దశరథునికి లేకలేక రామలక్ష్మణ భరత శతృఘ్నులనే నల్గురు కుమారులు కలిగారు. విశ్వామిత్రుడు తాను తలపెట్టిన యాగసంరక్షణ నిమిత్తమై దశరథుని దగ్గరకు వచ్చాడు. ఆయనను దశరథుడు గౌరవించి, ఉన్నతాసనము నొసంగి “మీరు వచ్చిన కారణము తెలుపుమ"ని ప్రార్థించాడు. అప్పుడు విశ్వామిత్రుడు “దశరథా! లోకకల్యాణ నిమిత్తమై నేనొక యజ్ఞము సేయ సంకల్పించాను. కాని, దీనికి అనేక విధములుగా రాక్షసులు ఆటంకములు కల్గిస్తున్నారు. వారిని సంహరించి యాగసంరక్షణ చేసే శక్తి నాకు లేకపోలేదు. . నావద్ద అన్ని అస్త్రములు ఉంటున్నాయి. అన్ని విధములైన శక్తి సామర్థ్యములు కూడా ఉంటున్నాయి. కాని, యజ్ఞదీక్ష పూనడంచేత నేను ఈ అస్త్రములు ఉపయోగించడానికి, వారిపై ద్వేషము పూనడానికి వీలులేదు. నేను ఋత్విక్ ప్రమాణము స్వీకరించాను. వీరిని నేను శిక్షించ పూనడం ఏమాత్రం సరియైనది కాదు. కనుక, లోకసంరక్షణార్థమై నేను ఆచరించే ఈ యజ్ఞమును సంరక్షించడానికి నీ కుమారులైన రామలక్ష్మణులను పంపమని కోరడానికి వచ్చాను,” అని చెప్పాడు. ఈ మాటలు విన్న దశరథునికి ఒక షాక్ మాదిరి వచ్చింది. “లేతవయస్సులో ఉన్న ఈ పిల్లలు ఇంతవరకు ఇల్లు వదలి వెళ్ళలేదే! రాక్షసుల బారినుండి యాగసంరక్షణ చేసేటువంటి కార్యము నెరవేర్చలేదే! అలాంటి పసికందులను అటువంటి కార్యానికి మీతో పంపడం నాకు సమంజసమని తోచడం లేదు. స్వామి,క్షమించండి.మీ యజ్ఞ సంరక్ష ణ భా రము నేను తీసుకుంటాను. ఎన్ని వేల మంది సైన్యమునైనా నేను తీసుకువస్తాను.
ఈ పసిబాలురను యజ్ఞము నకై తీసుకుపోనక్కర్లేదు. వారికి ఏమీ తెలియదు. అస్త్రశస్త్ర విద్యలలో ఎట్టి అభ్యాసమూ లేదు. ఇలాంటి పిల్లలను ఏరీతిగా యజ్ఞసంరక్షణకు పంపేది?" అని వాపోయాడు . దశరథుడు. అప్పుడు విశ్వామిత్రులవారు కొంత క్రోధము ప్రదర్శిస్తూ “ఇక్ష్వాకు వంశమందు ఆడినమాట తప్పరు. ఇంతకుముందు నేను వచ్చిన కార్యమును తప్పక నెరవేరుస్తానని మాటిచ్చావు నీవు. ఇప్పుడా మాట తప్పడం న్యాయంగా ఉందా నీకు? నీకు న్యాయమైతే నేను వెళ్ళిపోతా,” నన్నాడు. ఋషుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడిన మాట తప్పకూడదు. స్వాముల దగ్గర, పాముల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. "ఇతను ఏ శాపం ఇస్తాడో యేమో” అని కొంచెం భయపడి వసిష్ఠులవారిని పిలిపించాడు దశరథుడు. వసిష్ఠులవారు వచ్చి విశ్వామిత్రునితో సగౌరవంగా సంభాషణ సల్పాడు. ఆ మహర్షి దశరథునితో “నాయనా! మన పిల్లలు సామాన్యమైన పిల్లలు కారు. నీవు కేవలం పుత్రవాత్సల్యంచేత దిగులు చెందుతున్నావు. నీ దృష్టిలో వారు బాలురేగాని, రాక్షసులకు వారు పిడుగులవంటివారు. వారి శక్తిసామర్థ్యములను నీవు ఏమాత్రం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు,” అని చెప్పి రాముణ్ణి పిలిపించాడు. రాముడు వస్తే ప్రక్కన లక్ష్మణుడు కూడా రావాలి. ఇది వారియొక్క అలవాటు. ఇద్దరూ వచ్చి తండ్రికి నమస్కరించారు. గురువైన వసిష్ఠులవారికి నమస్కరించారు. తండ్రిగారు విశ్వామిత్రుణ్ణి పరిచయం చేయడం వలన ఆయనకు కూడా నమస్కరించారు. నెమ్మదిగా నిల్చుకున్నారు. వారిని చూస్తూ కూర్చున్నాడు. విశ్వామిత్రుడు. వారి తేజస్సు ఆయనను మైమరపించింది. వారికి నమస్కారం చేయాలనుకున్నాడు. కాని, పిల్లలకు నమస్కారం చేయడం ఉచితం కాదని తనలో తాను నమస్కరించి వారిని చూస్తూ ఆనందంగా కూర్చున్నాడు.
వష్టమహర్షి దశరథునితో “తక్షణమే రామలక్ష్మణులను విశ్వామిత్రుని వెంట యజ్ఞ సంరక్షణకు పంప”మని చెప్పాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంట పెట్టుకొని సరయూనదీ తీరంలో సిద్ధాశ్రమమునకు చేరి అక్కడ మంత్రోపదేశం చేస్తాను,” అన్నాడు. ఇదియే మాయ. రాముడు సర్వశక్తిమయుడని అని తెలిసి కూడను తిరిగి, మంత్రోపదేశంకోసం ప్రయత్నం చేశాడు విశ్వామిత్రుడు. మహర్షులు కూడా అప్పుడప్పుడు ఈవిధంగా మాయలో పడుతూ వచ్చారు. విశ్వామిత్రుడు మంత్రోపదేశం చేస్తానని రామలక్ష్మణులకు ఎందుకు చెప్పాడు? ఈ సిద్ధాశ్రమంలో రాక్షస సంహారo జరిగింతవరకు అన్నం ముట్టడానికి వీలు కాదు, నిద్రించడానికి అవకాశముండదు. అందువలన ఆహార, నిద్రలు రెండింటినీ జయించే నిమిత్తమై బల అతిబల అనే రెండు మంత్రాలు ఉపదే శించాడు విశ్వామిత్రుడు. బల నిద్రను సాధిస్తుంది, అతిబల ఆకలిని సాధిస్తుంది. కాబట్టి, ఆకలిదప్పులు లేకుండా, నిద్రాహారములు లేకుండా కార్యదీక్షలో మునిగియుండే శక్తిని విశ్వామిత్రుడు అనుగ్రహించాడు. (రామాయణ దర్శనము వేసవి తరగతులు 2002 పు 31-32-35-36)