శంకరాచార్య/ శంకరాచార్యులు/ శంకరులవారు

శంకరుల వారి ఖ్యాతి కాశీలో నలుదిశల ప్రాకి పోయింది. ఒకనాడు శంకరుని ప్రసంగాన్ని వినడానికి వేలాది ప్రజలు, పండితులు గుమికూడారు. ఒక్క తూరి కన్నులు మూసుకున్నారు. శంకరులు. కాలడిలో కొన ఊపిరిలో ఉన్న తన తల్లి కనిపించింది. ఇల్లు వదిలే సమయంలో, "నాయనా! నీవు ఇల్లు వదలి పోతున్నావు. నాకిష్టం లేకపోయినా సన్యాసం స్వీకరించావు. కనీసం నా అంత్యసమయంలోనైనా నీవు నా దగ్గర ఉండాలి" అని ఆమె కోరింది కదా! శంకరుడు చిత్తశుద్ధి కల్గినవాడు కనుక తన వాగ్దానమును నిలబెట్టుకోవాలని సంకల్పించుకున్నాడు. చిత్తశుద్ధి కల్గినవారు ఏది చెప్పినా సత్యమే అవుతుంది. శంకరుడు అప్పటి కప్పుడు సభను నిలిపివేసి కాలడికి వెళ్ళాడు. తల్లి కన్ను మూయడానికి పూర్వమే అక్కడ ప్రత్యక్షమై ఆమె నోటిలో తులసీతీర్థము పోసి ఆమె కిచ్చిన వాగ్దానమును నిలబెట్టుకొన్నాడు.

 

ఆర్యాంబకు దహనసంస్కారము చేయడానికి ఆ గ్రామంలో శంకరులవారికి సహాయం చేసేవారే లేకపోయారు. సన్యాసియైనవాడు కర్మకాండలో ప్రవేశించడం ధర్మవిరుద్ధమని, శంకరాచార్యులు ధర్మవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడని భావించి అతని తల్లి దేహాన్ని స్మశానమునకు తీసుకుపోవడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. నంబూద్రి బ్రాహ్మణులు ముట్టడానికి కూడా వీలుకాదన్నారు. విధి లేక తల్లి దేహమును తానే భుజముపై వేసుకొని తన ఇంటి పెరటిలోనే గుంతత్రవ్వి అక్కడే పూడ్చి వేశాడు. ఈ నాటికి కేరళలో ఎవరింట్లోనైనా పెద్దలు మరిణిస్తే వారిని ఇంటి పెరటిలోనే పూడ్చి పెట్టటం జరుగుతోంది. మీరు కేరళకు పోయి చూచినారంటే రోడ్డు పొడవునా ఇళ్ళు ఉంటాయి. వాటి వెనుక భాగం ఖాళీగా ఉంటుంది. శంకరులవారు తన తల్లి కిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకొని తిరిగి కాశీకి వెళ్ళిపోయారు. కాలడి ప్రజలు తనపై చూపిన ద్వేషభావానికి ఆయన మనస్సులో జుగుప్స కలిగింది.

(స.సా. జులై.97పు.184/185)

 

