కమలము
బురదలో పుట్టి బురదలో పెరిగిననూ కమలము ఎట్టి మాలిన్యమును చేర్చుకొనక పరిశుద్ధముగ అందముగ వుంటుంది. సూర్యరశ్మి సోకగానే విచ్చుకుంటుంది. అదే విధముగ మానవుడు ప్రపంచములోవుంటూ విషయవాసనలను తనలోకి చేర్చుకొనక జీవించవలెను జ్ఞానమునే కోరవలెను.
చీమ
బెల్లం ముక్కను చూచిన చీమ తానొక్కతే కూర్చుని తినదు. అన్ని చీమలను పిలుచుకొని వస్తుంది. బారులు బారులుగా చీమలు వచ్చి బెల్లం ముక్కను తింటాయి. ఇతరులతో పంచుకుని అనుభవించే గుణమును అలవరచు కొనవలెను.
తేనిటీగ:
నీవు తేనిటీగవలెవుండు.దోమవలె వుండవద్దు. తేనెటీగ అన్ని పుష్పముల లోని మధురమైన పదార్ధమును గ్రోలు తుంది. దోమ రక్తాన్ని పీల్చి వ్యాధిని అంటింది వెళ్తుంది. నీవు ఇతరులలో వుండే మంచివే గ్రహించు.
సాలీడు
సాలీడులో ఒక మంచి గుణం వుంది. దానికి పట్టుదల ఎక్కువ. గూడునల్లుటలో ఎన్నిసార్లు పరాజయమొందిననూ పట్టుదలతో చివరకు తన పనిని సాధిస్తుంది. సాలీడువలె పట్టుదల వహించండి.
ముత్యపుచిప్ప
ముత్యపుచిప్ప స్వాతి వర్షపు బిందువు కొరకు వేచి వుంటుంది. బిందువు పడగానే ముత్యపు చిప్ప మూసుకుంటుంది. అదే ముత్యముగా మారు తుంది. ఆ విధంగానే మానవుడు దైవానుగ్రహము కొరకు నిరీక్షించవలెను.
గోవు
పనికిరాని గడ్డితిని. మనము పారబోసే కుడితిని త్రాగి తియ్యని పాలను తయారుచేసి, తన దూడకే కాకుండా సర్వులకు ఆ పాలను అందిస్తుంది గోవు, అదే విధముగ మీరు కూడా ఇతరులకు మంచినే చెయ్యాలి. మన ఇంద్రియముల ద్వారా గ్రహించిన దానిని సర్వులకు ఆనందము చేకూర్చు విధముగ ఉపయోగ పెట్టాలి.
తాబేలు
తాబేలు తన ఇంద్రియములను స్వాధీనములో వుంచుకొన గలదు. ఆ విధంగా అవయవములను లోనికి చేర్చుకొని ఒక రాయి పెంకువలె విశ్చలంగ వుండగలదు. మానవుడుకూడా బాహ్యం ద్రియములను అంతర్ముఖము గావించి నిశ్చలముగ ధ్యానము చేయవలెను.
కోతిపిల్ల
కోతిపిల్ల వలె వుండండి. అది తల్లిని అంటిపెట్టుకొని వుంటుంది. నిర్భయముగ వుంటుంది. అదేవిధముగ మీరు మీ పెద్దలను దైవమును అంటి పెట్టుకొని ఆశ్రయించి వుండండి. ఎట్టి ప్రమాదము కలుగదు.
ఏనుగు
ఏనుగు చాలా తెలివిగల జంతువు. బాగా పరిశీలించి, ఆలోచించిగాని ముందుకు ఒక అడుగైనా వేయదు. ఒక్క సారివేసెనా వెనుకకు మరల్చదు. ఎట్టి ఆటంకములనైనా ఎదుర్కొనగలదు. మీరు కూడా ఏమగువలె వ్యవహరించాలి.
సింహము
సింహము నిద్రలేచి గర్జిస్తే అప్పటివరకు ఆటలాడుచున్న చిన్న జంతువులు పరుగులిడ ప్రారంభిస్తుంటాయి. అదే విధముగ నిద్రనుండి లేచిన వెంటనే ప్రణవ మంత్రమును పఠిస్తే జంతుతుసంబంధమగు సహజ భావములు పరుగులిడతాయి.
కోకిల
కోకిల చేసిన పుణ్యమేమి? కాకి చేసిన పాపమేమి? కాకిని తరుముతాం. కోకిలదరి చేరుతాం. ఎందుచేత? నోరు మంచిదైన ఊరుమంచిదౌనుకదా!
హంస
హంసవలె వివేకముతో వ్యవహరించండి, నీటిని పాలనుండి వేరు చేయగల శక్తి దానికి వుంది. అదే విధముగ మీరు మంచిన చెడును గుర్తించే నేర్పుము కలిగి వుండాలి.
(సా.యా.పు.8,10,11,13,16,19,21,25,27,29,31)