జీవుడు జీవుడుగానే యెప్పుడూ వుంటాడు. దేవుడు దేవుడుగానే యెప్పుడూ ఉంటాడు. జీవుడు దేవుడు కాలేడు అని కొంతమంది అంటారు. అయితే ఆది చాలా తప్పు. అది విషయ విజ్ఞానరహితులు చేసిన తీర్మానము. జీవుడు యెప్పుడూ దేవుడుగా మారక పోతే సత్కర్మలకు, సద్భావాలకు, సంత్సంగములకు,సత్ చింతనలకు, యేమి ఫలితము? జీవుడు దేవుడౌతాడు; నిస్సందేహముగా అవుతాడు. నరుడు నారాయణు డౌతాడు. తత్, త్వం, అసి , అని చెప్పిన తరువాత, త్వం, తత్, ఆయ్యే తీరాలి."
(జా. వా. పు.79)
“పార్థా యెప్పుడుకూడనూ నేను లేనిదిగానీ లేకుండినది గానిలేదు. ఇంతేల నీవునూ ఈ రాజులును ఈ సైన్యమును కూడ అంతే. యెప్పుడునూ మనమందరం లేకుండ పోలేదు" అని "తత్" పదమైన పరమాత్మకు త్వం పరమైన జీవాత్మకూ యేకత్వము చెప్పి "తత్త్వమసి" మహావాక్యార్థాన్ని బోధించెను. కుండకు పూర్వము మట్టి యెట్లువుండునో కల్పితమునకు పూర్వము అధిష్టాన ముండియే యున్నది.
అప్పుడు అర్జునుడు కొంత స్పృహలోనికి వచ్చి "కృష్ణా! నీవు భగవంతుడవు కావచ్చు. నీకు నాశనము లేకుండవచ్చు. కాని నేను యేడ్చుట నీకొరకు కాదుకదా, నిన్న పుట్టి, నేడు వుండి, రేపు గిట్టే మా సంగతి తెలుపుము" అని ప్రార్థించెను. ఇక్కడ చక్కగ గమనించవలెను. తత్ పదార్థమైన భగవంతుడు నిత్యుడు, ఇక వున్నదంతా త్వం పదార్థము. త్వం పదార్థము కూడా నిత్యమే. కానీ నిత్యమంటే పామరులు అంత త్వరగా గ్రహించుకొనలేరు. కానీ ఈ విషయము కృష్ణ పరమాత్మ అందుకొని "బావా! మీ రునూ నిత్యులే తత్త్వం పదార్థములు పరిచ్ఛిన్నాలుగా కమపించినను ఉపాధి వదలి చూచిన రెండూ వకటే. యేరీతిగా నగకు ముందు బంగారమున్నదో, నగలోనూ బంగారమున్నదో, నగ చెడగొట్టిననూ బంగార మున్నదో, అటులనే చిదాకారమైన ఆత్మ దేహముల వెంటరాదు. దేహముల వెంట పోదు" అని అర్జునునకు భోదించెను.
(గీ.పు.26)
నది ప్రవహిస్తూ సముద్రములోనికి చేరుతుంది. సముద్రములోని జలము ఆవిరిగా మారి. మేఘంగా రూపొందుతుంది. మేఘమునుండి వర్షబిందువులు రాలుతాయి. అయితే ప్రవాహమునకు ఈ జలము, తనదని తెలియదు. నదిలోని జలము, సముద్రములోని జలము, మేఘములోని జలము, వర్షములోని జలము, ప్రవాహములోని జలము అంతా ఒకటే. ఇదే ఆత్మ. ఇదే తత్త్వమసి.
(సాపు .388)
ఓంకారమనియేటి ఒకతొట్టెలోను
తత్త్వమసి అనియేటి పరుపు పరచి
ఎఱుకనే బాలుణ్ణి ఏమరక ఉంచి
ఏడు జగములు వీరు ఏకమై ఊప ||జో జో |
(స.పా.జూలై 2001, పు. 208)
(చూ గాయత్రి, జ్ఞానము, భాగవతము)