1200 సంవత్సరములకు పూర్వం ఆది శంకరులు దివ్య దృష్టితో యీ ప్రదేశం (బద్రి) పవిత్రం చేయగా లింగాన్ని స్థాపించటం జరిగింది. ఆయన ఆ కాలంలో శారీరకంగా రావడానికి వీలే లేదు. మానసికంగానే వచ్చారు. కైలాసం నుండి వస్తూ, ఐదు లింగాలు తెచ్చి, ఐదవ దాన్ని యిక్కడ స్థాపించారు. ఇట్టి పవిత్రమైన చోటులో మీరంతా జన్మించటం, మీ పుణ్య విశేషం. భక్తి అనేది ప్రాథమిక పాఠశాల, జ్ఞానమనేది మాధ్యమిక పాఠశాల, వైరాగ్య మనేది కళాశాల, కళాశాలకు పోవాలంటే ప్రాథమిక పాఠశాల నుంచే రావాలి. అలాగే వైరాగ్యం చేరాలంటే భక్తి నుంచే రావాలి. భక్తి అనగా ప్రేమ. ప్రేమ లేని వ్యక్తి లోకంలో లేడు. దేహమే దేవాలయం. ఆ దేవాలయంలో ప్రేమ స్వరూపుడనే దేవుడున్నాడు. చంద్రుణ్ణి చంద్రుని యొక్క వెలుతురు లోనే చూచి నట్టుగా ప్రేమ స్వరూపుని ప్రేమతోనే చూడాలి. ప్రేమ తోనే పొందాలి. భగవంతుడు సహస్ర నాముడు. సహస్ర రూపుడు. తనది కానిది లేనిది లేదు. ఎవ్వరిని ద్వేషించినా అతణ్ణి ద్వేషించినట్టే.సర్వులలోనూ వున్నది ఒకే పరమాత్మ అనే సత్యాన్ని గట్టిగా అర్థం చేసుకోవాలి. రోజు వందలు వేలు యాత్రికులు వస్తూనే వున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా విసుక్కోకుండా అందరిని యిక్కడి వారు ప్రేమతో ఆహ్వానించి ఆదరించాలి. (సెభాష్ అని చప్పట్లు కొట్టుతున్నారు.} డబ్బుకోసం పీడించరాదు. మీరందరూ యీ పవిత్ర భూమిలో జన్మించారు కనుక మీరందరూ ధన్యత పొందే తీరుతారు. తెలియక పొందే కన్నా తెల్సి పొందటం శ్రేష్టం. ఇన్ని కష్టాలకు, భాదలకు మూల కారణం హృదయంలో ప్రేమ లేకపోవటమే. ప్రేమ అనే జ్యోతిచే కామ క్రోధ లోభ మోహములనే గబ్బిలాలను తరిమి వేయాలి. మీకు యిష్టమైన నామాన్నే మనసా స్మరించండి. ఈ జప ధ్యానముల కొరకు యే కొండ గుహలకో వెళ్ళాలి అనే పిచ్చిని వదలుకోండి. ఉన్న చోటు నుండే తరించాలి. కర్మ సన్యాసం ప్రధానం గానీ దేహ సన్యాసం కాదు. సర్వదా పరమాత్మ నామం నాలుక పైన - నాట్యమాడుతూనే ఉండాలి. ఇక్కడికి వచ్చేవారు విన్నవారు కన్నవారు అందరూ జాతి మత బేధం లేక, అందరూ ఒక్క సర్వేశ్వరుని బిడ్డలే అనేదాన్ని గాఢంగా విశ్వసించి ఆ సర్వేశ్వర నామాన్ని సదా వుచ్చరించి ఆనందించాలనేదే నా కోరిక (ఆనంద కరతాళ ధ్వనులు తుఫానువలె చెలరేగింది.) కొంత సేపు నామస్మరణ చేసుకొందాం.

(బ.పు.96/97)

 

అద్వైత ప్రతిపాదకులు శంకరాచార్యులు లేత వయస్సులోనే శరీరాన్ని పరిత్యజించిన మాట వాస్తవమే. ప్రస్థాన త్రయమునకు భాష్యము రచించి, జ్ఞాన మార్గమును బోధించి, భక్తి మార్గమును ప్రతిపాదించుఅనేక స్తోత్రములను జగత్తుకు అందించి, ఆసేతు హిమాచలము పర్యటించి, పీఠములను ప్రతిష్టించి ఆదర్శమూర్తియై నిలిచినవారు ఆదిశంకరులు. ఆయన జీవితంలో జరిగిన ఒక ముఖ్యమైన ఘట్టము మీకు తెలిసే ఉంటుంది. బ్రహ్మచర్య దీక్షకు అంగీకరించమని తల్లిని వేడుకున్నాడు. ఆమె అంగీకరించ లేదు. ఒకనాడు స్నానానికి చెఱువులోదిగినప్పుడు హఠాత్తుగా, "అమ్మా! ఒక మొసలి నన్ను పట్టి ఈడుస్తున్నది. నేను సన్యసించడానికి నీవు అంగీకరిస్తేనే అది నన్ను వదులుతుంది" అని బిగ్గరగా అరవడం ప్రారంభించాడు. ఆమె ఒప్పుకున్న మీదటేమొసలి వదలి పెట్టిందంటారు. ఇక్కడ ఒక గూఢార్థమున్నది. సంసారమనే చెఱువులో భౌతిక వాంఛ అనే మొసలి జీవుడైన వానిని పట్టిపీడిస్తున్నది. దీనికి వైరాగ్యమే పరిష్కారము. శంకరులవారు తన కార్యమును ముగించుకుని కాయాన్ని వదిలారు. తన సందేశాన్ని తన అద్వైత సిద్ధాంతాన్ని తన శిష్యులు తప్పక వ్యాపింప చేయగలరను నమ్మికయే చిన్నతనంలో శరీరాన్ని పరిత్యజించేటట్లు చేసింది. శంకరుల శిష్యులు కూడా అట్టిసమర్థులే.

