ఆధ్యాత్మిక మనగా పూజలు చేయటం కాదు. ప్రేమను అభివృద్ధి పర్చుకోవాలి. మీకు ఇష్టముంటే పూజలు చేసుకోవచ్చు. తప్పులేదు. కానీ, లోపల పవిత్రమైన భావం లేకపోతే ప్రయోజనం లేదు. మీరు కావలసినంత సంపాదిస్తున్నారు. కానీ, సంపాదించిన దానిని సద్వినియోగం చేస్తున్నారా? పోనీ, జీవితానికి తగినంత పనైనా చేస్తున్నారా? ప్రేమ స్వరూపులారా! ఈనాడు అవకాశం వచ్చింది కనుక, చెప్పక తప్పదు. ఈ దేశంలో ఎంతోమంది. శ్రీమంతులు, మేధావులు, సైంటిస్టులు, న్యాయవేత్తలు ఉంటున్నారు. కాని, అందరూ వారి వారి కర్తవ్యాలను చక్కగా నిర్వర్తిస్తున్నారా? లేదు. అందుచేతనే, దేశం ఇన్ని దురవస్థలకు గురియైపోతున్నది. సంపాదించిన ధనాన్ని సద్వినియోగపరచాలి. ఎక్కడి నుండి సంపాదించారు? సమాజం నుండియే కదా. కనుక, దానిని సమాజం కోసమే వినియోగం చేయాలి. కుల్వంత్ రాయ్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పవిత్రమైన భవనము (శ్రీ సత్యసాయి అంతర్జాతీయ కేంద్రమును కట్టాడు. ఈ దేశంలో అనేకమంది శ్రీమంతులుంటున్నారు. కానీ, ఎంతమంది ఈ విధమైన త్యాగానికి పూనుకుంటున్నారు? కొంతమంది కోట్ల కొలది. ఖర్చు పెట్టి హాస్పిటల్స్ కట్టిస్తున్నారు. విద్యాలయాలను నిర్మిస్తున్నారు. కానీ, ఎందుకోసం? యాభై కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టిస్తే సూరు కోట్ల ఆదాయం తీసుకుంటున్నారు. వచ్చే సమయంలో కాసైనా తీసికొని రాలేదు. పోయే సమయంలో నయా పైసైనా తీసికొనిపోరు. సమాజం కోసం ఖర్చు పెట్టకపోతే ఎన్ని మేడలు కట్టించినా, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా ఏమి ప్రయోజనం?సమాజ సేవలోనే ఉంది భగవదవనుగ్రహం. బీదలకు సహాయం చేయండి. ఢిల్లీలో ఎంతోమంది బీదలు అనారోగ్యంలో బాధ పడుతున్నారు. వారికోసం ఉచిత వైద్య శాలలను కట్టించండి. బీద పిల్లలకోసం పాఠశాలలను నిర్మించండి.ఈ విధమైన త్యాగానికి మీ అంతట మీరే పూనుకోవాలి. ఇంకొకరితో చెప్పించుకోకూడదు. నా విషయం నేను చెపుతున్నాను. ఈ భవనమును కట్టమని నేను కుల్వంతరాయ్ కి చెప్పలేదు. అతని హృదయంలోనే ఈ సద్భావం ఆవిర్భవించింది. తనంతట తానే కట్టాడు. ఈ విధమైన సత్సంకల్పములు జన్మాంతర సుకృతం వలన కల్గుతుంటాయి. ఇలాంటి వారిని చూసి అసూయ పడేవారు కూడా ఉంటారు. వారి కర్మ వారిది, వీరి అదృష్టం వీరిది. ప్రతిమంచి పని భగవంతుని పనియే. మా కుల్వంత్ రాయ్ ఈ భవనమును నిర్మించి సాయి సంస్థలకు ఎంతో ఉపకారం చేశాడు. ప్రతి శ్రీమంతునికి ఈ విధమైన త్యాగభావం రావాలి. భారత దేశం బీద దేశం కాదు. ఇది సిరిసంపదలతో తులతూగుతున్న లక్ష్మీ స్వరూపం. ఇది బీదదేశమే అయితే పూర్వం ఇతర దేశములవారు ఎందుకు వచ్చి పడ్డారు. దీని పైన? మనం బీదవారమని చెప్పుకోవడం దురదృష్టం. మితిమీరిన కోరికలు కలవాడే ఈ లోకంలో అందరికంటే బీదవాడు. తృప్తి గలవాడే అందరికంటే ధనవంతుడు. దేశాభిమానమును పెంచుకోండి. దేశంకోసం దేహాన్ని కూడా త్యాగం చేయండి..
(స.పా.జాన్ 99 పు. 158)