శారీరిక, వాచిక, మానసికముల సమన్వయమైన పరివర్తనే, ప్రభావమే తపస్సు, త్రిగుణముల ఏకత్వాన్ని, త్రిగుణముల త్రిపుటి యొక్క సంపూర్తిని అమభవించినట్టు మహనీయుడే మహాత్ముడు.రజోగుణ, తమోగుణముల యేకత్వాన్ని నిర్మూలం గావించి, యింద్రియముల దోషములు నిర్మూలము చేసి, మూడుగుణముల యేకత్వాన్ని అనుభవించే పరిస్థితికే తపస్సు అని పేరు. సాత్వికముచేత రజస్సును అరికట్టి, రజస్సు ద్వారా తమస్సును అరికట్టే మూడింటి తత్వమును యేకత్వముగా భావించే స్థితియే తపస్సు, కట్టకడపటికి సాత్వికమును కూడ తీసివేయాలి. కాలిలో ముల్లు విరిగింది. ఆ ముల్లును తియాలంటే గొడ్డలో కొడవలో యింకే విధమైన కత్తో తీసుకోనవసరము లేదు. తిరిగి యింకొక ముల్లు ద్వారానే యీ ముల్లును తీయాలి. ఒక ముల్లుతో మనకు విరిగిన ముల్లును తీశాము. తీసిన తరువాత విరిగిన ముల్లును,తీసిన ముల్లును రెండింటిని పారవేయాలి. అదే విధముగనే యీ రజస్తమోగుణములనే ముండ్లు బాధిస్తుంటాయి. వీటిని సాత్వికమనే ముల్లుతో తీయాలి. ఈ రెండింటిని తిసేవరకు మాత్రమేయీ ముల్లును భద్రము చేసుకోవాలి. ఈ రెండు ముండ్లు తీసిన తరువాత యీముల్లును కూడా త్యాగము చేయాలి. సత్వగుణము బంగారు గొలుసు వంటిది.రజోగుణము రాగిగొలుసు వంటిది. తమోగుణము యినుప గొలుసు వంటిది.మూడు బంధనలే. బంధమేమో సమానమే. ఈ గొలుసుల విలువలు మాత్రము హెచ్చుతగ్గులుగా వుంటున్నాయి. బంగారు గొలుసుతో చేతులు కట్టేశారని ఆనందిస్తారా? బంధన బంధనే. బంగారు గొలుసుగాని రాగి గొలుసుగాని యినుప గొలుసుగాని బంధనే. ఈ బంధనను విడిపించుకోవాలి. విలువలు హెచ్చు తగ్గులుగా వుండవచ్చును గాని బంధన బంధనే. సాత్వికము కూడ ఒక బంధవే. సత్వగుణము దైవత్వానికి చేరేంతవరకు అవసరము. దైవత్వముతో చేరిన తరువాత యే గుణము అక్కరలేదు. ఈ అమరత్వపు స్థితిలో పల యింకా గుణము లెక్కడివి? ఈ మూడింటిని దైవార్పణగా భావించినప్పుడే సర్వకర్మలు భగవత్ ప్రీత్యర్థంగా అయిపోతాయి.
(శ్రీస. గీ. పు.97/98)
స్వేచ్చగా తిరుగుచున్న మనో బుదీంద్రియ ప్రవర్తనలను, జీవుడు నెమ్మదిగా బోధించి ప్రవర్తనలను భగవత్ గుణ గానములయందు లీన మొనర్చుటకు పూనుకొనును.లేక ఒక విధమైన నిష్టయందు నిమించును. ఒక విధమైన ఉత్తమ మార్గమున ప్రవేశింప జేయును.
“ఈ రీతిగా స్వేచ్చము అణగదొక్కి, ఇంద్రియములను, పవిత్ర పరమాత్మ విషయములందు అంకితము చేసి, జపమో, ధ్యానమో, సత్ కర్మనో, లేక, యింకేవిధమైన పవిత్ర కార్యములందో-ఒకేమాట, ఒకే భావము. ఒకే చేతతో, మనో బుద్ధీంద్రియములను తపింప జేయుటనే, తపస్సని అందురు.
దాని ద్వారా సర్వ పాపములు నశించును. అంతఃకరణము శుద్ధి యగును. అపుడు భగవంతుడు అందే నివసించును. తపస్సు ద్వారా, సర్వ మంగళములూ సమకూరును. కడకు సర్వేశ్వరుడే సాక్షాత్కరించును.
