ఒకానొక సమయంలో వాల్మీకి నారదుణ్ణి స్వామీ! ఈ ప్రపంచంలో సత్యవాక్పరిపాలకుడున్నాడా? నిరంతరము ఆనందమును అనుభవించేవాడున్నాడా? నిరంతరము చిరునవ్వులు చిందించే మోము గలవాడున్నాడా? తప్పు చేయని వాడున్నాడా? తప్పు చేసినవారిని క్షమించే వాడున్నాడా? పొందిన ఏ చిన్న ఉపకారమునకైనా కృతజ్ఞత చూపే వాడున్నాడా...." అని ఈ రీతిగా పదకొండు ప్రశ్నలు అడిగాడు. అప్పుడు నారదుడు “వాల్మీకీ! పదకొండు కాదు. పదకొండు వేల సద్గుణములకు అధిపతియైన శ్రీరాముడు నరరూపధారియై ఈ జగత్తులోనే ఉన్నాడు. సద్గుణములు, సత్ప్రవర్తన గలవాడే భగవత్స్వరూపుడు. అట్టి శ్రీరామచంద్రుడు మానవాకారంలో పుట్టాడు. తానెన్నో అవస్థలకు గురి అయినాడు. కాని, ఎట్టి పరిస్థితిలోనూ సత్యమార్గమును వీడలేదు. అతడు చెప్పిందంతా సత్యమే, చేసిందంతా ధర్మమే. కనుక, అతనిని నీవు అనుసరించు నాయనా!" అని బోధించాడు. నారదుడు కలహప్రియుడని అనేకమంది. అపోహ పడుతుంటారు. నారదుడు కలహ ప్రియుడు కాదు. కఠిన హృదయుడు కాదు. అతడు జ్ఞానజ్యోతి ప్రకాశకుడు, విశ్వామిత్రుడు సంపాదించిన గాయత్రీ మంత్రమును లోకానికి అందించినవాడు.
(సపా.సి. 2001 పు. 260/261)
(చూ|| జనసంఘమున ప్రీతి లేకుండుట, జ్ఞానగుణము, పుట్టపర్తి,ప్రాచేతనుడు)