సృష్టి స్థితి లయము లనేవి మానవునియందు అంతర్భూర మైన శక్తులే. సృష్టి అనగా సంకల్పము యొక్క స్వరూపమే; స్థితి అనగా సృష్టించినదానిని రక్షించడమే: లయమనగా రక్షింపబడినదానిని తనలో చేర్చుకోవడమే. ఈ సృష్టి స్థితి లయములు రజోగుణ తమోగుణ సాత్వికములకు సంబంధించినవి. మానవుడు త్రిగుణాత్మక స్వరూపుడు. ఈ త్రిగుణములే త్రిమూర్తులు. త్రిమూర్తులే త్రిలోకములు. ఈ ప్రపంచంలో బ్రహ్మ విష్ణువు హేశ్వరులను దర్శించినవారు ఎవ్వరూ లేరు. ఎవరు బ్రహ్మ? ఎవరు విష్ణువు? ఎవరు మహేశ్వరుడు? మానవుని యందున్న త్రిగుణములే ఈ త్రిమూర్తి స్వరూపములు.
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాపసంహారం ఏక బిల్వం శివార్పణం"
ఈ త్రిమూర్తి తత్వమును ఏకత్వం గావించుకున్నప్పుడే మానవత్వంలో మంగళత్వము ఏర్పడుతుంది. రాజకీయ రంగమునందు. ఆరోగ్యశాఖ, విద్యాశాఖ, ఆర్థికశాక మున్నగు అనేక శాఖలుంటాయి. ఇదేవిధంగా, ఆధ్యాత్మిక రంగంలోను సృష్టిస్థితి లయములనే శాఖలు ఉంటాయి. ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క నాయకుడు ఉంటాడు. ఎవరి శాఖను వారు సక్రమమైన మార్గంలో చూసుకుంటూ ఉంటారు. ఈ మూడింటిపై ఆధిపతి ఒకడు ఉంటాడు. అతడే ప్రైమ్ మినిస్టర్ అనుకోండి. లేక, చీఫ్ మినిస్టర్ అనుకోండి. అతని పేరే God (భగవంతుడు). ఆతనినే అల్లా అని కూడా అన్నారు. సృష్టిస్థితిలయములు మూడింటిని తన హస్తమునందు ఉంచుకొన్న భగవంతునికి అనేక రూపనామములు కల్పిస్తూ వచ్చారు. ఆంగ్లములో భగవంతుని God అన్నారు. G అనగా Generation (సృష్టి); ౦ అనగా Organisation (స్థితి); D అనగా Destruction (లయము). ఈ మూడింటి ఏకత్వమునే God అన్నారు. కనుక, సృష్టిస్థితిలయములకు దివ్యత్వమే మూలకారణం. కాని, ఈ దివ్యత్వమును మానవులు అర్థం చేసుకోలేక పోతున్నారు. బ్రహ్మవిష్ణు మహేశ్వరులు మానవునిలో అంతర్భూతమై ఉన్న శక్తులే. దీనిని అర్థం చేసుకోవలెనన్న ఆధ్యాత్మిక తత్వము అత్యవసరము.
(స.సా.మా. 86 పు 58)
(చూ ఆరాధన, దైవము, భగవదన్వేషణ)