(భా. వా. పు.182)
తపస్పులు భావములను పట్టి, రాజసిక, తామసిక, సాత్విక మను మూడు విధములు కలవు. అయితే దైవ ప్రాప్తికి, సాత్వికమే ప్రధానము. వసిష్ఠ, విశ్వామిత్రాది మహర్షులు, సాత్విక మార్గమున అద్భుత శక్తిని సాధించిరి. కడకు బ్రహ్మఋషి స్థాయికి చెందిరి. వాటిలో మరి మూడు విధములు కలవు. మానసిక, కాయిక, వాచికములను తపస్సులు. ఈ మూడింటియందూ, యేది ప్రధానమని నీవు సంశయించ వచ్చును. మూడు ప్రధానములే. అయిననూ మానసిక తపస్సును ఆధారమే చేసుకొనక, మిగిలన కాయిక, వాచికములు ఆందులోనే యిమిడి పోవును.
(భా. వా. 182/183)
శారీరక తపస్సు: పరోపకార కార్యములలో పాల్గొనుట, పరమాత్మపూజ, భజన, ప్రదక్షిణ, ఆసన, బ్రహ్మచర్య, ప్రాణాయామములతో పవిత్రముచేయుట, దీనులకు రోగులకు సేవచేయుట, సదాచార ప్రవర్తనలతో దేహమును పవిత్రము చేయుట ఇత్యాది సత్ కర్మలకొరకు దేహమును వినియోగించుకొనవలెను.
అతిభాషలేకుండుట, ఆనృతములాడుకుండుట, చాడీలు చెప్పకుండుట, పరులను దూషించకుండుట, కఠినోక్తు లాడకుండుట, మథుర మయిన పలుకులు మాధవస్మరణ లతో వాక్కులను పవిత్రమును చేయుచుండుట, ఇట్టి మనో వాక్కాయములను ఉత్తమమైన మార్గమున వినియోగించిన, నిజమయిన తపస్సనబడును.
ఇందులో యే ఒకటి పవిత్రము కాకపోయిననూ అనగా మనో తపస్సు గాని, శారీరక తపస్సుకానీ, వాక్ తపస్సుకానీ పవిత్రముగా లేకుండిన ఆత్మజ్యోతి ప్రకాశించదు, ఎట్లన, దీపము వెలిగించుటకు వత్తి, మానె ప్రమిద, యెట్లు అవసరమో, అటులనే దేహము, ప్రమిద, మనస్సు నూనె, వాక్కు వత్తి: ఈ మూడింటి సమ్మేళనే జ్యోతి ప్రకాశమునకు మూలాధారము.
(గీ. పు.232/233)
తపస్సు అనగా కాళ్ళు పైకి, తలక్రింద పెట్టి గబ్బిలము వలె వ్రేలాడుట కాదు. లేదా, ఆస్తిపాస్తులు వీడి ఆలుబిడ్డల వీడి, ముక్కుమూసుకుని, డొక్కలు కొట్టుట కాదు. కాయిక, వాచిక, మానసికములు మూడింటిని ఒక్కటిగా చేసి, త్రికరణశుద్ధిగా ప్రవర్తించుటే తపస్సు అనబడును. ఇది కర్తవ్యరహితముగా చేయవలయును. ఆత్మతృప్తి నిమిత్తమై పడు ఆరాటమే తపస్సు. లౌకికములైన సుఖభాగ్యములన్నీ కూడా సత్యమని, నిత్యమని భావించి, దాని నిమిత్తమై అర్రులుచాచి వాటికి మన జీవితమును అంకితము గావించుచున్నాము. ఇవన్నీ మధ్యలో చేరినట్టివే గాని శాశ్వతమైనది దైవమొక్కటే! అనుగ్రహమునకు దూరమైన తర్వాత అన్ని గ్రహములు నెత్తిన కూర్చుంటాయి. అనుగ్రహమే ఉండిన అన్ని గ్రహములు పటాపంచలయిపోతాయి.
(శ్రీభ.. ఉ.పు.14)
(చూ|| ఆష్టవిధ పుష్పములు, ఆత్మవిద్య, ఆహారము, పృశ్ని, బ్రహ్మయజ్ఞము, మనో తపము, శాంతము)