జలమునందు పుట్టిన బుడగ జలమునందే సంచరించి, జలమునందే జీవించి, జలమునందే ఐక్యమైనట్లుగా, ఆనందమునందు పుట్టిన మానవుడు ఆనందమునందే జీవించి, ఆనందమునందే సంచరించి ఆనందమునందే లయమందుటయే నిజమైన జీవిత అంతరార్థము. ఈ దృశ్యకల్పితమైన జగత్తు నందు పంచభూత మిళితమైన జగత్తు నందు పంచభూతములలో పంచకోశములలో జీవించు మానవుడు నిజముగా నిరంతర ఆనందం అందుకోవడం నిమిత్తము సామాన్యమా? అని సందేహింపనక్కరలేదు. మనము ఎక్కడ నివసిస్తున్నాము? భూమా, చాందోగ్య ఉపనిషత్తునందు చెప్పబడినది. భూమా అంటే దైవత్వము. బ్రహ్మత్వము, ఆత్మ యొక్క సహజరూపమే ఆనందము. అది నిరంతరము ఆనంద స్వరూపమే.
నిత్యానందం పరమసుఖం కేవలం జ్ఞానమూర్తిం
ద్వంద్వాతీతం గగన సదృశం తత్త్వమస్యాది లక్ష్యం
ఏకం నిత్యం విమల మచలం సర్వధీసాక్షి భూతం
భావాతీతం త్రిగుణ రహితం సద్గురుం తం నమామి!
కనుక భూమానందం పొందుతూ, దుఃఖమునకు కొంచమైనా అవకాశం ఇవ్వకూడదు. కేవలము మాయ యందు మునిగి, అజ్ఞానమును జయించలేక, స్వార్థమునకు క్రుంగి మానవుడు దుఃఖమునందు కుమిలి పోవుచున్నాడు. ఆశలన్నీ క్రమక్రమముగా తృష్ణగా మారిపోతున్నాయి. తరువాత విచారముగా మారి పోతున్నాయి. విచారములన్ని వాసనగా నిలిచి పోతాయి. వాసనల యందు దుఃఖము మరింత అనివార్యమగును.
(సా.పు. 307/308)