విద్యార్థులు ముఖ్యముగా నేర్చుకొనవలసినది మరొకటి, అదే శుభ్రత. ఇది రెండురకములు, ఒకటి బాహ్యశుభ్రత, రెండవది ఆంతః శుభ్రత. వీటిలో యే ఒకటి లోపించినా ఆ వ్యక్తి యెందుకూ పనికిరాడు. శరీరము పై ధరించు వస్త్రములు, చదువుకొను పుస్తకములు, మరి పరిసరప్రాంతములు, ఇవన్నియూ బాహ్యశుభ్రత అనబడును. అనగా లోకరీతిగా మన నిత్య జీవితమునకు సంబంధించిన ప్రతివస్తువును శుభ్రముగా పెట్టుకోవాలి. పండ్లు, కండ్లుమొదలుకొని తిండ్లు బండ్లు వరకూ శుభ్రతను పాటించాలి. దీనివలన ఆరోగ్యము యేర్పడును. శరీరమును నిత్యమూ తోమి స్నానమాచరించకున్న దేహములో మురికియేర్పడి దురదలు ప్రారంభము కావచ్చును. కొన్ని పుండ్లు బయలు దేరవచ్చును. ఇవి అంటువ్యాధులుగా మారవచ్చును. మన స్థితి హీనముగా వుండవచ్చును. ఒకటి, రెండు డ్రస్సులు మాత్రమే మనకు ప్రాప్తించియుండవచ్చును. వాటినైనా శుభ్రంగా పెట్టుకొనవలెను. మురికి చేరకుండా చూచుకోవలెను. అటులనే మనము నిత్యమూ చదివేపుస్తకాలు కూడా యెక్కడంటే అక్కడ పారవేయరాదు. దానిలో అనవసరమైన గీతలు గీయరాదు. వ్రాతలువ్రాయరాదు. కాగితమునుకూడా పరిశుభ్రపరచు కొనవలెను. వాటిశుభ్రత పదిమందీ మెచ్చుకొను రీతిగా వుండాలి. దుర్గంధమును చేర్చుకోరాదు. సర్వుల ప్రేమకు పాత్రులు కావలెను. తాను నివసించు పరిసరములను వూడ్చి తనగదిని తాను శుభ్రంగా పెట్టుకొనవలెను. గదియందు అసభ్యమైన చిత్రములను వ్రేలాడదీయరాదు. ఆదర్శము, ఉత్తమభావములను అందించే చిత్రములనే తనగదిలో వేసుకొనవలెను.
ఎంత సంపదవున్నప్పటికినీ, ఆరోగ్యము గనుక సరిగా లేకోపోయినచో జీవితమున సుఖముండదు, సంపదను తనివితీరా అనుభవించలేడు. తింటే ఆయాసం, తినకపోతే నీరసం, అంతకన్నా సుఖమే మాత్రమూవుండదు. కనుక బాహ్యశుభ్రత జీవితమును ఆనందముగా అనుభవింప జేయును.
ఇక అంతఃశుభ్రత అనగా లోపలనున్న మనస్సును, బుద్ధిని కూడా ప్రశాంతంగా, పవిత్రంగా వుంచుకోవలెను. భావములు పవిత్రము, అశాంతి సంబంధమైనవే అయిన తాను శాంతిని అనుభవించలేడు. సౌఖ్యమును ఆందుకోలేడు. మనసు మలినమైతే భావాలు మలినమే అగును. మనసు కలుషితము కాకుండా చేసుకొనుటకు యెదుటివారి పరిస్థితులను, ప్రవర్తనలను చక్కగా వివేకంగా విచారించి సక్రమమైన మార్గాన్ని నిర్ణయించు కొనవలసియుండును. తొందరపాటుకాని, అనుకరణకాని మంచిది కాదు. విజ్ఞతతో, విచారణతో మనహృదయ నిర్ణయాన్ని మనము చూడాలికాని, యేదో యెదుటివాడు అందంగా తలచుచున్నాడు కదా అని మనముకూడా దానిని అనుసరించరాదు. అనుకరణ నీచమైనది. బలహీనమైనది. అజ్ఞానముతో కూడినది. అవిద్యా ప్రభావమైనది. అదిగొఱ్ఱి లక్షణము.
(వి. వా.పు.73/75)
దేహములో మంచి కర్మలను చేసినప్పుడే మంచి ఫలితం మన మనస్సులో ప్రవేశిస్తుంది. కనుక, మనం కర్మలనుఆచరించడం అంత గొప్ప తనముకాదు. మనము శరీర శుభ్రత కోసం స్నానము చేయాలి. అయితే కేవలం శరీరాన్ని మాత్రమే కాదు. మనస్సును కూడా శుభ్రం చేయాలి. కాని శరీరాన్నే శుభ్రం చేసుకోలేని వారు, ఇంక మనస్సును ఏరీతిగా శుభ్రం చేసుకోగలరు?
ఒక సోమరిపోతు సన్యాసికి ఆకలయింది. అతడు ఒక ఇంటికి వెళ్ళి ఆ ఇల్లాలును "అమ్మా! నాకు ఆకలిగా ఉంది అన్నం పెట్టండి" అని అడిగాడు. ఆ ఇల్లాలు మహా వేదాంతి. భారతీయ సంస్కృతిని చక్కగా గుర్తించిన స్త్రీ "నాయనా! అతిథులను, అభ్యాగతులను ఆదరించడం మాగృహస్థుల ధర్మం . అయితే మీరు వేళకాని వేళలో మా ఇంటికి వచ్చారు. అయినా తక్షణమే వంట ప్రయత్నము చేస్తాను. ఇక్కడ ప్రక్కనే ఒక నది ఉన్నది. మీరు పోయి స్నానం చేసి రండి. అంత లోపన నేను అన్నము తయారు చేసి ఉంచుతాను", అన్నది. వీడు దొంగ వేదాంతి స్నానము చేయడానికి ఇష్టము లేక "అమ్మా! మా బోటి సన్నాసులకు“గోవిందేతి సదా స్నానం, గోవిందనామమే సదాస్నానము" అని చెప్పాడు. ఆ ఇల్లాలు మంచి తెలివితేటలు కలిగినది. వీడెవడో దొంగ సన్యాసిలా, సోమరిపోతులా ఉన్నాడు. ఇతడు కర్మ సిద్ధాంతమును సరిగా గుర్తించినవాడు కాదని గ్రహించి, అతనికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో - "నాయనా! గోవిందేతి సదా భోజనం, కనుక, వెళ్ళిరా?" అని చెప్పింది. గోవిందేతి సదాస్నానం" అయినప్పుడు గోవిందేతి సదా భోజనం ఎందుకు కాకూడదు?చూసారా! ఇలాంటి వారు నేడు అధికమైపోతున్నారు. కర్మల నాచరించాలంటే వారిలో తమోగుణము అధికమై పోతున్నది. వారికి అవసరమైన వాటినే సత్యంగా భావిస్తారు కాని, ఏవి నిత్యమైనవో వాటిని అవసరంగా మార్చుకోరు. నేటి కర్మకాండము ఈ విధంగా చాలా అపవిత్రమవుతూ వచ్చింది. కనుక, కర్మలు ఆచరించినా ఆచరించక పోయినా, ముందు మనస్సును శుద్ధిగావించుకో. దీని నిమిత్తమై దైవచింతన అత్యవసరము.
(శ్రీభ.ఉ.పు.149/150)