ఒక గృహమునందు ముగ్గురు వ్యక్తులు నివసించు సమయములో ఒకరి నొకరు అర్థము చేసుకొని, ఒకరి నొకరు అనుసరించి అన్యోన్యముగ జీవించినప్పుడు అదియే స్వర్గము. ఆదియే అమృతము. ఆదియే ఆనందము. ఈ విధముగా గాక గృహములో మువ్వురూ మూడు మార్గములను అనుసరిస్తూ, ఒకరి నొకరు అర్థం చేసుకొనక, ఒకరినొకరు భిన్నభావములను అనుసరిస్తూ ద్వేషిస్తూ, జీవించినప్పుడు ఇంతకంటె నరకము మరొకటి లేదు. స్వర్గనరకములు రెండును కూడనూ మానవుని యొక్క ప్రవర్తనలపై ఆధారపడి ఉంటున్నది. మన దేహమే గృహము. ఈ గృహములో మనోవాక్కర్మలనేటటువంటి ముగ్గురు వ్యక్తులు జీవిస్తున్నారు. కనుక ఈ మనస్సు, వాక్కు, ప్రవర్తన ఈ మూడింటిఏకత్వమే నిజమైన మానవత్వము. దీనినే వేదాంత పరిభాషయందు త్రికరణశుద్ధి అన్నారు. మనస్సు తలంచిన దానిని మాట రూపకంగా వెల్లడి చేయడం మాటతో వెల్లడి చేసిన దానినిహస్త రూపకముగా ఆచరిరంచటము. ఈ మూడింటి ఏకత్వమే నిజమైన మోక్షము.
(శ్రీ. ఫి. 1995 - పు. 2)
ఆధ్యాత్మిక చింతన ఒక్క భారత దేశంలోనే కాదు, విదేశాలలో కూడా అభివృద్ధి అవుతున్నది. అనేక మంది విదేశీయులు ఉపనిషత్తులను, బ్రహ్మ సూత్రము లను, భగవద్గీతను అధ్యయనం చేస్తున్నారు. ఇటలీలోని సాయిసంస్థల అధ్యక్షుని కుమార్తె రుద్రమును, భగవద్గీతను ఎంతో స్పష్టంగా చెపుతుంది. ఆమెకు కావలసినంత ధనం ఉన్నది. స్వామి ఏనాటికైనా అక్కడికి రాగలడనే ఉద్దేశ్యంతో మదర్ సాయి అనే పేరుతో 25 ఎకరములలో ఒక భవనమును నిర్మించింది. పూర్ణచంద్రహాలువలె ఒక పెద్ద హాలును. స్వామివెంట వచ్చే విద్యార్థులకు, పెద్దవారికి అనేక గదులను కూడా కట్టించింది. మన ప్రైమరీ స్కూల్ లో చదువుతున్న విదేశీ పిల్లలు ఎంతో చక్కగా వేద పారాయణం చేస్తారు. దీనికి కారణమేమిటి? సత్సాంగత్యమే. భజన, జపము, ధ్యానము ఇవన్నీ సత్కర్మలేగాని, దైవానికి అంత ప్రీతికరమైనవి కావు. దైవానికి ప్రీతి కలిగించాలంటే దేహమును పరోపకార సంబంధమైన కర్మలలో ప్రవేశ పెట్టాలి. మనస్సుతో పవిత్రమైన చింతన చేయాలి, వాక్కు పవిత్రమైనదిగా ఉండాలి. దీనినే భారతీయులు త్రికరణ శుద్ధి" అన్నారు. మీ హృదయమే ఒక ట్యాంకు. మీ చూపులు, మాటలు, నడత ఇవన్నీ ట్యాప్స్ వంటివి. కాబట్టి హృదయాన్ని ప్రేమలో నింపుకున్నప్పుడు మీ సర్వకర్మలు ప్రేమమయం అవుతాయి.
(స.పా.మే.99పు. 137)
(చూ॥ సత్యం )