మనము చేసిన కర్మలన్నియు కూడనూ మన భ్రాంతిచే నేను చేసానని భావించటంచేత దానిని అనుభవించటాన్ని తగిన అర్హతను కోల్పోతున్నాము. ఈ అనుభవించేదంతా సూక్ష్మదేహమే. ఇదే ప్రాణమయ, విజ్ఞానమయ, మనోమయ కోశముల యొక్క స్వరూపము. వీటినే వేదము యందు "ఋతం, సత్యం, బృహత్వం" అన్నారు. బృహత్వమనగా విశాలత్వం. దీనినే ఉపనిషత్తులంతా కూడనూ మహాతత్వమన్నారు. దీనినే భూమము అన్నారు. భూమమనగా బ్రహ్మతత్వమే. వ్యాపింపజేసే గుణము కల్గినదే బ్రహ్మ. ఈ వ్యాపించే గుణము గాలితో కూడినది. గాలి సర్వత్రా వ్యాపించి వుంది. ఇది పంచభూతములలో ఒకటి. ఈ ఐదు మానవుని యొక్క హస్త గతమయినవే. నిజముగా మానవుడు ఈ పంచభూతములను స్వాధీనమునందుంచుకొని ఎంతో అధికుడుగా ఉండవలసిన స్థితిని తాను కోల్పోతున్నాడు. వీటికి తాను దాసుడు కావడంచేతనే తాను సర్వమునకు బద్ధుడైపోతున్నాడు. మనము బద్దులముకాము. బుద్ధులమే. ఈ మానవత్వము చాలా విశిష్టమైనది, ఉత్కృష్టమైనది, సౌజన్యమైనది, సౌశీల్యమైనది. ఇలాంటి మానవత్వాన్నిమొట్టమొదట మనము అర్థంచేసుకోవాలి. మానవునికంటే అధికమైనది ఈ జగత్తునందు మనకు కానరాదు. అట్టి దివ్యమైన మానవత్వాన్ని మనము ధరించి అల్పత్వమైన దేహభ్రాంతిని మనము వరించి మనము ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నాము.
(స.ది.పు 20/21)