వచ్చిన దూత ఉద్ధవుడు. కృష్ణునికి పరమ మిత్రుడు. గోపికలు పడుతున్న పాట్లు తెలుసుకున్న మాధవుడు వారి హృదయ పరితాపమును చల్లార్చి వారికి ఆనందము నందించుటకై ఉద్ధవుని పంపించాడు. ఈ ఉద్ధవుడు దిగిన తక్షణమే ఓ పెద్ద లెక్చర్ మొదలు పెట్టాడు. గోపికలారా! మీరు శాస్త్ర హీనులు: ఏవిధమైన ప్రజ్ఞానమూ మీకు లేదు. మూఢులు. మూగ వారి వలె కృష్ణుని కోసం పరితపిస్తున్నారు. శాస్త్రాన్ని తెలుసుకొంటే కృష్ణుడు మీ వెంటనే ఉంటాడు. మీ హృదయంలోనే ఉంటాడు. అలాంటి కృష్ణుని చూచి ఆనందించండి. స్థూల దేహంలో ఉన్న కృష్ణుని కోసం మీరు పరితపించడం అజ్ఞానం, నేనిప్పుడు మీకు యోగశాస్త్రం బోధిస్తాను. అందుకే కృష్ణుడు నన్నిక్కడికి పంపాడు. అన్నాడు.
కన్నెత్తి పరమపురుషునితో ముఖాముఖిగా మాట్లాడటం వాళ్ళ స్వభావం కాదు గనుక. ఒక భ్రమరమును సాక్షిగా పెట్టుకొని, సంభాషణ సాగేట్టుగా వారు యుక్తి పన్నారు. కృష్ణునికి అర్పితమైన వారు, పరపురుషులతో మాట్లాడటం దోషం కదా! కనుక ఓ తుమ్మెదా! అని సంబోధించి తుమ్మెదతోనే మాట్లాడుతున్నారు వాళ్ళు ఓ తుమ్మదా! కృష్ణ వియోగాగ్నిలో మండిపోతున్న మా హృదయాలకు ఈ మాటలు మరిన్ని కట్టెలు కాల్చినట్లున్నవి. మరింత తైలము పోసినట్లున్నది. ఇక మాట చాలించు తుమ్మదా అన్నారు గోపికలు. అంతటితో అతను ఆగలేదు. ఇదిగో! కృష్ణుడు పంపిన సందేశం. దీనినైనా చదువుకోండి! అన్నాడు. ఒక గోపిక అన్నది. తుమ్మెదా! మేము పల్లె పడుచులం. మాకు చదువు సంధ్యలు లేవు. కృష్ణుని వియోగములో మేము కుమిలి పోతున్నాం. మాటలు చాలించి కృష్ణుని చూపించు మరొక గోపిక అందుకున్నది: తుమ్మెదా ఈ దేహము విరహాగ్నిలో మండుతున్నది. చేతులతో తాకగానే ఆ కాగితం భస్మమై పోవచ్చు. కనుక దానిని మేము తాకము అని చెప్పింది. ఇంకొక గోపిక అన్నది ముత్యముల వంటి ఆ కృష్ణుని అక్షరములు మా కంటి ధారలకు చెదరిపోతాయి. కనుక ఆ జవాబును మేము చూడము. అప్పుడు ఉద్దవుడు, అయితే యోగ విద్య బోధిస్తాను వినండి అన్నాడు. మరొక గోపిక అందుకున్నది. ఆమె భరించలేక పోయింది, తుమ్మెదా! నీ అధిక ప్రసంగాన్ని కట్టిపెట్టు. మాకున్నది ఒకేమనసు. అది కృష్ణునితోనే మధురకు వెళ్ళి పోయింది. నీ వలె మాకు నాలుగు మనసులుంటే వియోగ శాస్త్రానికొకటి. దానికొకటి. దీనికొకటి వినియోగించే వాళ్ళం. ఉండేది. ఒకే మనసు, అదీ ఇక్కడ లేదు. శ్రీకృష్ణునితోనే ఉంది. నీ యోగశాస్త్రం ముగించుకొని వచ్చిన దారిని వెళ్ళిపో! అన్నది.
ఈ ఒక్క మనసు అనే మాట వినగానే ఉద్ధవుని మనసు గిఱ్ఱును తిరిగింది. సర్వ వేదముల సారము ఏక మనస్తత్వము. ఏకాత్మ భావమే కావలసింది. ఏకాత్మ భావమునకు ఏక మనస్సు కావాలి. అదే ఏకాగ్రత. ఈ గోపికలకున్న ఏకాగ్రత నాకు లేకపోయింది. కదా! అని తనలో తాను విచారించుకున్నాడు. అమ్మలారా! నేనిక కృష్ణుని దగ్గరకు వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు. గోపికలలో కొంత ఉన్నత స్థాయి భక్తి గలవారు రాధిక, నీరజ. రాధిక చెప్తున్నది:
తుమ్మెదా ఒకసారి కన్నెత్తి చూడమని చెప్పవే నామాట రాచిలుక తోడ.
