భగవన్నామము/భగవన్నామములు

జీవితారణ్యములో పయనించుచున్న మానవులకు, భగవన్నామము చిన్న జ్యోతి. వివేకమును గురువు సలహా ననుసరించు, జ్యోతిని చేత నుంచుకొని కర్మానుష్ఠాన మనెడి ప్రయాణము సాగించినచో, ఈ చిన్న వెలుగే వేళ్ళమైళ్లు దాటించి సురక్షితముగా గమ్యము జేర్చును.

(స.సా.జ.76వు.263)

 

బంధువులందరు వాకిటి దాకను

వల్ల కాటికి వత్తురుగా

బంధమణచినిన్ బాయని ఆప

ద్బంధువు భగవన్నామమేరా!

(ము.ము. పు. 39)

 

రమణీయమైన మన కమలమునకు భ్రమరములు. మనస్సనే కమలము జలమును ఆధారము చేసుకొని సూర్య కిరణములు అధేయముగా భావించి తన జీవితమును గావించుకుంటుంది. భ్రమరములకు మధుకరములు అని పేరు. దీనిని మరొక మార్గమున మధుకరము అని రెండుపదములుగా ఏర్పరచు కొనవచ్చును. మధువనగా జలము, కరమనగా సూర్యకిరణము. కమలమునకు క్రింద జలము, పైన సూర్య కిరణము. ఈ రెండు లేకపోతే ఈ కమలము జీవించలేదు. అదే విధముగనే భగవంతునియొక్కనామము మానవుని హృదయమునందు జలము అనే ఆధారము, జ్ఞానము అనే కిరణము రెండు అత్యవసరము. ఈ కాలమే భక్తి. ఈ కిరణమే జ్ఞానము. భక్తి జ్ఞానములకు మధ్య మాత్రమే మానవుని హృదయమనే కమలము పోషింపబడుతుంది. ఈ భక్తి జ్ఞానములనేవే భగవ న్నామములు. భగవన్నామము మానవుని హృదయ కమలమునకు మధుకిరణములు ఏవిధంగా ఏర్పడినవో, యశోదకు కృష్ణబలరాములుకూడను ఆ విధముగా ఏర్పడుతూ వచ్చారు. ఈ యశోద యెవరు? ఏ ఆభిమానంచేత వారిని లాలించి పాలించి పోషిస్తున్నది యశోద? వీరి విషయములలో లోతుగా దిగి విచారించి నప్పుడే అంతరార్థము బోధపడుతుంది. నిజముగా యోచించిన బలరామకృష్ణులు యశోద బిడ్డలు కారు. వీరెక్కడ నుంచి వచ్చారనికూడా ఆమెకు తెలియదు. ఐనప్పటికిని వారిని తన కన్నబిడ్డలవలె ప్రేమించి లాలించి పోషిస్తూ వచ్చింది. బలరామకృష్ణులు మధురయందు జీవించేవారు. వారు ఈ గోకులము రావడానికి కారణమేమిటి? ఆధ్యాత్మికమార్గములందు వీనిని చక్కగా విచారణ చేసినప్పుడు గోకులము ఏమిటి? యశోద ఎవరు? మధుర ఏది? ఈ బలరామకృష్ణులకు తల్లి ఎవరు? వీరు ఎక్కడ ఆవిర్భవించారు? అని విచారణ చేస్తే భగవన్నామమనే రామనామము నాభిస్థానము నుంచిప్రారంభమౌతుండాది. ఈ నాభిస్థానమే మధుర. శక్తి స్థానమైన శబ్దమే దేవకీదేవి. ఆమె గర్భమునందు జన్మించినవారే ఈ బలరామకృష్ణులు. గోకులము అనే నోటిలో చేరి యశోద ఆనే నాలుకపైన ఈ భగవన్నామమనే బలరామకృష్ణులు పోషింపబడుతూ వచ్చారు. కనుక బలరామకృష్ణులనే భగవన్నామము నాలుకపై నాట్య మాడుతూ వచ్చింది. భగవన్నామమనేది ఏవిధంగానైనను భగవంతుని బంధించవచ్చును.కామధేనువు మెడకైనను త్రాడు కట్టి ఒక గూటమునకు కట్టివేసిన ఆ కామధేనువు కదలక మెదలక నిలిచిపోతుంది. ఈ కామధేనువే భగవంతుడు. సమస్త అభీష్టములను అందించేవాడు.కామధేనువు వంటి భగవంతుడు, అతని మెడకు ప్రేమఅనే పాశము కట్టి, నాలుక అనే గూటమునకు తగిలించినపుడు భగవంతుడు అక్కడనే నిలిచిపోతాడు. కనుకనే భగవంతుని నామము అనేది రూపమును బంధించేప్రేమపాశము. ఇట్టి పవిత్రమైన నామతత్త్వాన్ని మనం గుర్తించుకొనలేక నామిని చూడలేక (నామి అనగా రూపము) భౌతికమైన జగత్తునే భ్రమించి, దానినే వరించి, తరించలేకపోతున్నాము. వరించాల్సింది భగవంతుణ్ణి తరించవల్సింది. జీవతత్వాన్ని భ్రమించవలసినదిప్రేమతత్వాన్ని, ఈ సత్యాన్ని మానవుడు ఈనాడు గుర్తించలేకపోతున్నాడు. దీనినే రామనామ తత్త్వమునందు పవిత్రమైన ఓంకారమునకు పోల్చుకోవచ్చు.

