"దశరథా! నీ పుత్రులు సామాన్యులు కారు. దైవ సంకల్పానుసారం నీకు లభించిన వరప్రసాదాలు, అగ్ని నుండి ఆవిర్భవించిన జ్ఞాన భాస్కరులు. వారికి ఎట్టి ఆపదలు సంభవించవు. కనుక, నీవిచ్చిన మాట ప్రకారం రాముణ్ణి విశ్వామిత్రుని వెంట పంపించు" అని వశిష్టుల వారు నచ్చచెప్పారు.
ఇక్కడ మీరొక ముఖ్య విషయాన్ని గుర్తించాలి.విశ్వామిత్రుడు రాముడొక్కడినే కోరాడు. రాముడు అతని వెంట బయలుదేరాడు. లక్ష్మణుణ్ణి తనవెంట రమ్మని పిలువలేదు. వెళ్ళవలసిందిగా తండ్రి ఆజ్ఞాపించలేదు, రమ్మని విశ్వామిత్రుడు కోరలేదు. కాని, బింబము వెంట ప్రతిబింబము వెళ్ళినట్లుగా రాముని వెంట లక్ష్మణుడు కూడా బయలుదేరాడు. ఎందుకంటే, అతడు రాముని అంశమందలి వాడు. విశ్వామిత్రుడు ఆది దైవసంకల్పమని భావించాడు. తాను వెళ్ళే ముందుగా దశరథునిలో "దశరథా! నాలో లేని శక్తులు లేవు. కాని, నేను యజ్ఞదీక్షలో కూర్చున్నప్పుడు ఎలాంటి హింసకూ పూనుకోకూడదు, రాక్షసులనైనా చంపకూడదు. అది యజ్ఞదీక్షకు సంబంధించిన నియమం. అందుచేతనే రాముణ్ణి నావెంట పంపవలసిందిగా నిన్ను కోరాను" అన్నాడు.
ముగ్గురూ సరయూ తీరానికి చేరుకున్నారు. విశ్వామిత్రుడు "రామా, ఇటురా" అని పిలిచాడు. తాను రాముణ్ణి మాత్రమే పిలిచాడుగాని, లక్ష్మణుణ్ణి పిలువలేదు. అయినప్పటికీ రామునితో పాటు లక్ష్మణుడు కూడా వెళ్ళి విశ్వామిత్రుని దగ్గర కూర్చున్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు "రామలక్ష్మణులారా! ఇది అరణ్యంలో జరిగే యజ్ఞము. నేనుండేది సిద్ధాశ్రమము. అక్కడ వంటావార్పు చేయడానికి వీలుకాదు. మీరు రాజపుత్రులు. రుచికరమైన భోజనమునకు సౌఖ్యవంతమైన జీవితమునకు అలవాటు పడిన వారు, ఇప్పుడు నా వెంట యజ్ఞసంరక్షణకై వస్తున్నారు. అక్కడ మీరెన్ని దినములు ఉండవలసి వస్తుందో! మీకు నిద్ర రాకూడదు. కనుక, నేను మీకు బల , అతిబల" అనే మంత్రముల మపదేశిస్తాను. వాటి ప్రభావం చేత మీకు నిద్రరాదు, ఆకలి దప్పులుండవు." అని పలికాడు. రామలక్ష్మణులకు ఆ మంత్రముల నుపదేశించాడు.
(స.సా.మే. 2002 పు. 139/140)