దైవ భావముతో శయ్యనుండి మేల్కొనుము.
సాత్వికాహారమును భుజింపుము; తామసికమగు మత్తు పదార్థములను మనస్సునందైనను తలంచుకుము. జీవించుటకై భుజింపుము, భుజించుటకై జీవించకుము. శాంతి ప్రేమలతో మీలోని రక్తనాళముల నింపుము. పరులయందు తప్పులు వెతకు పాడుబుద్ధికి చోటివ్వకు. స్వశక్తిని మరచిన, అదియే మరణము.
ఆత్మ జ్ఞప్తి యందుండుట, అదియే జీవనం.
ఎన్ని బాధలు కలిగినా, యెట్టినిందలు వచ్చినా, నీ విశ్వాసమును వీడవద్దు. అదే తపస్సు అదే దీక్ష, అదే రక్ష నీతియే నీజాతి,అదివదలితివో. నీవు కోతికంటే హీనము. ఇంద్రియ నిగ్రహమునకు మించిన ఆనందము మరొకటి వుండదు.
మితభాష అతిహాయి; అతిభాష మతిహాని.
పరోపకారార్థమిదం శరీరం: వాటిని శక్తివంచన లేక నివారించుటకు పూనుకో.
నీవు దైవమును యెట్లు వెతకుదువో, దైవమూ నిన్ను అట్లు వెతుకుచుండును.
ఎల్లెడా దైవము కలడని విశ్వసించి, ఎందెందు చూచినా అందందే కనవచ్చును. "యద్
భావం తద్భవతి"
సంయమముతో కూడిన అంతఃకరణముతో, యేమి ఇచ్చిననూ భగవంతు డంగీకరించును. (పత్రం, పుష్పం, ఫలం, జలం) విత్తనము భూమిలో పెట్టిన మొక్క వచ్చునుగాని, టిన్నులో పెట్టిన రాదు.
శాస్త్రజ్ఞానము వృద్ధి కాకుండుటకు కారణం, ఆచరణలేని ప్రచారమే. కాన ఆచరణ అత్యవసరము; అనుభవము అంత్యం. పూజాపీఠమువద్ద వెలగవలసిన దీపము నిశ్చలబుద్ధి. ఇంద్రియములనే గవాక్షులద్వారా విషయ వాసనలను గాలిని రానీయక చూచుకొనవలెను.
సువాసనతో కూడిన మనోబుద్ధులనెడి పుష్పములే భగవంతున కత్యంత ప్రీతికరం.
నే నెవడని విచారించుటే "త్వం" పదార్థ శోధన.
అన్నింటికీ కర్తయెవరని విచారించుటే "తత్" పదార్థశోధన. జీవబ్రహ్మల యేకత్వమును ప్రతిపాదించునదే "ఆసి" పదార్థ నిర్ణయము.
"భావ" అనగా దీప్తి (ప్రకాశము). రతుడనగా రమించు వాడు. బ్రహ్మవిద్యా ప్రకాశములో రమించేవాడే భారతీయుడు.
పరులు నీకు చేసిన అపకారమును మరిచిపొమ్ము. నీవు పరులకు చేసిన ఉపకారమునకు తత్పలం ఆశించకుము. అదే నిష్కామ కర్మ.
ఏది జరిగినా జరుగకున్నా, చావు జరగకతప్పదు. చచ్చువాడు పిడికెడు మట్టి అయినా వెంట తీసికొనిపోడు. పాముకు పాలు త్రాగించుకొలదీ, విషము పెరిగినటుల విషయములకు వాసన చేర్చుకొలది, దేహమే నేనను అభిమానము పెరుగును.
"శ్రద్ధావాన్ లభతే జ్ఞానం" అన్నట్లు శ్రద్ధ గల వారికి జ్ఞానము. శ్రద్ధలేనివారు దైవమువద్ద నుండిననూ లోకసుద్దులకే కాకులయ్యెదరు.
సంశయాత్మా వినశ్యతి" సంశయము గలవాడు యెన్ని జన్మ లెత్తిననూ సత్యమును గాంచలేడు. సంశయము మహా దయ్యము, నిస్సంశయము సత్యస్థానమునకు మార్గము.
