జీవికి మొదట పునాది ఒకటి కలదు. దానినే శుభేచ్చ భూమిక అందురు. అట్టివారెట్లుందురనిన బ్రహ్మతత్త్య వేత్తలయొక్క సన్నివేశము. వారిద్వారా తెలిసికొన వలెననియెడి అభిలాష. మోక్షము పొందవలెననియెడి అభిలాష, ఆధ్యాత్మిక గ్రంథపఠనము. ఇంద్రియ భోగవిరక్తిమొదలగు గుణములలో నుందురు. పై చెప్పిన చతుర్వి ధాభిలాషలు గల సాధకుడు శ్రుతులను విని సద్ గురువుల పాదపద్మములందు తత్త్వమసి మొదలగు మహావాక్యములను మననమొనర్చుకొనుచు ఏకాగ్రతచే చింతించును.ఇదియే విచారణ భూమికయను మెట్టు. పై చెప్పిన రెండు విధములైన సాధనలచే మనసు క్షణములో బ్రహ్మ చింతనయందు లగ్నము కాగలదు.
మనస్సు వాటిని త్రాడువలె ఉపయోగించి పై మెట్టునెక్క ప్రయత్నించును. అందువలన బ్రహ్మాకారవృత్తి జనించు చున్నది. ఇదే తనుమనుతే అనియెడి మూడవ మెట్టు. పైన చెప్పిన మూడు మార్గములు సాధనలచే సకల కోరికలు క్రమముగా నశించుచున్నవి. తత్త్వజ్ఞానము వృద్ధి పొందుచున్నది. ఇందు మనసు పూర్తిగా పవిత్రతచెంది సత్యముతో నింపబడుచున్నది. కావున నెమ్మదిగా మనస్సు బ్రహ్మాకారవృత్తి యందు లీనమగును. అసంసక్తియందు బాహ్య విషయములతో కానీ వాటి సంస్కారములతో కానీ సాధన కెట్టి సంబంధమూ ఉండదు.
(జ్ఞా.వా.పు.19/20)