బృహదారణ్యకోపనిషత్తు శుక్ల యజుశ్శాఖాంతర్గము; దీనియందు ఆరు ఆధ్యాయములు కలవు. అందులో మూడు నాలుగు అధ్యాయములు తప్ప, తక్కిన నాలుగు అధ్యాయములు కర్మసముచ్చయమగు ఉపాసనమును వివరించినవి. మూడు నాలుగు అధ్యాయములందుయాజ్ఞవల్క్యుడు జనకునకు ఆధ్యాత్మికతత్త్వమును ఉపదేశించెను. యాజ్ఞవల్క్యుని ఆధ్యాత్మిక జ్ఞాన వైభవము ఇందులో పూర్తిగా ప్రదర్శింపబడినది. ఇది ముముక్షువులకు ఉత్తమమగు తారకమగుచున్నందున ఈ రెండు అధ్యాయములూ యాజ్ఞవల్క్యకాండమని ప్రఖ్యాతి గాంచినవి. ఈ ఉపనిషత్తు దశోపనిషత్తులలో కడపటిది. ఇది అర్థమునందును, పరిమాణమునందును మహత్తర మగుటచే బృహత్త నియు, అరణ్యమునందు పఠించుటవలన అరణ్యకమనియు, బ్రహ్మజ్ఞానోపదేశమగుటచే ఉపనిషత్తనియూ ఆలరారు చున్నది. మొదటి రెండధ్యాయములు మధుర కాండమనియు తరువాత రెండధ్యాయములు మునికాండమనియు, చివరి రెండధ్యాయములు ఖిలకాండ మనియు పండిత లోకమున చెప్పబడుచున్నవి. ఖిలశబ్దమునకు అనుబంధమని అర్థము. మొదటి కాండమందు తత్త్యము యథారూపముగా ఉపదేశింపబడినది. అయ్యదియే రెండవ కాండమందు అనుభవముచే సమర్థింపబడినది. మూడవదానియందు దాని ఉపాసనా విధానము ప్రదర్శించబడినది. మొదటి కాండము జ్ఞానోపదేశము, అది కర్మోపాసనా సముచ్చయ రూపమున ఉపదేశింపబడినది. జిజ్ఞాసువులకు బ్రహ్మ జ్ఞాపకములగు సాధనములు పదము, బీజము, సంఖ్య, రేఖ అని నాలుగు విధముల పిలువబడుతున్నవి. వానిలో పదమనగా వేదము. దాని అర్థ బోధకమగు శ్రుతియు, బీజమనగా గురుముఖైక వేద్యమగు మంత్ర సముదాయము. సంఖ్య వైదికము, లౌకికము అని రెండు విధములు. వైదికమగు సంఖ్య మంత్ర సంకేతముగ అలరారుచు, తత్త్య మునకు సన్నిహిత సాధన మగుచున్నది. లౌకిక సంఖ్య, సర్వ ప్రపంచ వ్యవహార సర్వజనానుభవ సిద్ధమగుచున్నది. రేఖ కూడ సంఖ్య వలెనే రెండు విధములు. వైదికమగు రేఖ ఉపాసనాంగము. లౌకికమగు రేఖ గణితశాస్త్ర ప్రసిద్ధము. మధురకాండము బ్రహ్మ తత్త్వము శాస్త్ర ప్రమాణమును ముఖ్యమైన ఆధారముగా చేసికొని విషయ వివరణము అచట చేయబడినది.
(ఉ.వాపు. 33/34)