మానవుల కోరికలు, వాంఛలు, సంకల్పాలు, అభీష్టాలు కర్మ ప్రేరితములు. ఇవి అన్నియూ అజ్ఞానము వలన కలుగుచున్నవి. అట్టితరి అజ్ఞానము జ్ఞానము నేరీతిగా చేకూర్చును? చీకటి చీకటిని దూరము చేయలేదు కదా! అటులనే అజ్ఞానము అజ్ఞానమును యేరీతిగా పొగొట్టగలదు? ఇది అసాధ్యము. అందువలన ఆత్మబోధలో అనగా జ్ఞానము చేతనే అజ్ఞానమును పొగొట్టుకొనవచ్చును - అని శంకరులవారి వాదము. సమన్వయము ప్రపంచమున యెంత అవసరమో జ్ఞానమునకు సహితము అంత అవసరం.
బ్రహ్మ విషయము ఇతరులకు అందజేయటమంటే అంత సులభము కాదు. బ్రహ్మ విద్యా ఫలమునకు కర్మ ఫలమునకును మధ్య బేధము కలదని చెప్పబడినది. పుణ్య అపుణ్యములకు సుఖదుఃఖములు ఫలితములు. మనుష్యలోకమునుండి బ్రహ్మలోకమువరకు సుఖ తారతమ్యములున్నవి. అటులనే మనుష్యలోకమునకు క్రిందుగా నరకలోకమనియు అది దుఃఖములతో కూడినదనియూ అనే తారతమ్యములున్నవి. అయితే అవన్నియూ ఉత్పత్తి వినాశములచే కూడినవే. అట్లయిన ఆత్మజ్ఞానము స్వభావసిద్ధముగా నిత్యము, సత్యము, ఇది ఉపాసన విషయమగు విధిఫలము కాదు. మోక్షావస్థ శరీరమునకు అతీతమైనది. అశరీరత్వము మోక్ష స్వభావమయినచో, ఇది సాధించవలసినది గాదు. జ్ఞానముదయించిన తక్షణమే అజ్ఞాన మంతరించును. దీపము వెలిగించిన తక్షణమే చీకటి వుండదుకదా!
బ్రహ్మజ్ఞానము పురుష ప్రయత్నమున లభించునది కాదనుట అంత సమంజసము కాదు అని కొందరి వాదము. అయితే దీనిని శంకరులవారు సమన్వయపరిచిరి. ఇది అనగా జ్ఞానము స్వభావ సిద్ధముగా అందరికీ అంతర్లీనమయి వున్నది. అయితే కర్మకాండ వలనగాని లేదా విచారణవలనగాని అది అధిగత మగునది కాదు అని నిర్ణయించిరి. కర్మ అవిద్యతో విరోధము లేనిది. కావున కర్మ అవిద్యను దూరము చేయజాలదు. అయితే జ్ఞానము అవిద్యను దూరము చేయగలదు. కేవలము కర్మచేత మానవునకు ముక్తి లభించదనియు కర్మచేత చిత్తశుద్ధి కలుగదనియూ ప్రమాణమును తెలుపుచున్నది. కర్మచేత జీవుడు బంధమునకు గురికాగలడు. విద్యచేత విముక్తుడు కాగలడు. అందువలన కర్మయందు ఆసక్తులు కారాదని తెలియవచ్చును. అయితే శాస్త్రము ఒక్కొక్క దగ్గర కర్మను కూడా బోధించుచున్నది. శాస్త్రము తల్లివంటిది. బిడ్డల యోగ్యతలను బట్టి తగిన రీతిగా, సమయ సందర్భములలో వారికి బోధించును. ఇద్దరు బిడ్డలున్న తల్లి, ఒకనికి పూర్ణ ఆరోగ్యమునూ మరొకరికి అజీర్ణరోగమునూ సంభవించినప్పుడు తల్లి ఆరోగ్యవంతున కడిగినవన్ని అందిస్తుంది. అయితే ఆజీర్ణరోగము గల బిడ్డకు, పథ్యము పెట్టి అధికంగా తిననివ్వకుండా చూచుకొంటుంది. అట్లు చేయుటచే తల్లికి ఒక బిడ్డపై ప్రేమ, మరొకబిడ్డపై ద్వేషమా? కాదు. అదేవిధముగా శాస్త్రముకూడా, కర్మ రహస్యము తెలుసుకొన్నవారికి కర్మ విధానమును తెలుపుతుంది. కారణము? జీవితాన్ని బాగుపరచుకొనుటలో కర్మ చాలా ఉపయోగపడుతుంది. కర్మను సత్కర్మగా మార్చుకొనే తెలివితేటలు అందరికీ ప్రధానము. అయితే అదే సర్వస్వము కాదు.
అన్నమయ దేహాన్ని ఆధారము చేసుకొని ఆనందమయ స్వరూపమునకు ప్రయాణము చేయించునదే విచారణ అని ఈ సూత్రము తెలుపుచున్నదది. అయితే ఒకటి స్థూలము. రెండవది మూలము. ఒకటి అధేయము, మరొకటి ఆధారము.
జగత్తు యొక్క అంతరార్ధమును గురించి తమ జ్ఞానము ప్రకటించిన మహాద్రష్టల యొక్క అనుభవములను, భావములనూ, ఈనాటి వారు అంగీకరించుటలేదు. అంగీకరించినచో, కొన్ని మత సిద్ధాంతములు తప్ప మిగిలినవన్నియు సమన్వయత్వమును సృష్టికరించు చున్నవి. వివిధ మతములందు, వివిధ నియమములందు ఒకే భగవంతుడు వ్యవహరింపబడుచున్నాడు. వివిధ యుగములలో వివిధ జాతుల కొరకు వివిధ ప్రవక్తలను భగవంతుడే పంపినట్లు సమన్వయపరుచుచున్నవి అనేక మతములు. నేడు మత పరిస్తితులు ప్రపంచవ్యాప్తము లగుట వలన జీవన్మతముల మైత్రీభావము, ప్రమాణిక తనూ సామరస్యము లేక సమన్వయము కలుగవలసి యున్నది. మహానీయులందరు పరమాత్మ ప్రతిరూపములు, పరమాత్మయందు వారందరూ ఒక్కటే జాతి, ఒక్కటే దేశము. ఆచారములు, విశ్వాసములు మొదలైన వాని ద్వారా, ఎవరి మత ధర్మములు వారు ఇతరులకు తెలియజేయవలసియున్నను, అప్పుడే పరమాత్మ సాన్నిధ్యమును, చిత్తశుద్ధితో, నిండు హృదయముతో సమన్వయపరచవచ్చును. సర్వ ధర్మ హృదయమే ఈ సమన్వయ తత్త్యము. .
(సూ.వా. పు.28/31)