దోమ:
నీవు తేనెటీగవలెవుండు. దోమవలె వుండవద్దు. తేనెటీగ అన్ని పుష్పముల లోని మధురమైన పదార్ధమును గ్రోలు తుంది. దోమ రక్తాన్ని పీల్చి వ్యాధిని అంటించి వెళ్తుంది. నీవు ఇతరులలో వుండే మంచినే గ్రహించు.
ఎలుక
ఎలుక గాదెలో వున్న మంచి ధాన్యమును వదలి తాత్కాలికముగ కమ్మని వాసనచే ఆకర్షింపబడి బోనులో చిక్కుకుంటుంది. అదేవిధముగ మానవుడు తన నిజమైన ఆధారమును ఆహారమును నిర్లక్ష్యము చేసి ప్రాపంచిక భోగములను వెదుకుచూ చిక్కులు తెచ్చుకుంటాడు.
కప్ప
బావిలోని కప్పలవలె సంకుచిత దృష్టిని అలవరచు కోకూడదు. విద్యార్థులు. విశాలమైన దృష్టిని అభివృద్ధి చేసుకోవాలి. కప్ప కమలమువద్దనే వుండవచ్చును.కానీ కమలములోని మకరందమును గ్రోలనేరదు. ఎక్కడ నుంచో వచ్చి తుమ్మెద కమలంలోని మకరందమునుగ్రోలి వెళ్ళుతుంది. అదే విధముగ దైవత్వమును అనుభవించడానికి దూరము దగ్గర ప్రధానం కాదు. ప్రేమ ఒక్కటే కావాలి.
గాడిద
గాడిద ఓర్మికి పెట్టిన పేరు. అయితే అది చందనపు కట్టెలను మోసుకుపోయినమా, దానికి వాటి బరువు తెలుసునే కాని వాటి సుగంధమును గురించి తెలియదు. అదే విధముగ (ప్రాపంచిక చింతల భారంతో క్రుంగిపోతున్న)మానవుడు తనలోని దివ్యత్వమును గురించి తెలుసుకోలేకపోతున్నాడు.
నిప్పుకోడి
నిప్పుకోడి వేటగాడి నుండి తప్పించుకోవటానికి తన మూతిని ఇసుకలో దూర్చుకొని, తనను ఎవరూ చూడటం లేదని భావిస్తుంది. కానీ పెద్దదైవ దాని దేహాన్ని చూసి వేటగాడు చంపుతాడు. అదే విధంగా మనయందున్న దోషములను మరుగు చేసికొని ఎవరికీ తెలియదని నిప్పుకోడి వలె మూర్ఖత్వంతో ప్రవర్తించకూడదు.
గ్రద్ద
గ్రద్ద పైనుంచి అతివేగముగ క్రిందికి వచ్చి ఒక మృగమును విసురుగా ఎత్తుకొనిపోతుంది. కానీ ఆ విసురులో ఆ మృగము జారిపడిపోతుంది. కనుక అత్యాశ, ఉద్వేగము పనికిరావు.
(సా.యా. పు. 11, 18, 23, 33, 35)