కర్మకాండ, ఉపాసనకాండ, జ్ఞానకాండ అని వేదం త్రికాండస్వరూపం. మానవుడు కర్మాధిపతి. “కర్మణ్యే వాధికారస్తే” మానవుడు కర్మాధికారముతో కాయమును ధరించాడు. ఈ కర్మలు ధర్మమయమైనవిగా ఆచరించాలి. "శరీర మాద్యం ఖలు ధర్మసాధనమ్ " ధర్మసాధన నిమిత్తమై ఈ కాయము ఆవిర్భవించినదనే సత్యాన్ని గుర్తించాలి. మానవుడు ఆచరించే కర్మలు పరిపక్వస్థితికి వచ్చినప్పుడు ఇదియే ఉపాసనగా మారుతుంది. ఉపాసన దైవార్పిత భావముతో ప్రేమ మయమైన దివ్యతత్త్యముతో ఆచరించినపుడు ఇదియే పూర్ణ జ్ఞానంగా రూపొందుతుంది. ఏతావాతా కర్మోపాసనాజ్ఞానములు మూడు ఒక్కటే. పుష్పముగా పుట్టి కాయగా మారి ఫలముగా రూపొందినట్టుగా కర్మపుష్పము, ఉపాసన కాయ, జ్ఞానము ఫలము. సామాన్య మానవులు కర్మోపాసనాజ్ఞానములు ఆచరించే నిమిత్తమై పురాణేతిహాసములు ఉపాంగములుగా సృష్టింపబడినవి. ఈ వేదము యొక్క అంతమే ఉపనిషత్తు. కనుకనే వేదాంతము అని దీనికి పేరు. ఉపనిషత్తులు యోగత్రయములు అని మూడుగా విభజించి మూడు యోగములను మానవులకు ప్రబోధిస్తూ వచ్చాయి. యోగమనగా అర్పిత భావము. మనము ఏ కర్మలు చేసినా అర్పిత భావముతో ఆచరించాలి. దైవార్పిత భావములో ఆచరించటం చేతనే ఇది దైవార్పిత భావమనే పేరు పొందింది. సర్వకర్మ భగవ త్ప్రీత్య ర్థం అనే మార్గమును అనుసరిస్తూ వచ్చింది. యోగత్రయములో రెండవది ఉపాసనాయోగము. భగవంతుని హృదయ పూర్వకంగా ప్రేమ పూర్వకంగా త్రికరణ శుద్ధిగా ప్రేమించుటే ఉపాసనా యోగము. కేవలము అభీష్టసిద్ధికై కార్యసిద్ధికై లౌకికమైన భ్రాంతులసిద్ధికై ప్రేమించుట ప్రేమ కాదు. ప్రేమనిమిత్తమై ప్రేమించాలి. అదే ఉపాసనా యోగము. ఇంక మూడవది జ్ఞానయోగము. "సర్వం విష్ణు మయం జగత్" అంతా భగవంతుని స్వరూపమే. సర్వుల యందు ఉండినవాడు భగవంతుడు ఒక్కడే. ఏకాత్మభావమే, అద్వైత జ్ఞానమే, విజమైన జ్ఞానమన్నారు. సర్వులయందు దైవత్వము ఆత్మస్వరూపంలో ఉన్నదని విశ్వసించటమే జ్ఞానము.
(బృత్ర.పు. ౧౮౦/౧౮౧)