బుద్దిదోషము

కౌరపాండవుల మధ్య సంధి కుదర్చడానికి కృష్ణుడు హస్తినాపురం వెళ్ళినప్పుడు దుర్యోధమనకు అనేక విధములుగా హితబోధ చేశాడు. కాని, సర్వ ధర్మములు తెలిసిన దుర్యోధనుడు కృష్ణుని హితబోధను లెక్కచేయలేదు. కారణం ఏమిటి? సత్యమేమిటో, ధర్మమేమిటో తనకు తెలిసి కూడా బుద్ధిదోషముచేత వాటిని ఆచరణలో పెట్టలేకపోయాడు. కట్టకడపటికి అతనికి ఏ గతిపట్టిందో మీకు తెలుసు.

 

నారదుడు రావణుని వద్దకు వెళ్ళి పర స్త్రీని అపహరించడం మహా పాపమని. సీతను రామునికి అప్పజెప్పమని బోధించాడు. ఇల్లాలు మండోదరి కూడా ఎంతగానో నచ్చజెప్పింది. కానీ, రావణుడు వారి హితబోధను పెడచెవిని పెట్టి సర్వ నాశనమయ్యాడు. రావణునికి పట్టిన గతే హిరణ్యకశుపునికి కూడా పట్టింది. ఆతనిని మించిన సైంటిస్టు మరొకడు లేడు. ఈనాటి సైంటిస్టులు చంద్రమండలం వరకే వెళ్లగల్గారు గాని హిరణ్యకశుపుడు సూర్య నక్షత్ర మండలములను కూడా దాటాడు. అంతటి గొప్ప సైంటిస్టు దైవాన్ని ద్వేషించి, ధర్మాన్ని పాటించక తన కన్న కుమారుని కూడా హింసించాడు. కట్టకడపటికి పతనమై పోయాడు. సుగ్రీవుణ్ణి ఎందుకు అడవులకు పంపించావని వాలిని ప్రశ్నించినప్పుడు అతడు తన దోషాన్ని కప్పిపుచ్చుకుని, సుగ్రీవుడు తనకు మోసం చేశాడని చెప్పుకున్నాడు. బుద్ధిదోషముచేతనే వాలి ఈవిధమైన అసత్యానికి పాల్పడ్డాడు. అంబ కూడా తన దోషాన్ని కప్పిపుచ్చుకుని భీష్ముడు తనకు మోసం చేశాడని నిందించింది. వీరందరూ సామాన్యులు కావచ్చును. కాని, గొప్ప తపశ్శక్తి సంపన్నుడైన విశ్వామిత్రుడు కూడా బుద్ధిదోషముచేత ధర్మాన్ని విస్మరించి వశిష్టులవారిపై ద్వేషం పూనాడు. ఈనాడు గొప్ప గొప్ప సైంటిస్టులు కూడా బుద్ధి దోషముచేత అసత్యాన్ని సత్యంగా, సత్యాన్ని అసత్యంగా ధర్మాన్ని అధర్మంగా, అధర్మాన్ని ధర్మంగా భావిస్తున్నారు.

 

బుద్థిస్వరూపుడే గణపతి: మేధాశక్తి స్వరూపుడే గణపతి. జ్ఞానస్వరూపుడే గణపతి: సత్యస్వరూపుడే గణపతి. అతనికి వినాయకుడని కూడా పేరు కలదు. ఎందుకంటే, అతనికి మరొక నాయకుడు లేడు. అతనికి ఇంకొకరు సలహాలు ఇచ్చేవారు లేరు. అతను చెప్పినదే సత్యము, అతను చేసినదే ధర్మము. కనక, అతని వాక్యమును శిరసావహించడమే మానవుని కర్తవ్యము. ఈనాటి మానవుడు తన మేధాశక్తి చాల గొప్పదని విఱ్ఱవీగుతున్నాడు. అది ఎప్పుడు గొప్పదవుతుంది? ఆ మేధాశక్తిని Skill చేసినప్పుడే అది గొప్పదవుతుంది. అప్పుడే జీవితంలో చక్కని Balance ఏర్పడుతుంది. కాని, ఈ కలిప్రభావంచేత మానవుడు తన మేధాశక్తిని Kill చేస్తున్నాడు. అందుచేత తన జీవితంలో Balance తప్పిపోయి మానవునిలో బుద్ధి దోషము ఏర్పడింది. తనకు తోచినదే సత్యమని, తామ చేసినదే ధర్మమని భావిస్తున్నాడు. దీనికి తగిన ఫలితమును అనుభవించక తప్పదు.

(ససాన.99.పు.285/286)

 

ఈ ప్రపంచమెచట నుండి ఎటుల వచ్చినదని యుగములు విదారించినను తేలదు. ఏ విద్య వలననో ఎచ్చటి నుండియో వచ్చియుండినదో విచారణ ఫలితము ఉండును. కానీ, జగత్తు అట్టి విషయముకాదు. జగత్తు ఎట్లు కలిగినను ప్రశ్న రజ్జు సర్పభ్రాంతి యందలి సర్ప మెట్లుఉద్భవించినదను ప్రశ్న తుల్యము. అచ్చట ఉన్నది త్రాడు. కాని దాని నుండి సర్పము ఉద్భవించెను. ఈ సర్పోద్భవ కారణము, చూచునట్టి వాని బుద్దియందు గల దోషము. అనగా భ్రమ లేక అజ్ఞానము. కావున సర్ప ఆవిర్భావ కారణము అజ్ఞానము వలన పుట్టెనను జవాబు యుక్తిసిద్ధము. అటులనే త్రాడు స్థానమున నున్నది బ్రహ్మము. పాము స్థానముననున్నది జగత్తు. అనగా బ్రహ్మమునే మనము భ్రాంతి వలన జగత్తుగా తలచి వ్యవహరించు చున్నాము. ఇచ్చట కూడా చూచునట్టి వాని బుద్ధి దోషమనకు తీరదు. ఒక వస్తువును మరొక వస్తువుగా చూచుట బుద్ధిదోషమని తేలుచున్నది. బుద్ధి దోషమువలన భ్రాంతివలన జనించిన విషయ మెప్పటికీ సత్యము కాదు. భ్రాంతి నశించిన తజ్జనిత విషయము కూడా నశించును. యదార్థము గోచరమగును.

(జ.పు. 93)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage