ఈ కళాశాలలో (9.6.1969) చదువు విద్యార్ధులకు సంపూర్ణ విద్య, అనగా కర్మ మార్గమూ ధర్మ మార్గమూ, బ్రహ్మ మార్గమూ, నేర్పుదురు. ఈ కాలేజీ విద్యార్థులైన మీరుఈ కాలేజిలోనే పై తరగతిలో చేరవచ్చు. లేదా మరో కాలేజీలో చేరవచ్చు. లేకపోయిన చదువు పూర్తి చేసుకుని యింటికి తిరిగి వెళ్ళ వచ్చును. మీరెక్కడ వుండిననూ ఈ కాలేజి విద్యార్థులుగా మీ రందుకొనిన ప్రత్యేకమైన తర్ఫీదు వలన మీ జీవితములలో మీరు రాణించవలెనని నా కోరిక. అభిప్రాయ భేదములతో, ద్వేషములతో అధికారోన్మాదములతో, ఉద్రేకములతో, పరస్పర విరోధములతో నిండియున్న రాజకీయ నరకములో మాత్రం ప్రవేశించ వద్దు. యుగయుగాలుగా భారతావని పొందుపరచిన జ్ఞానదీపికను చేతబూని ఉజ్వల భవిష్యత్తువైపు పురోగమించే నాయకులుగా మీరందరూ తయారు కావాలి.
ఇది పుణ్యభూమి యోగభూమి, అనాదిగా ఆధ్యాత్మిక జ్ఞాన సంపదకు ప్రసిద్ధి కెక్కింది. ఈనాడు తొంబది తొమ్మిది అజ్ఞానులు, లేదా ఆధ్యాత్మిక జ్ఞానమును నిరసించువారు, ప్రజలు వారి సంస్కృతిని వారే న్యూనత పరచుచున్నారు. ఇకనైనను మీ తప్పులు మీరు తెలుసుకుని మీ జీవితములను సంస్కరించుకుని పావన భారతావని ప్రతిష్టను పునరుద్ధరించుడు. ఇతరులలో దోషములు వెదకుట మానుడు. మీ బంధుమిత్రుల యడల తోటి మానవుల యడల గౌరవముతో ప్రవర్తింపుడు. దేశ సేవ చేయుడు, సర్వజన శ్రేయస్సు కొరకు ప్రార్థించుడు.
(స. శి.సు తృ .పు. 13)