నవరాత్రులందు దేవీ భాగవతము. రామాయణము, భారతము చదువుతుంటారు.దుర్గ,లక్ష్మి,సరస్వతిఅనే త్రిమూర్తులను ఆరాధన చేస్తుంటారు. ఈ త్రిమూర్తులు ఒక్క సత్యములో యిమిడినవారు. గాయత్రికి మూడు పేర్లున్నాయి. గాయత్రి,సావిత్రి,సరస్వతి.గాయత్రి ఇంద్రియములకు మాష్టరు. సావిత్రి ప్రాణములకు మాష్టరు. సరస్వతి వాక్కునకు మాష్టరు. వాగ్గేవతా స్వరూపిణి సరస్వతి, ప్రాణములకు అధిపతి సావిత్రి, ఇంద్రియముల కధిపతి గాయత్రి. ఈ మూడూ ఒక్క సత్యమందే యిమిడి ఉన్నాయి. "ఓం భూర్ భువః సువః" భూర్ అనగా materialisation ఈ దేహములో అంతా matter ఉంటున్నది. మన వెంకట్రామన్ చెప్పారు. matter-energy గా మారుతుంది. energy matter గా మారుతుంది.. ఆయన (scientist) సైంటిస్టు కాబట్టి మీరు ఆయన చెప్పింది సత్యమనుకోవచ్చును. కానీ నా దృష్టిలో అది సత్యము కాదు. matter, energy అని రెండు వేరులేవు. అంతా ఒక్కటే మేటరు ఎనర్జీ, ఎనర్జీ మేటరు. ఎనర్జీ లేక మేటరు లేదు. మేటరు లేక ఎనర్జీ లేదు. కనుక రెండు అని చెప్పటం చాలా పొరపాటు. ఈ నవరాత్రి మహోత్సవములందు శక్తి పూజలు చేస్తున్నాం. శక్తి అనగా ఏమిటి? సత్యము, ధర్మము, శాంతి, క్షమ - ఇవన్నీ శక్తులే. వీటిని ఆరాధించి అనుసరించడమే శక్తి యొక్క ఆరాధన.
(ద.య.స. 98 పు. 5/6)
పరమాత్మ ఆరాధన కుపయోగకరమైన ప్రధాన పరికరములు మూడున్నవి. ఆ పరికరములను భక్తుడు ముఖ్యముగా సాధించవలెను.
1. రాగద్వేషములతో దూషితముకానట్టి చిత్తము
2. అసత్యాదులతో దూషితముగానట్టి వాక్కు,
3. హింసాదులతో దూషితముగానట్టి కాయము.
సుఖమనునది శాంతి అనునది బాహ్యవస్తువులం దెచ్చటనులేదు. అది నీలోనే యున్నది. శాంతి కొరకు ప్రపంచ విషయములందు వెదకుట పిచ్చి, తన ఆంతఃకరణయందూ ఆనందమైన స్మరణయందూ లభించును. మానవుడు ప్రపంచమును ఈ వేళకాకున్న రేపటికయినా విడచిపోవలసినదే. కనుక తెలివి కలిగి అన్నిటిలోని సారమును తెలిసికొని స్థిరమైన సత్యమునూ ప్రియమైన పరమాత్మనూ పొందుటకు యేవి ఆటంకములుగా వచ్చునో అట్టివాటిని విమర్శించి అందులోని సత్యమును తీసుకొని మిగిలినవి వదలి పెట్టుడు. మానవునకు ప్రపంచ ఆశలున్నంత వరకూ దుఃఖము తప్పదు.
మూర్తిపూజ
ఎక్కువమంది మూర్తి పూజలపై దాడివెడలుదురు. మూర్తిపూజ అనగా ఒక చిన్న వస్తువులో బ్రహ్మాండమును దర్శించుశక్తియే. ఇది ఊహాభావముకాదు అనుభవసిద్ధమే. విరాట్స్వారూపములో యేమున్నదో అది అంతయూ ఒక చిన్న స్వరూపమందు కూడా వున్నది. కావ్యములో ఉపమానములు దృష్టాంతములు మొదలైన వానికున్న ఆధారములే మూర్తిపూజకున్నవి.
(ప్రే.వా.పు. 12/13)
విత్తనములో వృక్షముంటున్నది. వృక్షము సాకారమును పొందినప్పుడు బీజము నిరాకారతత్త్వాన్ని పొందుతుంది. ఈ సాకార నిరాకారములు రెండింటియందు సత్ తత్త్వమనేది ఏకంగానే ఉంటున్నది. విత్తనమును చూసినప్పుడు వృక్షము గోచరించదు. కాని, వృక్షములోని కొమ్మలు, రెమ్మలు, ఆకులు, ఫలములు సర్వమూ విత్తనమునందే ఇమిడి ఉంటున్నవి. అట్లే, మానవత్వంతో కూడిన దివ్యత్వాన్ని పరికించినప్పుడే పవిత్రమైన స్వస్వరూపాన్ని మనము చూడటానికి వీలౌతుంది. మానవునికి బాహ్యదృష్టి ఉన్నంతవరకు అన్నీ బాహ్య లక్షణాలే గోచరిస్తాయి. అంతర్దృష్టిని అభివృద్ధిపరచుకొని అంతర్ దివ్యత్వాన్ని దర్శించినప్పుడు దీని ప్రతిబింబమే విశ్వరూపంగా మారుతుంది. ఆరాధన అనగా ఏమిటి? పూజా పునస్కారాలు, అభిషేకాలు చేయటం కాదు. అంతర్జృష్టితో ఏకత్వాన్ని గుర్తించడమే ఆరాధన. ఆకర్షణచేత రెండు హృదయాలు ఏకం కావడమే ఆరాధన. మానవత్వంలోని దివ్యత్వాన్ని ఆనందంగా అనుభవించడమే ఆరాధన. -శ్రీసత్యసాయి (సనాతన సారథి, ఏప్రిల్ 2022నాల్గవ కవరు పు ట)