిన సేవ మరొకటి లేదు. అలా హృదయులను కూడా మీరు అమృత హృదయులుగా మార్చివేయాలి. ప్రేమచేత ఎలాంటి కఠిన హృదయులనైనా మార్చవచ్చును. అయితే కొన్ని హృదయాలు ఇనుప కడ్డీలవలె మరింత కఠినంగా ఉంటాయి. అవి మారటానికి కొంత టైమ్ పడుతుంది. కనుక మీరు కొంత ఓపిక పట్టండి. కొంతకాలానికి అవి కూడా మారిపోతాయి. స్వామి తత్వాన్ని స్వామి పవిత్రతను ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇరవై సంవత్సరాల క్రితం ఇక్కడ మొట్టమొదటిసారిగా క్రిస్మస్ జరిగినప్పుడు ఒక పాట పాడాను.
"లవ్ ఈజ్ మై ఫామ్
ట్రూత్ ఈజ్ మై బ్రెత్
బ్లిస్ ఈజ్ మై ఫుడ్
మై లైఫ్ ఈజ్ మై మెస్సేజ్
ఎక్స్ పెన్షన్ ఈజ్ మై లైఫ్
నో రీజన్ ఫర్ లవ్, నో సీజన్ ఫర్ లవ్
నో బర్త్, నోడెత్"
(ప్రేమయే నా స్వరూపం: నా జీవితమే నా సందేశం: వ్యాపకత్వమే నా జీవితం: ప్రేమ
తత్త్యం రీజన్‌కు, సీజను ఆతీతమైనది: ప్రేమకు చావు లేదు. పుట్టుక లేదు). . మీరు ఎవరికైనా సాయిబాబా సమాచారం చెప్పాలను కొన్నప్పుడు ఈ పాట పాడండి అప్పుడు వారు చక్కగా అర్థం చేసుకోగలరు. మానవ సోదరత్వాన్ని దైవ పితృత్వాన్ని దృఢంగా విశ్వసించండి. దైవచింతనచేత లోక కల్యాణమునకు పాటుపడండి. కేవలం నా దేశం మాత్రమే సుఖంగా ఉండాలనే సంకుచితమైన భావమును పెట్టుకోకండి. ప్రపంచమనే పెద్ద గృహంలో వివిధ దేశాలు చిన్న చిన్న రూమ్ లవంటివి. కనుక ప్రపంచ మంతా సుఖంగా ఉండాలని ఆశించండి. దీనిని పురస్కరించు కొనియే "లోకాస్సమస్తా స్సుఖినో భవంతు" అన్నారు. ముఖ్యంగా మీరు చేయవలసిన సాధన ప్రేమను పెంచుకోవడమే.
(స.పా. జె. 99 పు. 7/8)
(చూ|| ప్రేమమతం)