ఉద్ధవుని తుమ్మెదగా పోల్చుకున్న గోపికలు కృష్ణుని రామ చిలుకగా పోల్చుకున్నారు. మాహృదయం పరితపించి పోతున్నది. ఒక్క తూరి కన్నెత్తి తమవైపు చూడమని చెప్పు అన్నది.
ఇంక నీరజ చెప్పింది:
చెదరి పోయిన నాదు జీవిత సుమమాల
చెలువార చూచి ధరియించమనవే
ఇంకొక గోపిక అందుకున్నది:
మబ్బు గ్రమ్మిన నాదు మానస వీధిలో
కృష్ణ భానుని తేజము నిలువ మనవే
మరో గోపిక అన్నది:
ఎండు బారిన నాదు జీవిత సుమములు
చిగురు బెట్టగ వేగ చేయమనవే
వీరి సందేశాలను తీసుకున్న ఉద్ధవుడు వెళ్ళుతున్నాడు. ఇసుక తిన్నెల పైన చర్మము బండబారి పడివున్న రాధను చూశాడు. రాధమ్మా! నేను ఉద్ధవుణ్ణి, కృష్ణుడు పంపిన రాయభారాన్ని గోపికలకు అప్పజెప్పాను. వారు కొన్ని సందేశాలు పంపారు. నీవేమైనా సందేశం పంపుతావా? అని అడిగాడు. ఆమెకు పోయిన ప్రాణం లేచి వచ్చింది. ఉద్దవా!
వృక్షంబువలె తాను వర్ధిల్లు చుండిన
వల్లికనై నేను అల్లుకొందు
పుష్పంబువలె తాను పాలు పొందుచుండిన
తుమ్మెదనై నేను తిరుగుచుందు
మేరు పర్వతమే తానైన
పరచుకొని పారెద నేను సెలయేరునై
అనంత ఆకాశమే తానైన
చిన్ని చుక్కను నేనై తనలోనే చేరుకొందు
వరసముద్రుడు తానైన వాహిని యగుదు
నేను తనలోనే ఐక్యమొందుదు
కృష్ణా.... కృష్ణా.... కృష్ణా.... కృష్ణా....
ఎందున్నావో...ఇందురావో..... దయలేద నీ దాసిపై...
ఈ విధంగా పరితపిస్తున్న రాధను చూచి ఉద్దవుని హృదయం కరిగి పోయింది. భక్తి ప్రపత్తులు తనకు సులభముగా అర్థమయ్యేట్టు చేయడానికి ఈ రాయభారాన్ని నిమిత్తంగా చేసి కృష్ణుడు తన నిక్కడికి పంపించాడని గ్రహించాడు ఉద్దవుడు. గోపికల ద్వారా తనకు నేర్పించడానికి ఇంత నాటకం ఆడాడని అనుకున్నాడు. ఆనాటి గోపికలు తమ భక్తి ప్రపత్తుల ద్వారా పరమ భక్తులు. శాస్త్రవేత్తలైన వారికి కూడా అంతరార్థాన్ని సూక్ష్మమైన మాటలలో ప్రబోధించారు. భక్తికి పరమావధి, గమ్యము ప్రేమ అని గోపికలు నిరూపించారు.
ప్రేమ రహితమగు భూములలో
ప్రేమాంకురములు పెంపొంద
ప్రేమావేశములో
ప్రేమసుధా వర్షము వర్షింపగ
ప్రేమ నదులు ప్రవహింపగ మురళీ
గానము చేయగదే, కృష్ణా...
క్షేత్రము ప్రేమే, బీజము ప్రేమే వర్షము ప్రేమే. ప్రవాహము ప్రేమ, మురళీ ప్రేమే. సర్వమూ ప్రేమే.... గోపికలు ప్రేమమయులై తపించారు. కృష్ణుడు దగ్గరకు వచ్చినా వారి కోరిక ఆ మురళిని వాయించమనే!
పాట పాడుమా కృష్ణా..
పలుకు తేనె లొలుకునటుల
మాటలాడుమా ముకుంద మనసు తీరగా
వేదసారమంత తీసి నాదబ్రహ్మముగ మార్చి
వేణునందు తిరుగబోసి
గాన రూపముగ మార్చి || పా||
పుంసామోహనరూపాయ, పురుషులను సైతము మోహింప చేసేది దైవత్వము. ఇది చైతన్య శక్తి అందరిలోను ఉంటుంది. దానిని అనుభవించుకోవడానికి సాధన చేయాలి. అందుకు ఏకైక మార్గము ప్రేమ తత్వము. ప్రేమను అభివృద్ధి పరచుకొని దైవత్వాన్ని అనుభవించాడానికి ప్రయత్నించిన రోజే కృష్ణ జన్మోత్సవం కాని, ప్రతి అష్టమికి కృష్ణుడు పుడతున్నాడని కాదు. అష్టమి అయినంత మాత్రాన కృష్ణుడు పుట్టడు. ఏరోజు కష్టములను తీర్చుకోవడానికిప్రేమ తత్వాన్ని అలవరచుకుంటావో ఆరోజే కృష్ణుడు ఉద్భవిస్తాడు. కృష్ణుని బోధనలను ఆచరణలో పెట్టడమే నిజమైన పండుగ.
(స. సా.అ..83 పు 238/241)
(చూ|| చిత్తాపహారి)