“ఈ శుభ దినాన ఈ విద్యాసంస్థ పవిత్రమైన త్రివేణీ సంగమముగా మారిపోయింది. అందులో అనంతపురం కాలేజి గంగానది, బృందావనం కాలేజి యమునా నది, ప్రశాంతి నిలయములోని కాలేజీ సరస్వతీ నదివంటివి. మొట్టమొదటిదిగా పుష్పమైన అనంతపురం కళాశాల అవతరించింది. తరువాత, ఫలమైన బృందావనం కళాశాల రూపుదిద్దుకుంది. ఆ ఫలము నేడు పక్వమై, మధురమై[DSS1] ప్రశాంతి నిలయంలో అవతరించింది. తల్ఫలితంగా ఆ మధురరసమును నింపుకున్న డిగ్రీలు ఈనాడు ప్రసాదింపబడుతాయి".
"ఈ విశ్వవిద్యాలయములో కేవలము వృక్షశాస్త్రమును బోధించడమే కాదు. దీనికి జీవిత వృక్షాన్ని కూడా అతికిస్తున్నాము; దీనిలో ఆర్థిక శాస్త్రమును బోధించడమే కాదు, ఆస్తిక శాస్త్రమును కూడా బోధిస్తాము. దీనిలో రసాయనిక శాస్త్రమును మాత్రమే కాదు, రసోవైసః" అనే ఆత్మ రసముమ కూడా అందిస్తాము, పదార్థ శాస్త్రమును కూడా దీనిలో ప్రవేశపెడుతున్నాము. భౌతికమునకు - ఆధ్యాత్మికమునకు, పదార్థమునకు - పదార్థమునకు ఏవిధమైన ఎడబాటూ లేకుండా ఏకీభావమును, అవినాభావ సంబంధమును ఈ విశ్వ విద్యాలయంలో బోధించుటకు పూనుకుంటున్నాము. ఇదే ఈ విశ్వ విద్యాలయం యొక్క ప్రత్యేకత. ఏవో కొన్ని కోర్సులను ప్రవేశపెట్టి, వాటిలో విద్యార్థులకు డిగ్రీలు ఇచ్చి వారిని బయటి ప్రపంచంలోనికి ఉద్యోగాలు వెతుక్కోడానికి పంపించే ఇతర విశ్వ విద్యాలయముల వంటిది కాదిది. విద్యార్థులు తమ కాళ్ళపై తాము నిలబడి, తమ శక్తియుక్తులపై తాము ఆధారపడి, తమ జీవన విధానమును తామే తీర్చిదిద్దుకోవడానికి అవసరమైన ధైర్యమును, విశ్వాసమును, విజ్ఞానమును ఈ విశ్వ విద్యాలయం అందిస్తుంది. అందువలన, ఈ విశ్వ విద్యాలయములో నై తిక, భౌతిక, ఆధి భౌతిక విద్యా బోధనలో ఆధ్యాత్మిక విద్యను మేళవించి బోధించాలని నిర్ణయించారు. ఈ విశ్వ విద్యాలయంలోని బోధనా భాష క్రమశిక్షణ, తరువాత బోధింపబడే మూడు భాషలు వరుసగా ప్రేమ, సేవ మరియు సాధన.
(స.సా.599 పు. 335)
చిన్నతనంలోనే ఆధ్యాత్మిక సాధనలో ప్రవేశించినందుకు తమ బిడ్డలను దండించే హిరణ్యకశిపులవంటి తల్లిదండ్రులు నేడు ఉన్నారు. అంతేకాదు. వారిలో కొందరు తమ పిల్లల దుష్ప్రవర్తనను గమనించనట్లు, వారు సత్ప్రవర్తనే కలిగియున్నారని ఇతరులను భ్రమింపచేయడానికి కూడా ప్రయత్నిస్తారు. తమ పిల్లలను మంచి మార్గంలో పెట్టడానికి ఎటువంటి ప్రయత్నమూ చేయరు. తల్లిదండ్రుల యొక్క ఇటువంటి స్వభావమువలన విద్యార్థులు దుర్మార్గంలో ప్రవేశించి ధృతరాష్ట్ర కుమారుల వలె చెడిపోతారు. ఇందుకు విద్యార్థులను నిందించవలసిన పని లేదు. వారి దుష్ప్రవర్తనకు తల్లిదండ్రులే బాధ్యులు, ఆ దుష్ప్రవర్తనే విద్యాసంస్థలలో క్రమశిక్షణా రాహిత్యము నకు కారణభూతమవుతుంది.
(స.సా.శ.99పు.338)