శంకరుల తరువాత వచ్చిన రామానుజులవారు అద్వైతమును ఖండించలేదు కాని, దానిని కొద్దిగా సవరించి దానికి, విశిష్టాద్వైతము" అని పేరు పెట్టాడు. అద్వైతమును చెరకు రసముతోను, విశిష్టాద్వైతమును చక్కెరతోను పోల్చవచ్చును. మూడవది ద్వైతము. దీనిని మధ్వాచార్యుల వారు ప్రతిపాదించారు. దివ్యత్వము చక్కెరవంటిదైతే తాను ఆ చక్కెరను తినే చీమగా పుట్టాలని ఆకాంక్షించాడు. "నేనే చక్కెరనైతే నాకు కలిగే ఆనందమేమిటి? కనుక నేను చక్కెర కాకూడదు, చక్కెరను తినేవానిగా ఉండాలి" అన్నాడు. మానవుడు తనను తాను దైవానికి అర్పితం చేసుకోకుండా ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని గ్రంథములు చదివినా ఈ చక్కెరను తినే అధికారము రాదు. ఇదిగో అమ్మ ఉప్పు అంటే పట్టమ్మ పప్పు అన్నట్లుగా, "ఓ భగవంతుడా! ఇదిగో నా హృదయమును నీకు అర్పిస్తున్నాను" అన్నప్పుడు భగవంతుడు. "నాయనా! ఇదిగో నీకు చక్కెరను అందిస్తున్నాను" అంటాడు. "యద్భావం తద్భవతి". భగవంతుడు ఎప్పటికీ మారడు. కాని మన భావములు మారితే భగవంతునిలో మార్పు కనిపిస్తుంది. కనుక మొట్టమొదట మన భావములను చక్కగా స్థిరంగా పెట్టుకోవాలి.
(స. సా.. 97 పు.173)