హిరణ్యకశిపు, రావణ, కంస, దుర్యోధనాదులు గర్వముచేయేమి సాధించిరో అదే ఫలమే గర్వదేవతకు లభ్యము.
సముద్ర మున్నంతవరకూ అలలు తప్పునవి కావు. అటులనే ప్రపంచమను భ్రాంతి యుండినంతవరకూ, సుఖదుఃఖములు తప్పవు.
ఈగ అన్నింటిపైనా వ్రాలును. అగ్నిపై మాత్రము వ్రాలదు. వ్రాలిన జీవించదు. అటులనే మనసు అన్నింటినీ చింతించును. ఆత్మను మాత్రము చింతించదు. ఆత్మను చింతించెనా లోకచింత వుండదు.
"పనికి పరార్. తిండికి తయార్" అయిన శిష్యుడు, విత్తాపహరి గురువూ వుండిన రాతి తెప్పనెక్కి నదిని దాటుటకు ప్రయత్నించి నట్లుండును.
మానవుడు ధన, కనక, వస్తు వాహనాది, డంభ, అహంకారఅభిమానములకు దాసుడగుటకన్నా, భగవంతునికి దాసుడగుట మహాభాగ్యము.
నవ్వేవాడు నారాయణుడు; యేడ్చేవాడే నరుడు.
నేడు బోధగురువు లరుదు. కనుక గురువులకై వెతుకక, తండ్రీ తల్లీ, గురుపూ, దైవము, ఒక్క పరమాత్యుడేనని విశ్వసించి దైవారాధనలోనే ఆనందమును అనుభవించు.
"సాలోక్యము" రాజ్యములోని ప్రజలవంటిది.
"సామీప్యము " రాజా చెంతనుండు నౌకరువంటిది.
“సారూప్యము " రాజుగారి తమ్మునివంటిది.
“సాయుజ్యము " రాజుగారి జేష్టపుత్రునివంటిది.
"సోహం" జ్ఞానం, "దాసోహం" భక్తి
ముముక్షులు మూడు విధములు. 1. మీనవృత్తి 2 మృగవృత్తి 3. కూర్మవృత్తి.
జలములో తప్ప తీరమున జీవించలేదు మీనము. అనగా జనసమూహమును బంధు బలగమునూ విడిచి వారు దూరము వెళ్ళి సాధనలు సలుప ఇష్టముండదు.
భూమిపై తప్ప జలమున వాసము చేయులేనిది మృగము. అనగా జనసమూహమునందు యేమాత్రము సాధనలు సలుపలేరు. వారే యేకాంతము తప్ప అన్యమార్గముల సాధనను సలుప ఆంగీకరింపరు.
జలమందును, భూమియందును. సమానముగ జీవించునది కూర్మము. అనగా సంసారసంబంధమైన జనస్తోమమునందును యేకాంతమునందును సమాన మనస్సు కలిగి అచంచలమైన ధ్యానమును ఆచరించును.
తెల్లవారగానే భోజనమునకు టిక్కెట్టు కొన్నవానికి ఆ సమయానికి వెళ్ళి హాటలులో భోజనమునకు ప్రయత్నించువానికీ యెంతభేదమో. చిన్న వయస్సునుండీ సాధనలు జరుపువానికి అప్పటికప్పుడు జన్మరాహిత్యము నకు సాధన జరుపువానికిని ఆంతేభేదము: అనగా ముందే టిక్కెట్టు కొన్న వానికి భోజనం నిశ్చయం. అప్పటికి అప్పటికి వెళ్ళినవానికి సంశయం..
కర్మ చెడ్డదయిననూ మంచిదయిననూ అనుభవించియే తీర వలెననుట మూర్ఖత్వము. సక్రమమైన సాధనలుసలిపిన చెడ్డ పరిహారము, మంచి అభివృద్ధి చేసుకొనుటకు అవకాశముండును.
సోమరితనము చీడపురుగు వంటిది. ఆది మానవత్వమునే హతమార్చును. కడకు కొరగానిదై పోవును.
నీ క్షేమ సౌఖ్యసంతోషములను నీవు ఎట్లు అభివృద్ధి కోరుదువో అట్లే అందరి క్షేమ, సౌఖ్య, సంతోషములను కోరు.
(భ.శ్రీ.స.పా.పూ.వి.పు. 92/107)