సంయోగమునకు వియోగమే అంత్యము; పుట్టినవాడు గిట్టుటయు, గిట్టినవాడు పుట్టుటయు, ఇవి ప్రకృతి యొక్క నియమములు, పుట్టి గిట్టని అనగా, రాకడ పోకడలేనిస్థితియే బ్రహ్మసాక్షాత్కార జ్ఞానమనబడును. బ్రహ్మము సర్వవ్యాపక తత్త్వము కలవాడు కనుక, రాక పోకలకు వేరు స్థలమెక్కడిది? బ్రహ్మసాక్షాత్కార జ్ఞానము అందరికీ సాధ్యమా, ఇట్టి ప్రాప్తి అందరికీ జేకూరునా? అని, సంశయించనక్కరలేదు. దీనికి యేశ్రమయు, యేప్రాప్తియు, యే యోగ్యకర్మయూ చేయనక్కరలేదు. నిరంతరము. నీ మనసును పరమాత్మయందు లగ్నముచేసిన చాలు. అనగా, నిరంతరము భగవంతుని ధ్యానించుచుండిన చాలును. అట్టి నిరంతర ధ్యానమే మాలిన్యమైన మనసును నిర్మలము చేయును. మనస్సు యెప్పుడు నిర్మలాకారమును పొందునో, అపుడు మోహము నాశమగును. మోహనాశమే మోక్షము. మోహక్షయ మైనవాడు యెట్టి మృత్యువుచేత దేహమును వీడిననూ బ్రహ్మైక్యమును పొందును. అట్టివానినే "జ్ఞాని" అని అందురు.
(గీ.పు.160)
బ్రహ్మసూత్రములు స్వల్ప అక్షరపదాలతో సారభూతమైన అనంత అర్థాన్ని చాలా తక్కువగా సూచించేవి సూత్రాలు. సర్వోపనిషద్వాక్య సుమములను కూర్చిన చేర్చిన వేదాంత శాస్త్రముల ఈ బ్రహ్మసూత్రము.
(సూ.వా.పు.4)