ఒకసారి పుట్టిన తరువాత మళ్ళీ ఇంకొకసారి పుట్టకూడదు. మళ్ళీ పుట్టకుండా ఉండటానికే మనం పుట్టింది. ఇదే మనం తెలుసుకోవలసింది. ఇదే ఆత్మజ్ఞానం. దొంగతనం చేసి పట్టుబడ్డ ఒక వ్యక్తికి పదేళ్ళు కఠిన కారాగార శిక్ష పడింది. శిక్ష పూర్తి కాగానే జైలు అధికారి, "నిన్ను వదలివేస్తున్నాం, నీ తట్టా బుట్టా మూట గట్టుకొని ఇంటికి వెళ్ళు" అన్నాడట. ఆ దొంగ, "ఇవన్నీ ఎందుకు సార్! అన్నీ ఇక్కడే ఉండనీయండి,రేపే మళ్లీ వస్తాను" అన్నాడట. పదేళ్ళు శిక్ష అనుభవించినా మళ్ళీ జైలుకు రావాలనే ఉందతనికి, దృష్టి దొంగతనం మీదే ఉంది. ఈ విధంగా మనం దొంగలం కారాదు. ఈ ప్రపంచమనే జైలుకు మళ్ళీ రాకూడదు. అజ్ఞానమే దొంగతనం. అజ్ఞానం నాశనమైతే మళ్ళీ జన్మలేదు. పరమాత్ముని స్మరించాలి. భజించాలి. అదే జన్మసార్థక మార్గం..
(స.సా.ఫి. 98 పు. 46)