"లోభత్వమును మించిన వ్యాధి లేదు
క్రోధమును మించిన శత్రువు లేడు –
జ్ఞాన దారిద్ర్యమును మించిన దుఃఖం లేదు
ఆధ్యాత్మిక జ్ఞానమును మించిన సుఖం లేదు"
జ్ఞానములు ఐదురకములు 1. బుకిష్ నాలెడ్జ్ 2. సూపర్ ఫిషియల్ నాలెడ్జ్ 3. జనరల్ నాలెడ్జ్ 4. డిస్ట్రిమినేషన్ నాలెడ్జ్ 5. ప్రాక్టికల్ నాలెడ్జ్. ఈనాడు ప్రాక్టికల్ నాలెడ్జ్ అత్యవసరం. ఈ జ్ఞానమే మానవునకు మూడవ నేత్రము వంటిది. ఈజ్ఞానం మానవునకు సుఖమునందించునది. లోభమనే రోగమును, క్రోధమనే శత్రువును, దారిద్ర్యమనే దుఃఖమును దూరం గావించుకొనుటకు తగిన జ్ఞానమును మనం పెంచుకోవాలి. ఈ మూడింటి నివారణ నిమిత్తమై మనమీ సమావేశంలో పాల్గొంటున్నాము. జీవితమంటే ఏమిటో మనం కొంత అర్థం చేసుకోవాలి.
“పని పాటలందునే మీ బ్రతుకంత తెల్లారే
ఇదియె జీవితమని ఎంచినారా?
మూడు పూటల మీరు భుజియించి తృప్తిగా
ఇదియె జీవితమని ఎంచినారా?
అలసట తీరగ హాయిగా నిదురించి
ఇదియె జీవితమని ఎంచినారా?
పనికిరాని కబుర్లు పగలంతా మాట్లాడి
ఇదియె జీవితమని ఎంచినారా?
ఇందుకా దేవుడీ జన్మ ఇచ్చినాడు?
తెలివితేటలు కలిగియు తెలియ లేక
కాలమును వ్యర్థంబుగా గడుపదగునె?
మనిషిగా మీరు ఇకనైన మసలరయ్య"
మీకు కావలసినంత తెలివితేటలు ఉంటున్నాయి. కాని, వీటిని మీ జీవిత రహస్యాన్ని జీవిత లక్ష్యాన్ని గుర్తించడానికి ఉపయోగించే బదులు సుఖపడటానికి, ధనం సంపాదించడానికి, పదవుల నందుకోడానికి ఉపయోగిస్తున్నారు. మీ జీవిత గమ్యాన్ని గుర్తించడానికి ఉపయోగించని తెలివితేటలు సార్థకం కావు.
(స. సా,డి. 95 పు.294)