విలాస వస్తువుల వైపు పరుగిడితే లాభం లేదు. సంసార బంధంలో తగులుకొని అస్వతంత్రుడ వైపోతావు. నీకు కావలసింది బంధ విముక్తి బంధ విమోచన. నీవు దేహసంఘాతము కావు. ఆత్మయే నీవు. అది చేరే వరకు స్వేచ్చ లేదు. శాంతిలేదు.
రాజభవనంలో రామచిలుక సువర్ణపంజరంలో ఉన్నా, ఎప్పుడూ చింతాక్రాంతమై ఉంటుంది. దాని మనసు రుచికరమైన పాలపానీయాల మీద ఉండదు. బంగారు పంజరం మీద ఉండదు. రారాజే తనకు సేవ చేస్తున్నా పట్టించుకోదు. ఏ వనప్రాంతంలో చెట్టుకొమ్మపై ఎపుడు పోయి వాల్తానని ఎదురు చూస్తూ వుంటుంది. అంతవరకు విచార సాగరంలోనే ఉంటుంది. సర్వసౌకర్యాలతో ఉన్నా రాజభవనంలో శరీరం ఉన్నా, చిలుక మనుసు అరణ్యాన్నే కోరుతూ ఉంటుంది. తన జన్మస్థానం అరణ్యం, తన నివాసం చెట్టుకొమ్మ,అవే తనకు కావలసినవి. మానవుడు ఆవిధంగా ఎందుకు తలంచడు? ఈ పాటి బుద్ధి మానవుడికి ఎందుకు ఉండదు? పరమాత్మ వారి జన్మస్థానం. అక్కడికి చేరుకోవాలనే చింత ఎందుకు కలుగదు? తన ఆత్మ స్థానాన్ని చేరుకోవాలి. తాను ఆత్మ స్వరూపుడువని తెలుసుకోవాలి.
(త.శ.మ.పు.46)