(శ్రీస.వి.వాపు 69/70)

 

ప్రతిరాత్రి చీకటిగానే ఉంటుంది. చీకటిగా ఉన్న దానినే రాత్రి అని పిలుస్తారు. కాని, రాత్రికి శివరాత్రికి ఉన్నభేదమేమిటి? దివ్యత్వాన్ని గుర్తించుకొన్న వానికి ప్రతి దినం శివరాత్రే! లోకాన్ని విశ్వసించినవానికి ప్రతి దినము రాత్రే. ఈ రాత్రి చీకటి, ఆ రాత్రి వెలుగు. ఈ చీకటివెలుగులందే మానవుడు తికమకమై పోతున్నాడు. అంతులేని ఆశలతో, అర్థం కాని ఆవేదనలతో అప్రాప్య ప్రాప్తికై ప్రాకులాడి నిరాశా నిస్పృహలకు గురియౌతున్న మానవునికి దిక్కును చూపే చక్కని దీపికలే - ఆధ్యాత్మిక జ్యోతులు. అటువంటి దివ్యమైన లైట్ హౌస్ (Light house) ను మనం పెట్టాలి. అదే భగవన్నామము.నామము చేతనే నామిని పొందవచ్చు. ఎక్కడ ఉన్నా దైవాన్ని పట్టవచ్చు. కనుక నామము చాలా ప్రధానమైనది.

(స. సా. ఏ.93 పు. 97/98)

 

భగవన్నామం చెప్పడానికి ఎందుకు భయం?

వాల్మీ కి రామాయణము - వ్రాసి, ఎవరు - దీనిని ప్రచారము చేయగలరు? అని యోచిస్తూ ఉండినాడు. లవకుశులు ముందుకు వచ్చారు. “గురుదేవా! మీరు ఆజ్ఞాపించండి, మేము ప్రచారము చేస్తాము” అన్నారు. కాషాయ వస్త్రములు ధరించి, రుద్రాక్షలు కంకణములుగా ధరించి తంబుర పట్టుకొని ఇరువురూ బయల్దేరారు. ఈ లేతవయస్సునందు వీరికి ఇంత త్యాగభావమా అని వాల్మీకి ఆనందబాష్పాలు రాల్చాడు. ఆ ఈనాటి యువకులకు పబ్లిక్ లో రెండు చేతులు జోడించి నమస్కారము చేయాలంటే అవమానము! నగరసంకీర్తనకు పోవాలంటే తలలు దాచుకొని పోతుంటారు. నొసట విభూతి ఇంట్లో పెట్టుకుంటారు, బయటకు వస్తే తుడిచివేసుకుంటారు. ఎంత విచిత్రమైన జీవితము! ఎంత దుర్భలమైన జీవితము! మంచికార్యమునకు, భగవన్నామస్మరణకు , ఎందుకు భయపడాలి?! దైవము పేరు చెబితే ఏమి దోషము?! అర్థరహితమైన సినిమా పాటలు పాడతావే! రామా, కృష్ణా, గోవిందా అని దైవనామము పాడడంలో ఏమి అవమానము! ఎక్కడికి పోతున్నావని ఎవరైనా అడిగితే తిరుపతికో, పుట్టపర్తికో పోతున్నానని చెప్పడానికి సిగ్గుపడతారు. బెంగళూరుకు పోతున్నామండీ అంటారు. ఎంత బలహీనులు వీరు! ఎందుకీ చిన్నదానికి ఇంత అబద్దమాడాలి! నేను పుట్టపర్తికి పోతున్నాను, స్వామిని దర్శించుకొనుటకు పోతున్నాను” అని చెబితే ఏమి నీకు అవమానము! (సనాతన సారథి, జనవరి 2019 పు9)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage