శారీరక, వాచిక, మానసికములని ఈ తపస్సులు మూడు విధములు. శారీరక తపస్సు ఆనగా శరీరమును మంచికార్యములలో ప్రవేశపెట్టి దేవతలను, ఋషులను, మహనీయులను గౌరవించి, ప్రార్థించి వారికి కృతజ్ఞులుగా వుండే మార్గము. వారి అనుగ్రహమునకు పాత్రుల కావటంచేత మానవుని యందున్న ఆహంకారము, మమకారము, క్షీణిస్తుంది. ఈ ఆహంకారమమకారములు క్షీణించినచో వినయవిధేయతలు పెరుగుతాయి, సదాచార సంపన్నుడౌతాడు. సత్కర్మలలో ప్రవేశిస్తాడు. సత్సంగముల యందు చేరుతాడు. తద్వారా భగవద్గీత, రామాయణము, భాగవతము, భారతము యిత్యాది గ్రంథముల నంతా పఠిస్తాడు. ఇలాంటివే కాకుండా కొన్ని దానధర్మ కర్మలయందు పాల్గొంటాడు. విద్యాదానము, వైద్యదానము,శ్రమదానము, అన్నదానము, యీ విధముగా భూదానము, గోదానము, సువర్ణదానము, యిలాంటి దానము లనేకముగా చేసి శారీరకమైన పవిత్రతను పెంచుకుంటాడు. అనగా శరీరమును పవిత్రమైన కర్మలలో ప్రవేశపెట్టటం, ఎట్టి దోషములకు కూడను తాను గురికాకుండా చూసుకోవటం, భౌతిక ప్రపంచమునందు యెట్టి దుర్మార్గమునకు పాల్పడకుండా వుండటం, రజోగుణము తమోగుణములకు తప్తుడు కాకుండా వుండటం. వీటి బారినుండి సాధ్యమైనంతవరకు తప్పించుకోవటానికి ప్రయత్నించటము శారీరక తపస్సు, ఇంక వాచికతపస్సు, వాచికమనగా పవిత్రమైన, ప్రియమైన, సత్యమైన మాటలు. సత్యము కదాయని తీవ్రముగా కటువుగా యితరులను బాధించేదిగా, ఇతరులను హింసించేదిగా, ఉండకూడదు. సత్యము కదాయని అప్రీతికరమైనది చెప్పకూడదు. దీని నాధారమే చేసుకొని "అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్, స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్మయం తప ఉచ్చతే" అని చెప్పింది గీత. పవిత్రమైన నాలుకను పరులను సంతోష పెట్టి, అనుకూలపరచి, ఆనందంచే రీతిగా వుపయోగించుకోవాలి. మనస్సు నేమాత్రము నొప్పించ రాదు. ఈ వాక్కు దైవము యొక్క లీలాగుణ విశేషములను వర్ణించాలి. పరులకు సహాయకరమైన పదములను వుపయోగపెట్టాలి. ఇతరులకు సరియైన మార్గాన్ని బోధించాలి. నీకు అనుకూలించే సత్కర్మల యొక్క ఫలితములను యితరులకు అందించటానికి ప్రయత్నించాలి. ఇతరులు పెడమార్గమున పోతుంటే సాధ్యమైనంతవరకు వాక్కు ద్వారా సంస్కరింప చేయటానికి ప్రయత్నించాలి. సత్యములో యేమాత్రము అసత్యము ప్రవేశించకుండా చూసుకోవాలి. సత్యవ్రతుడు కావాలి. అహింసాపరుడు కావాలి.
(శ్రీస. గీ. పు.94/95)