ప్రేమ స్వరూపులారా! మీకు వేదములోని అక్షరములు తెలియక పోయినా పరవా లేదు. ఆ శబ్దమును శ్రవణము చేస్తే చాలు! అందులోనే ఉంటున్నది ఆనందము. పుట్టిన బిడ్డను ఊయలలో వేసి తల్లి కమ్మని కంఠంతో జోలపాట పాడుతుంది. ఆ చంటి బిడ్డకు అమ్మ పాడే పదములు అర్థము తెలియునా? తెలియదు. కాని, ఆ రాగమువల్ల చంటి బిడ్డ చక్కగా నిద్రపోతుంది. అదే విధముగా మీకు అర్థము తెలియక పోయినా ఫరవాలేదు. ఎవరైనా వేదోచ్చారణ చక్కగా చేస్తుంటే మీరు ఆనందంగా శ్రవణం చేయండి. ఆ నాదములోనే ఎంతో ఘనమైన శక్తి ఇమిడి ఉంటున్నది.దేవాలయమునకు వెళ్ళిన వారంతా ఒక తూరి గంట కొడతారు. అక్కడ గంటలు ఎందుకోసం పెట్టారు? భగవంతుడు నిద్రపోతుంటాడని, అతనిని మేల్కొల్పడానికి పెట్టారా? కాదు, కాదు. వేదము రాని వారు నాదమే వేదమని భగవంతునికి వినిపించుకుంటారు. అంతేకాదు ఈ ఆధునిక యుగంలో మనం ఎవరింటికైనా పోతే - అక్కడ ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి లోపలికి పంపిస్తాము. దానిని చూసి "...! ఫలానా వారు వచ్చారా?" అని గుర్తించి అతడు లోపల నుండి బయటకు వస్తాడు. అదే విధంగా దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు బెల్ కొట్టడమే మన విజిటింగ్ కార్డు అప్పుడు ఆ భగవంతుడు "ఎవర్రా.. బెల్లు కొట్టాడు?" అని చూస్తాడు. అనగాభగవంతుని దృష్టిని ఈ శబ్దం ద్వారా మనపై మరల్పు కుంటున్నాము. అది కూడా ఇష్టమొచ్చిన శబ్దము చేయకూడదు. చక్కగా అకార, ఉకార, మకారములతో కూడిన ఓం కారనాదం రావాలి.
(స.సా. 2.94 పు. 21)