ఈ దేశం ఆదేశం అన్న భేదాలు పెట్టుకోకూడదు. ప్రపంచములోని 575 కోట్ల మంది ప్రజలూ భగవంతుని బిడ్డలే. యీ ప్రపంచమంతా ఒక పెద్ద భవనం. యిందులో అమెరికా ఒక రూము, రష్యా ఒక రూము, జపాన్ ఒక రూము, ఇటలీ ఒక రూము, ఇండియా ఒక రూము. యీ విధంగా అన్ని దేశాలు ప్రపంచమనే భవనము లోని గదుల వంటివే: మధ్యలో గోడలు కట్టుకోవడం వల్ల గదులన్నీ విడివిడిగా కనబడుతున్నాయి. గోడలను కొట్టి వేస్తే అంతా ఒక్కటి అయిపోతుంది.
అందరూ భగవంతుని బిడ్డలే. ఏకత్వాన్ని పెంచుకోవాలి. భారత దేశమన్నను. భారతీయ సంస్కృతియన్నను, ప్రజలలో గౌరవము, భక్తి ఇనుమడింపచేయాలి. భారత దేశాన్ని రక్షించేది రాజకీయం కాదు, తుపాకులు కాపాడలేవు. బాంబులు రక్షించలేవు. ప్రజల గుండెల్లో నాటుకున్న దేశభక్తి, త్యాగశీలం, ఆధ్యాత్మిక దృక్పథం – యివేదేశాన్ని కాపాడాలి.!
(దే.యు.పు.38/39)
పుష్పాలలోని మకరందాన్ని గ్రోలే తుమ్మెదలవలె ఉండండి. అంతేకాని ఇతరుల రక్తం పీల్చేవి. వ్యాధుల్ని వ్యాపించేసే దోమల వలె ఉండకండి. మొదట మీరంతా భగవంతుని బిడ్డలేనని, అందరూ సోదరీసోదరులని భావించండి.ప్రేమగుణాన్ని పెంపొందించండి. నిరంతరం మానవు లందరికి క్షేమాన్ని ఆకాక్షించండి. ఆందరిని ప్రేమించండి. ఫలితంగా మీరు ప్రేమింపబడతారు. ప్రేమను - వృద్ధిచేసుకొని అందర్నీ ప్రేమతో చూడటం ఆరంభిస్తే ఎవ్వరూ మిమ్మల్ని ద్వేషించరు.
(త.శ.మ.పు. 133)
ఇది వారిపనే కాని మాపని కాదు అని అనుకో కూడదు. ఇది అందరి పని, అందరూ మనవారే, అందరూ ఒకే భగవంతుని బిడ్డలు. "Brotherhood of Man - Fatherhood of God" అనే భావాన్ని మన మనస్సులో చేర్చాలి. సర్వదుఃఖములకు కారణమైన నీవు, నీవు అన్న భేదభావమును విడనాడి మనము, మనము అనే భావాన్ని చేపట్టాలి. మానవుడు "నేను" అన్న ప్రదేశమునుండి ప్రయాణముచేసి మనము అనే గమ్యమును చేరాలి. చివరకు I and you are one అన్న భావాన్ని మనం అందుకోవాలి.
(శ్రీ ది.పు.36)
(చూ|| ఐకమత్యం )