(స.సా.జూన్ 99 పు.166)

 

కాశ్మీర్ లో కాలుష్య క్షాళనం
శంకరులవారు ఎప్పుడైతే కాశ్మీరులో ప్రవేశించారో తక్షణమే కొండ పైనున్న కనకదుర్గ గుడి తలుపులు మూసుకున్నాయి. ఎవరెంత ప్రయత్నించినా అవి తెరుచుకోలేదు. అనేకమంది పండితులు వెళ్ళి ప్రార్థనలు సల్పారు. వారి భక్తిప్రపత్తులకు మెచ్చి శక్తిస్వరూణియైన దుర్గ అశరీరవాణిగా ఒక మాట చెప్పింది, శంకరులవారు గొప్ప ఆచార్యుడు. ప్రతి ఒక్కటి తాను ముందు ఆచరించి ప్రబోధిస్తూ వచ్చాడు. కాని అతనిలో ఒకవిధమైన మాలిన్యము ప్రవేశించింది. దానిని పరిహారం గావించుకోటానికి ప్రయత్నించినప్పుడే తలుపులు తెరుచుకుంటాయి .

అప్పుడు శంకరులవారు తాను పరకాయ ప్రవేశముతో రాజభవనములో అనుభవించిన దోషాన్ని గుర్తించి దాని పరిహారార్థమై పదకొండు దినములు నిద్రాహారపానీయాదులను త్యజించి తపస్సుచేస్తూ కూర్చున్నాడు. పన్నెండవ దినమున తలుపులు తెరుచుకున్నాయి. లౌకిక ప్రేమలో ప్రవేశించటం చేత శంకరులవారికి దోషము చేకూరింది. అయితే, అది తన యిష్టపూర్వకంగా చేయలేదు. ఉభయభారతికి జవాబు చెప్పాలనే ఆ పని చేశాడు. దేహభావంతోకాక ఆత్మభావంతో ప్రేమించాలి. ఆత్మాభిమానమే నిజమైన ప్రేమ. అట్టి ప్రేమతత్త్వాన్ని మదిలో నింపుకొనే శంకరులవారు యావత్ప్రపంచానికి అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించారు. (దివ్యఙ్ఞాన-దీపికలు ద్వితీయ భాగం పు 150-151)

పీఠాల స్థాపన
ఒకనాడు శంకరులవారు ప్రయాణమై వెడుతున్నారు. తుంగభద్రానదీ తీరమందు ఒకచోట పాము, కప్ప సమైక్యముగా, స్నేహముగా ఉండటం చూసారు. ఎండ అధికంగా ఉండటం వలన సర్పము పడగ విప్పి కప్పకు నీడనివ్వటం కనిపించింది. ఆ ప్రదేశము ద్వేషరహితమైనదని గుర్తించి అక్కడే శృంగేరీ పీఠమును స్థాపించారు. దీని అంతరార్థమేమిటి? స్థానము కూడా పవిత్రంగా ఉంటుండాలి. పూరీ, ద్వారక, శృంగేరి, బదరీ, కాశీ క్షేత్రాల్లో ఐదు లింగములను ప్రతిష్ఠించారు. కంచిలో యోగలింగమును పెట్టారు. మండనమిశ్రునికి సురేశుడని పేరు పెట్టి కంచి పీఠాధిపతిగా చేశారు. విద్యారణ్యులుకూడా శంకరుని శిష్యులే. శంకరులు ఉసాసనా మార్గమందు ప్రజలకు ఉత్సాహమునందించి తద్వారా భక్తి ప్రపత్తులను అభివృద్ధి చేయుటకు దేవతాస్తోత్రములు ఎన్నియో రచించిరి. వారు స్థాపించిన పీఠాధిపతులు కూడా దైవారాధన చేయుచూ, ప్రజలకు మార్గదర్శకులుగా కర్మమార్గమును అనుసరించుచున్నారు. అద్వైత ప్రబోధలకు ఉపాసనా మార్గము, కర్మమార్గములు తోడునీడగా ఉండునని వీరి అభిప్రాయము. ప్రస్థానత్రయమునకు అద్వైత రీత్యా వ్యాఖ్యానమును రచించి తన కాలమును, కాయమును పవిత్ర భారత జననియొక్క సేవకై, మానవ కులము యొక్క ఉద్థారము నిమిత్తమై అర్పితము చేశారు. తన 32వ యేటనే శంకరులవారు శరీరాన్ని త్యజించారు. కారణమేమిటి? తాను వచ్చిన పని అయిపోయింది. (దివ్యఙ్ఞాన-దీపికలు ద్వితీయ భాగం పు 154)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage