ఈనాడు మనం వినరాని మాటలు వింటున్నాము. కనరాని దృశ్యాలను చూస్తున్నాము. చేయరాని పనులను చేస్తున్నాము. ఇంక శాంతి మనకు ఏ రీతిగా లభిస్తుంది? ఎన్ని పవిత్రమైన ప్రబోధలు విన్నప్పటికీ మానసిక పరివర్తన కలగటం లేదు. హృదయం పరిశుద్ధం కావటం లేదు ఇంక ఎందుకోసం వినాలి? ఎందుకోసం భజనలు చేయాలి? సత్సంగములో చేరినా దుర్భావములు వదలకపోతే ప్రయోజనం ఏమిటి? కొన్ని విషయాలు చెడ్డవని తెలిసినప్పటికీ అందులో ప్రవేశిస్తున్నాము. ఇది మంచిది కాదు. అనేక జన్మల పుణ్యఫలం తో మనం కొనుక్కున్న జీవితమే ఈ మానవ జీవితము. దీనిని కేవలం లౌకికమైన వాంఛలకు అంకితం చేసి దుర్వినియోగం చేసుకోరాదు. రామాయణంలో రావణుడు, భాగవతంలో హిరణ్యకశిపుడు, భారతంలో దుర్యోధనుడు గొప్ప గొప్పవాళ్ళే తక్కువ వాళ్ళేమీ కాదు. వాళ్ళు గొప్ప గొప్ప హీరోలైనప్పటికీ కామ వాంఛవల్ల రావణుడు, క్రోధం వల్ల హిరణ్యకశిపుడు, లోభం వల్ల దుర్యోధనుడు జీవితంలో జీరోలైపోయారు. పాత్ర ఎంత పెద్దది అయినప్పటికీ దానికి చిల్లుంటే నీరు ఒక్క చుక్క అయినా నిలువదు గదా!
(శ్రీ, భ ఉపు.196/197)