ప్రేమస్వరూపులారా! మీరు భజనలు చేస్తున్నారు. కాని, దేని నిమిత్తమై చేస్తున్నామనేది మీరు గుర్తించటంలేదు. కొంతమందికి భజన చేసే సమయంలో శ్రుతిలయ రాగముల పై మనస్సు పోతుంటాది. శ్రుతిలయ రాగములు కూడా ఉండవలసిందే కాని, వాటిపైనే దృష్టి పెడితే భావము పాడైపోతుంది. నిజంగా భగవత్ప్రేమను మీ హృదయంలో నింపుకున్నప్పుడు శ్రుతిలయ రాగములు ఆటోమెటిక్ గా సరిపోతాయి. అగ్నిలో పారవేసిన ఇనుప ముక్క పూర్తి అగ్నిగానే మారినట్టు, మీ మనస్సు పూర్తి భగవన్మయం కావాలి. పాలను, నీటిని విడదీయటానికి వీలుకాదు. అదే రీతిగా, మీరు భగవంతునిలో ఏకం కావాలి. అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించాలి. అట్టివాడే నిజమైన మానవుడు. ఏదో పండుగ రోజుల్లో భగవంతుని పూజిస్తే సరిపోదు. ప్రతిక్షణమూ దైవ ప్రార్ధన చేయాలి. ఆలా చేస్తే మా పనులెలా జరుగుతాయని మీరు సందేహిస్తారేమో! మీ పని వేరు, దైవం పని వేరా? కాదు, కాదు. ఈ విధంగా విభజించు కోకూడదు. మీరు వేరు, దైవము వేరు కాదు. కాబట్టి, మీ పని, దైవం పని ఒక్కటే.పూజ గదిలో చేసే ప్రార్థన భగవంతుని పనియని, బయట చేసే పనులు మీ పనులని భావించటం చాలా పొరపాటు. కొంతమంది పూజగదిలోకి ప్రవేశించేంత వరకు ప్రాకృతమైన భావాలతో ఉంటారు; పూజగదిలోకి పోతూనే తలుపులు వేసుకొని భగవత్రార్థన చేస్తారు. ఇట్టి భేద భావాన్ని దూరం చేసుకోవాలి. నాహృదయమే భగవంతుని మందిరం" అన్న సత్యాన్ని గుర్తించి వర్తించువాడే నిజమైన వ్యక్తి. హృదయంలో దైవాన్ని ప్రతిష్టించుకొని ఏ కార్యం చేసినా అది దైవ కార్యంగానే రూపొందుతుంది...
(స సా..ఆ.2000పు.292/293)