ఈనాటి మానవుడు తనలో ఉన్న దోషాలనే ఇతరులపై ఆరోపిస్తున్నాడు. "తప్పు లెన్నువారు తమ తప్పులెఱుగరు", మీలో చెడ్డ భావాలను నింపుకొని ఇతరులను చెడ్డవారిగా భావించటం ఎంత పొరపాటు! నిజంగా మీయందు మంచి భావములే ఉంటే అందరిలోను మీకు మంచి భావములే కనిపిస్తాయి. మీరు ఏది తిన్నారో దాని వాసనే మీకు త్రేన్పుగా వస్తుంది. మీరు మామిడి పండు తిని, దాని త్రేన్పు తీసుకుంటూ అది ఇతరుల మామిడి పండు తింటే దాని త్రేన్పు మీకెలా వస్తుంది? మీరు తిన్నటువంటి పండు త్రేనే మీకు వస్తుంది. కాబట్టి ఇతరులలో దోషాల నెంచుతూ, వారిని విమర్శించటం చాల పారపాటు. ఎప్పుడూ ఇతరులలోని చెడ్డనే చూస్తూ, వారిని విమర్శిస్తూ ఉంటే వారికంటే మీరే చెడ్డవారైపోతారు. కనుక, పరులలోని చెడ్డను చూడకండి, మంచినే చూడండి. మీలో ఉన్న చెడ్డను తీసివేయండి, పరుల నుండి మంచిని స్వీకరించండి, మీలో ఉన్న చెడ్డను దూరం చేసుకోండి.
"పరుల తిట్టినంత పాపఫలంబబ్బు
విడువ దెన్నటికిని విశ్వమందు
పరులు పరులు కారు, పరమాత్ముడేయగు
సత్యమైన బాట సాయిమాట"
అందరియందూ ఉన్న భగవంతుడు ఒక్కడే. పరులను దూషిస్తే పరమాత్ముణ్ణి దూషించినట్లే. కాబట్టి ఎవ్వరినీ దూషించ కూడదు. విమర్శించకూడదు. అందరినీ గౌరవించండి. మీరు కూడా అందరిచేత గౌరవింపబడతారు.
(స.పా.మే99 పు.130)
"నీలో లేని తప్పులకు ఎవరేమన్ననూ బాధపడకుము. నీలో ఉన్న తప్పులకు, ఇతరులతో అనిపించు కొనకమునుపే, వానిని సరిచేసికొనుటకు నీలో నీవు ప్రయత్నించు. నీ తప్పులు, నీకు తెలుసు వారిపై నీవు కోపముగాని, ద్వేషము గాని పూనక - నాతప్పులు తెలిపిరే అని తెలిపిన వారిలో వున్న తప్పులను వెదకక, తెలిసిన వారికి కృతజ్ఞత చూపు. అట్లుగాక, వారి తప్పులను వెదికి తెలుపుటలో, మరింత నీదే తప్పగును. నీ తప్పులు, నీవు తెలిసికొనుటలో మంచియున్నదిగాని, నీ తప్పు చెప్పినవారి తప్పులు వెదకటంలో ఏ మంచలేదు. దాని వలన ఏ ఫలమూ ఉండదు.
(సా. లీ. త. పు. 22)
(చూ॥ పాపకృత్యము, శరణాగతి, శిష్యుడు)