స్త్రీలకు బ్రహ్మవిద్యయందు అధికారము లేదనుట శుద్ధ అబద్ధము. కాని లౌకికవ్యవహారములందు వారలకు కొన్ని నిబంధనలు అత్యవసరము. ఇదియును ధర్మరక్షణ నిమిత్తమే, లో కళ్యాణార్ధమే. స్త్రీలుఇటువంటి నిబంధనలు తుచ పాటించియే తీరవలెను. ఇందులో ఆచార విచారములు గూఢముగా నుండుటచే స్త్రీలు వాటిని సక్రమముగా పాటించలేని బలహీనులగుటయు, ప్రకృతికి సంబంధమైన కొన్ని ఆటంకములుండుటయు, అట్టి నిర్భంధనలకు కొన్ని కారణములుగా నున్నవి. అసలు పండితులు సహితము, శాస్త్రజ్ఞులు సహితము బ్రహ్మాదిదేవతలయందు నారీస్వరూపిణియగు సరస్వతీదేవిని ఉపాసించియే జ్ఞానమును పొందుదురు. విద్యాధిదేవత అయిన సరస్వతియు, ధనాధిదేవత అయిన లక్ష్మియు, జ్ఞానస్వరూపిణి అయిన పార్వతియు, స్త్రీలే కదా! వేయేల ! లోకమునందు కూడనూ యెవరికయిననూ స్త్రీలకు జాబులు వ్రాయునపుడు కూడనూ లక్ష్మీ సమానురాలయిన అని సంబోధించుట పరిపాటేకదా ! మాతా పిత, గౌరీశంకర, లక్ష్మీనారాయణ, సీతారామ, రాధాకృష్ణ, ఇత్యాది స్త్రీవాచక పదములే ప్రయుక్తములయి ఉన్నవి. కాన స్త్రీలకు ఇందులో యెంత గౌరవ స్థానము కలదో గుర్తించవలెను.
(ప్ర. శో.వా.పు.37)