ప్రతి దేహమునందు ఒకహృదయమున్నది. దీనికే వేదము ఆత్మ అని పేరు పెట్టింది. ఆత్మకే ఈశ్వరో అని పేరు. "ఈశ్వర స్పర్వభూతానాం" ఈశ్వరతత్వం ప్రతి వ్యక్తి యందు, సర్వ భూతముల యందు ఉన్నది. ఇట్టి హృదయమనే ఈశ్వరత్వం నుండియే మనస్సనే విష్ణుత్వం ఆవిర్భవించింది. “విశ్వం విష్ణుమయం జగత్", అన్నారు. విష్ణువనగా సర్వవ్యాపకుడు. మనస్సు కూడా అట్టిదే. విష్ణువుకున్న సర్వ వ్యాపకత్వం మనస్సుకు కూడా ఉంది. మనస్సు ఏ క్షణమునందైనా ఏ ప్రదేశము సందైనా, ఏ దేశమునందైనా సంచరించగలదు. కనుకనే, "మనో మూలం మిదం ఇగత్" అన్నారు. మనస్పే విష్ణు స్వరూపం. విష్ణువు యొక్క నాభికమలము నుండి ఉద్భవించినవాడు బ్రహ్మ. అట్లే, మనస్సు నుండి ఆవిర్భవించినది వాక్కు, కనుక, బ్రహ్మ వాక్వ్సరూపుడు. దీనిని పురస్కరించుకొనియే మహర్షులు దివ్వత్వాన్ని "శబ్దబ్రహ్మమయి" అని వర్ణించారు.
ఆత్మ, మనస్సు, వాక్కు - ఈ మూడూ అవినాభావ సంబంధం కల్గినవి, వాక్వ్సరూపుడే బ్రహ్మ; మనోస్వరూపుడే విష్ణువు: ఆత్మస్వరూపుడే శివుడు. కనుక, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు గుణస్వరూపులై ప్రతి మానవునియందున్నారు. వారికి ప్రత్యేకమైన ఆకారములు లేవు. ఆత్మ చైతన్యస్వరూపం (Consciousness) అదే ఈశ్వరత్వం. విశ్వమంతా వ్యాపించినవాడు విష్ణువు: బృహత్స్వరూపుడైనవాడు బ్రహ్మ. ఇట్టి సర్వవ్యాపకులైనబ్రహ్మ, విష్ణు మహేశ్వరులు అణుమాత్రమైన మానవదేహమునందే ఆవిర్భవించి యున్నారు. "అణోరణియాన్ మహతో మహీయాన్". భగవంతుడు అణువులో ఆణువుగా, ఘనములో ఘనముగా ఉన్నాడు. బ్రహ్మాండమునందున్న మహత్తరమైన శక్తులన్నీ అణుమాత్రమైన దేహమందే ఇమిడియున్నాయి. బ్రహ్మాండమును మీరెవ్వరూ చూడలేరు? చూచుటకు వీలుకాదు. మీయందున్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల తత్త్వాన్ని మీరు అర్థం చేసుకుంటే విశ్వమునంతటినీ అర్థం చేసుకున్న వారవుతారు. ఎట్టి సంకల్పములూ లేనివాడు ఈశ్వరుడు. హృదయం ఈశ్వరస్వరూపమని గుర్తించినటువంటి వ్యక్తులు ఎట్టి దుర్గుణాలకూ, దురాలోచనలకు అవకాశమివ్వరు. వేదము హృదయాన్ని "నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య, శుద్ధ, బుద్ధ, ముక్త, నిర్మలస్వరూపిణిం," అని వర్ణించింది. ఇట్టి హృదయాన్ని ఈ నాటి మానవులు దుర్భావాలతో నింపుకొని దుర్వినియోగ పర్చుకున్నారు. హృదయమే ఈశ్వరుడని గుర్తించి ఈశ్వరభావంతో జీవించాలి. వాక్కే బ్రహ్మ స్వరూపమని గుర్తించి, మృదుమధురమైన వాక్కును పోషించుకోవాలి. మనస్సే విష్ణుస్వరూపమని గుర్తించి మనస్సును పవిత్రంగా ప్రశాంతంగా ఉంచుకోవాలి....
(ససా.జా..2000పు 200/201)
(చూ|| త్రిమూర్తి స్వరూపులు, ధర్మస్థాపన)