వాల్మీకి రామాయణము సుధాసముద్రము. కనుకనే ఈ రామాయణమునందున్న భాగము లన్నింటికిని కాండములని పేరు పెడ్తూ వచ్చారు. కాండమనగా జలము. ఇక్కడ ఒక్కొక్క బిందుపు ప్రాణప్రద మైనట్టుగా ఒక్కొక్క పదము కూడను ధర్మార్థకామమోక్షములనేటటువంటి పురుషార్థ ప్రదంగా గోచరిస్తూ వచ్చింది. హృదయమనేసముద్రమునందు బుద్ధి అనే ముత్యపుచిప్ప, సరస్వతి అనే వర్షబిందువునకై వేచివుండడమనే దానిని కూడను నిరూపిస్తూ వచ్చారు. పవిత్రమైనటువంటి ఈ భారతీయ సంస్కృతిని గుర్తించడానికి మనము తగిన ప్రయత్నము చేయుట అవసరము. ముత్యపు చిప్పస్వాతి వర్షపు బిందువు నిమిత్తమై ఏరీతిగా కాచుకొని ఉండునో, అదేరీతిగా మానవుని హృదయము ఈ సరస్వతి అనుగ్రహము నిమిత్తమై కాచుకొనియున్నది.దానికి తగిన సమయము ఇప్పుడు ఆసన్నమైనది. రామచరిత్ర అనే సరోవరమునందు స్నానము చేసి పునీతుడైనటువంటి వాడు మాత్రమే బ్రహ్మలోకమునందున్న శారదాంబ యొక్క అనుగ్రహము పొందుటకు అర్హుడౌతాడు. ఇందులో వాల్మీకీ, రామచరిత్ర సరోవరమునందు స్నానము చేసి పునీతుడు కాని వ్యక్తి, - సరస్వతి యొక్క అనుగ్రహమునకు పాత్రుడు కాడని కూడను నిరూపిస్తూ వచ్చాడు.
(ఆ.రా.పు.1/2)