జ్ఞానమును తండ్రిలాగా గౌరవించండి. ప్రేమను తల్లిలాగా ఆరాధించండి. ధర్మమును సోదరునిలాగా భావించి కలసి, మెలసి తిరగండి. దయను ఆప్తమిత్రునిలాగా విశ్వసించండి. శాంతమును మీ అర్ధాంగిని చేసుకోండి. సహనమును మీ ప్రియ పుత్రునిగా తలంచండి. ఇవే మీకు నిజమైన బంధువులు. వాళ్లలో కలసి, మెలసి కాలం గడపండి. ఈ బంధువులను వదలకండి. నిర్లక్ష్యం చేయకండి.
(శ్రీస.సూ.పు.59)
"ఆత్మైవ చాత్మనో బంధు: తనకు తానే బంధువు. తనకు తానే శత్రువు.
(ని.పు.134)
ఈ లోకముతో రెండునాళ్ల సంబంధమున్నదని, నిత్య సంబంధమున్న పరమాత్మని మరచుట న్యాయముకాదు. (ముందు వ్రాసినట్లు) "బంధువులందరు వాకిటిదాకను, వల్ల కాటకే వత్తురు బంధమణచి నిన్ బాయని ఆపద్బంధువు భగన్నామమేరా" అన్నట్లు, ఎన్నటికీ ఎడబాయని బంధువు అతనొక్కడే. నీ జన్మములందు ఎంతమంది తల్లులూ, ఎంతమంది తండ్రులూ, ఎంతమంది భార్యలూ, భర్తలూ, పుత్రులు, మిత్రులూ, శత్రువులూ జన్మ జన్మకూ లెక్క లేనన్ని మార్లు ఉండినారు. అట్టి సంబంధము నేటికి చిరస్థాయిగా ఉన్నదా? పూర్వ బంధువులందరికీ జ్ఞాపక మున్నదా? నీకు వారు లేరు. వారికి నీవు లేవు. ఇద్దరికి మాత్రము పరమాత్మ ఒక్కడే. అతను మాత్రము ఎన్ని జన్మములైనా మారడు; నిత్యము.
(ధ్యావా. పు. 55)