మానవ ఆకారములే వారి ఆకారములు, వారికి ప్రత్యేకమైన ఆకారములు లేవు. ఆత్మకు ఎట్టి ఆకారము? ఆదియే చైతన్య స్వరూపము. కనుక అట్టి చైతన్య స్వరూపుడైన ఈశ్వరత్వానికి ఏరూపమూ లేదు. ఈ చైతన్య స్వరూపానికే ‘ఈశ్వరత్వము అని పేరు పెట్టారు. ఈ కాన్షస్ నెస్ నుంచి కానెస్ వచ్చి హృదయములో చేరింది. అదియే మైండ్. ఆ మైండు నుంచి కాన్షన్" అనేటటువంటి వాక్ స్వరూపుడై పోయినాడు. అనేక పర్యాయాలు చెప్పాను.
The one you think you are
(నీవనుకుంటున్ననీవు)
The one others think you are
(ఇతరులు భావించే నీవు)
The one you really are
(నిజంగా నీవైన నీవు)
ఈ మూడింటి యొక్క ఆకారములే బ్రహ్మ విష్ణుమహేశ్వర స్వరూపులు. కనుక బ్రహ్మ వాక్ స్వరూపుడు, విష్ణువు మనో స్వరూపుడు. విష్ణువుకు వున్న సర్వవ్యాపకత్వం మనస్సుకు కూడా ఉంటున్నది. విష్ణువు అనగా సర్వ వ్యాపకత్వంతో కూడినటువంటివాడు. మనసు కూడా అంతే. ‘మనోమూల మిదం జగత్’. ఏ క్షణమందైనా, ఏ ప్రదేశము నందైనా ఏ కాలమునందైనా, ఏ దేశమునందైనా సంచరిస్తుంటుంది మనసు. దేశకాల పరిస్థితుల ప్రభావములకు ఏమాత్రం యీ మూడునూ లొంగునవి కావు. కనుకనే బ్రహ్మ అనగా వాక్ స్వరూపమైనటు వంటివాడు. ఇతని ఆకారమునకు గాని, పేరుకుగాని ఒక పరిమితము అనేది లేదు. విష్ణువు అనగా విశ్వమంతా వ్యాపించినటు వంటివాడు. కనుక ఇతనికి ఒక ఆకారము లేదు. ఇక వాక్కు. ఇదే శబ్ద బ్రహ్మమయి. దీనికి కూడనూ ఒక పరిమితము లేదు. కనక బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనగా పరిమిత రహితమైనటువంటి సర్వాంతర్యామి స్వరూపులు. ఈ సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు అణుమాత్రమైన దేహమునందు ఆవిర్భవించారు. ‘అణోరణీయాం మహతో మహీయాం మహత్తరమైనటువంటి ఈ శక్తులు అణుశక్తియగు ఈ దేహమునందు లీనమై ఉన్నవి.
(శ్రీ. వా, 2000 పు. 27/28)
సత్యవాక్కు బ్రహ్మ స్వరూపము. సత్యముకంటే మించినది మరొకటి లేదు. మనసు విష్ణు స్వరూపము. హృదయమే శివస్వరూపము. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆకార స్వరూపులుగా కాకుండా, గుణస్వరూపులుగా ఉంటున్నారు. భగవంతుడు అభీష్టాలను నెరవేరుస్తుంటాడు. చెడ్డను సంహరిస్తుంటాడు. భక్తులు చేసే పూజలను పరిగణనలోనికి తీసుకొని, భగవంతుడు అనుగ్రహిస్తు ఉంటాడు. ఎలాంటి పరిస్థితులలోనైనాసరే తప్పక రక్షిస్తాడు. ఏమాత్రం సందేహించవద్దు. కనుక ఈ సత్యమును గుర్తించి, హృదయాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశ పెట్టండి. నా హృదయమే ఈశ్వరుడు, నా మనసే విష్ణువు, నా వాక్కే బ్రహ్మ - ఈ మూడింటిని పూర్తిగా నమ్మి, ఆ మూడింటిని సద్వినియోగపరచుకుంటూ రండి. మీకు సద్దతి తప్పక కలుగుతుంది. అన్నివిధాల మీరు దైవములోనే లీనమవుతారు.
ప్రేమస్వరూపులారా!
మీరందరూత్రిమూర్తిస్వరూపులే, త్రిమూర్తాత్మక రూపులే, త్రిగుణస్వరూపులే, త్రినే త్రస్వరూపులే. ఈ సత్యాన్ని విస్మరించకండి. కాలము చాలా పవిత్రమైనటు వంటిది. ఈ కాలాన్ని పవిత్రంగావించడానికి మంచి మాటలు, మంచి మనసు, మంచి హృదయము కలిగి ఉండండి. ఈ అన్నింటికన్నా ప్రేమను ప్రధానంగా పెట్టుకోండి.
(శ్రీ. వా.జూ. 2000 పు.32)
వాక్కే బ్రహ్మ, మనస్సే విష్ణువు, హృదయమే ఈశ్వరుడు. ప్రతి మానవుడు త్రిమూర్తి స్వరూపుడే. కనుకనే, అతనియందు త్రిగుణములు ఆవిర్భవిస్తున్నాయి.
“త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాపసంహారం ఏకబల్వం శివార్పణం.”
ఈశ్వరునికి త్రినేత్రం ఉందనటంలో అంతరార్థమేమిటి? మానవుడు గతాన్ని, వర్తమానాన్ని చూడగలడుగాని, భవిష్యత్తును చూడలేడు. భవిష్యత్తును చూడగలే నేత్రమే త్రినేత్రము. వర్తమానాన్ని సరియైన స్థితిలో పెట్టుకుంటే భవిష్యత్తు మానవుని చేతిలోనే ఉంటుంది. ఈనాటి మానవుడు ఎప్పుడు చూసినా గడచిపోయినదాన్ని గురించి, గడువబోయేదాన్ని గురించి చింతిస్తుంటాడు. కనుకనే, వర్తమానాన్ని మరిచి పోతున్నాడు. పాస్ట్ (గతము) నుండి వచ్చినదే ప్రెజెంట్ (వర్తమానం): ప్రజెంట్ (వర్తమానం): • ప్రజెంట్ యొక్క ఫలితమే ఫ్యూచర్ (భవిష్యత్తు) ‘పాస్ట్ అనే వృక్షము నుండియే ప్రజెంట్ అనే విత్తనం ఏర్పడింది; ప్రెజెంట్ అనే విత్తనము నుండియే ఫ్యూచర్ అనే వృక్షం ఆవిర్భవిస్తుంది. కాబట్టి, పాస్ట్, ఫ్యూచర్ రెండూ ప్రెజెంట్ లోనే ఇమిడియున్నాయి. ఈ సత్యాన్ని గుర్తించి వర్తమానాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే భవిష్యత్తు సత్ఫలితాల నిస్తుంది. కాబట్టి, మీ మనస్సును వాక్కును పవిత్రంగా పెట్టుకోండి.
(స.సా.జూలై 2000 పు. 202/203)